కొలువుకు ఎవరు అర్హులు..?

ఇచ్చాపురం సంస్థానానికి మహారాజు కీర్తిదేవ్‌. తన సంస్థానంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉండేవాడు. అందుకే ఆయనంటే.. ప్రజలందరికీ చాలా గౌరవం, ఇష్టం. ఆయనకు ఒక కుమార్తె ఉంది

Published : 11 Apr 2024 00:01 IST

ఇచ్చాపురం సంస్థానానికి మహారాజు కీర్తిదేవ్‌. తన సంస్థానంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉండేవాడు. అందుకే ఆయనంటే.. ప్రజలందరికీ చాలా గౌరవం, ఇష్టం. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు శ్రీవల్లి. తండ్రి వయసు మీరడంతో.. ‘నాన్నా! సంస్థానానికి సంబంధించిన విషయాలు చూసుకోవడానికి.. ఒక సహాయకుడిని నియమించుకోండి’ అని సలహా ఇచ్చిందా అమ్మాయి. దాంతో మంత్రికి చెప్పి.. కొలువు కోసం రాజ్యంలో దండోరా వేయించాడు రాజు. సంస్థానంలో కొలువు అనగానే చాలామంది యువకులు పోటీకి వచ్చారు. వారికి కొన్ని పరీక్షలు నిర్వహించారు మహారాజు. అందులో నుంచి.. విజయుడు, సార్థకుడు, కమలుడు అనే ముగ్గురు యువకులు అన్ని పరీక్షలు నెగ్గారు.

అప్పుడు ముగ్గురినీ పిలిచి.. ‘సంస్థానంలో ఒకే కొలువు ఖాళీగా ఉంది. కానీ మీరు ముగ్గురూ పరీక్షల్లో విజయం సాధించారు. కాబట్టి ఒక పది రోజుల పాటు మా అతిథులుగా.. కోటలోనే ఉండండి. ఆ తర్వాత చివరి నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాను’ అన్నాడు కీర్తిదేవ్‌. అలాగేనంటూ జవాబిచ్చారు ఆ ముగ్గురు. కాసేపటికి కోటలో పని చేసే పేరయ్యను పిలిచి.. ‘వీళ్లు ఇప్పుడు మన అతిథులు. పది రోజుల పాటు ఇక్కడ ఉండటానికి ఏర్పాట్లు చూడు’ అని చెప్పాడు మహారాజు. చెప్పినట్లుగానే వాళ్లను అతిథి గృహానికి తీసుకెళ్లి.. ముగ్గురికీ మూడు గదుల్లో వసతులు ఏర్పాటు చేశాడు పేరయ్య. విజయుడు, సార్థకుడు, కమలుడు అక్కడే పదిరోజులు ఉన్నారు.

 గడువు పూర్తయ్యాక.. కీర్తిదేవ్‌ ఒక్కొక్కరిని లోపలికి పిలిచాడు. ముందుగా వెళ్లిన విజయుడిని.. ‘మా పేరయ్య మిమ్మల్ని బాగానే చూసుకున్నాడు కదా!’ అని అడిగాడు. ‘అతడు మాకు అసలు సరిగ్గా వసతులు కల్పించలేదు’ అని ఏకవచనంతో సంబోధిస్తూ చెప్పాడతను. ఇంకా చాలా ఫిర్యాదులు చేశాడు. తర్వాత సార్థకుడు లోపలికి వెళ్లాడు. అతన్ని కూడా రాజు అదే ప్రశ్న అడగటంతో.. ‘మీ అతిథి గృహం నిర్వహించే వ్యక్తి.. కాస్త అవినీతిపరుడిగా అనిపించాడు. ఈ పది రోజులు మాకు వండిన ఆహార పదార్థాల జాబితా నాకు చూపించి సంతకం పెట్టమన్నాడు. వాటి ధరలు మాత్రం.. ఎక్కువగా వేశాడని నా అనుమానం. అందుకే నేను సంతకం చేయలేదు. మిగతా విషయాల్లో చక్కగానే ఉన్నాడు’ అని చెప్పాడు. ఆ తర్వాత కమలుడు.. ‘పేరయ్య మమ్మల్ని చక్కగా చూసుకున్నాడు. చాలా మంచివాడు’ అని బదులిచ్చాడు.

 కాసేపటికి కీర్తిదేవ్‌ బయటకు వచ్చారు. అక్కడే పేరయ్య, విజయుడు, సార్థకుడు, కమలుడు ఉన్నారు. వాళ్లంతా ఎవరికి కొలువు లభిస్తుందో అనే ఆసక్తితో.. రాజు వైపు చూస్తున్నారు. అప్పుడాయన పేరయ్యను పిలిచి.. ‘సంస్థాన వ్యవహారాలలో సహాయకుడిగా ఈ ముగ్గురిలో ఎవరికి అర్హత ఉందో నువ్వే ఎంపిక చేయి’ అన్నాడు. ‘అయ్యా! మీకు సహాయకుడిగా ఉండడానికి సార్థకుడు సరైన వ్యక్తి. అతనికే ఈ కొలువు ఇవ్వండి’ అని చెప్పాడు పేరయ్య. అతడినే ఎంపిక చేయడానికి కారణమేంటని కీర్తిదేవ్‌ ప్రశ్నించగా.. ‘అయ్యా! విజయుడికి తాను తెలివైన వాడిననే గర్వం ఉంది. వయసులో పెద్దవాళ్లను కూడా గౌరవించడు. గ్లాసు నీళ్లు కూడా తెచ్చుకొని తాగే రకం కాదు. ఇక కమలుడు అవినీతిపరుడు. లంచం ఇస్తే ఏ పనైనా చేసేస్తాడు. నేను కూరగాయల ధరలు ఎక్కువ వేసి.. అందులో కొంత మొత్తం తనకు ఇస్తానంటే ఆ జాబితా పై సంతకం పెట్టాడు. అలాంటి వారికి సంస్థానంలో చోటివ్వకూడదు. ఇక సార్థకుడు పేరుకు తగ్గట్టు సార్థకుడే. పెద్దవాళ్లను గౌరవిస్తాడు. ఖాళీగా సమయాన్ని వృథా చేయడు. నేను తోట పని చేస్తుంటే.. నాకు సాయం చేశాడు. అధిక ధరలతో కూరగాయల జాబితా రాసి, అందులో కొంత మొత్తము తనకు లంచం ఇస్తానని చెబితే.. అలాంటి తప్పు చేయనని సంతకం కూడా పెట్టలేదు. అందుకే సార్థకుడే అన్ని విధాలా కొలువుకు అర్హుడు’ అని వివరించాడు పేరయ్య.
అతని మాటలకు మెచ్చిన కీర్తిదేవ్‌.. సార్థకుడిని తన సహాయకుడిగా నియమించుకున్నారు. అప్పటి నుంచి అన్ని విషయాల్లో అతను మహారాజుకు సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. దాంతో.. కీర్తిదేవ్‌ సార్థకుడిలోని మంచి గుణాలు గమనించి, ఆయన కుమార్తె శ్రీవల్లినిచ్చి పెళ్లి చేశాడు. కొన్ని రోజుల తర్వాత సంస్థాన పూర్తి బాధ్యతలు అతనికి అప్పగించి విశ్రాంతి తీసుకున్నాడు.
- మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని