ముళ్లపంది ఎక్కడికెళ్లింది..?

జూలు సవరించుకుంటూ గుహలో నుంచి బయటకు వచ్చిన సింహం.. అక్కడే ఉన్న ముళ్లపందిని ఒక్కసారిగా చూసి భయపడింది. వెంటనే.. ‘ఎవరు నువ్వు? ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే’ అని ప్రశ్నించింది.

Updated : 14 Apr 2024 00:48 IST

జూలు సవరించుకుంటూ గుహలో నుంచి బయటకు వచ్చిన సింహం.. అక్కడే ఉన్న ముళ్లపందిని ఒక్కసారిగా చూసి భయపడింది. వెంటనే.. ‘ఎవరు నువ్వు? ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే’ అని ప్రశ్నించింది. ‘రాజా..! నన్ను ముళ్లపంది అంటారు. నేను ఈ అడవికి కొత్త. ఇక్కడ ఉండటానికి మీ అనుమతి తీసుకుందామని వచ్చాను’ అంటూ వినయంగా సమాధానం ఇచ్చింది. ‘మిగతా జీవులను ఇబ్బంది పెట్టకుండా అడవి నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా నడుచుకో.. నువ్వు ఇక్కడ  ఉండటానికి అనుమతిస్తున్నాను’ అంది సింహం. ‘ధన్యవాదాలు మహారాజా!’ అంటూ నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయిందది.

ఆ మళ్లపందిని చూసి మొదట్లో అడవిలోని జంతువులన్నీ కాస్త భయపడినా.. తర్వాత స్నేహం చేయడం మొదలుపెట్టాయి. ఒంటరిగా వచ్చిన దానికి.. అన్ని జీవులు మంచి నేస్తాలయ్యాయి. ఆహారం కోసం తల్లి జింకలు వెళ్లినప్పుడు.. వాటి పిల్లలకు ఇది తోడుగా ఉండేది. కోతులకు ఆహారం సంపాదించడంలో సహాయం చేసేది. నక్కలతో కలిసి విందు చేసేది. ఇలా.. ఏ జంతువుతో గొడవలు పడకుండా.. అన్నింటితో కలిసిమెలిసి జీవించేది. జంతువులన్నీ ముళ్లపంది మంచితనానికి ఆశ్చర్యపోయాయి.

అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత.. హఠాత్తుగా ఆ ముళ్లపంది కనిపించలేదు. అడవి అంతా ఇదే చర్చ. వారం రోజులు అయిపోయింది.. అయినా దాని జాడ లేదు. అడవిలోని జీవులన్నీ కలిసి సింహం దగ్గరకు వెళ్లి.. విషయం వివరించాయి. దానికి సంబంధించిన వాళ్లు ఎవరైనా గుర్తొచ్చి ఉంటారు, అందుకే వెళ్లిందేమో!’ అని తేలిగ్గా బదులిచ్చింది మృగరాజు. ‘అయినా.. ఇలా చెప్పకుండా వెళ్లడంలో ఆంతర్యం ఏంటి? ఎవరైనా దాని మనసు నొప్పించి ఉంటారా?’ అని జంతువులన్నీ మథనపడ్డాయి. అప్పుడే ఒక నక్క.. ‘మృగరాజా! నాకెందుకో ఆ ముళ్లపంది.. ఏదో దురుద్దేశంతోనే ఈ అడవిలోకి వచ్చిందనిపిస్తోంది. మన రహస్యాలు పక్క అడవి జీవులకు చెప్పి, మన మీద సులభంగా యుద్ధం చేయడానికి వ్యూహం పన్ని ఉంటుందని నా అనుమానం’ అంది. ఆ మాటలు విన్న జంతువులన్నీ ఒక్కసారిగా భయపడిపోసాగాయి. సింహం కూడా దాని గురించే ఆలోచించింది.

‘అందుకే కొత్త జంతువులకు అడవిలోకి ప్రవేశం కల్పించొద్దు. మీరు అదేదీ ఆలోచించకుండా.. దానికి ఇక్కడ స్థానం కల్పించారు’ అని సింహాన్ని చూస్తూ అన్నాయి అక్కడున్న జీవులు. ‘సరే! జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుని ప్రయోజనం లేదు. ఇకనైనా మనం అప్రమత్తం అవుదాం. కొత్తగా ఏ జీవి వచ్చినా మనమంతా సంఘటితం అవుదాం’ అంది ఏనుగు. ముళ్లపంది నమ్మించి మోసం చేసి వెళ్లిందనుకొని.. జంతువులన్నీ దాన్ని తిట్టడం మొదలుపెట్టాయి. ఆ రోజు నుంచి మృగరాజు అడవికి నలువైపులా బలమైన ఎలుగుబంట్లను కాపలా ఉండమని ఆజ్ఞాపించింది. ఎప్పుడు ఏమవుతుందోనని భయపడుతున్న జంతువులను, ఒక ఎలుగు పరిగెత్తుకుంటూ రావడం ఇంకా అయోమయానికి గురి చేసింది. అది సింహం దగ్గరకు వెళ్లి.. ‘మృగరాజా! ఒంటి నిండా బాణాలతో ముళ్లపంది నిర్జీవంగా అడవి చివర్లో పడి ఉంది. పాపం ఎవరో వేటగాడి చేతిలో చనిపోయినట్లుంది’ అని బాధగా చెప్పింది. ‘అయ్యో! ఎంత పని జరిగింది. దాన్ని అనుమానించి మనం చాలా తప్పు చేశాం’ అని విచారం వ్యక్తం చేశాయి జంతువులు. అప్పుడు సింహం.. ‘మిత్రులారా! ఆకారాన్ని చూసి ముందుగా ముళ్ల పందిని అసహ్యించుకున్నాం. తర్వాత దాని మంచితనాన్ని చూసి.. స్నేహం చేశాం. కానీ అది కనిపించకపోయేసరికి అనుమానించాం. ఏ విషయంలోనైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అది మన మంచి కోరి చేసినా.. మనం మాత్రం చెడుగా ఆలోచించాం. ఇప్పటికైనా మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. ప్రతీదాన్ని అనుమానిస్తే.. ఏ బంధానికీ విలువ ఉండదు. ఏమైనా వేటగాళ్లు అడవిలోకి రాకుండా పోరాటం చేసి దాని ప్రాణాన్ని త్యాగం చేసింది. మన ప్రాణాలను నిలబెట్టిన ముళ్లపందికి నివాళులు అర్పిస్తున్నాను’ అంది. ఇక జంతువులన్నీ కూడా మనసులోనే దానికి క్షమాపణలు చెప్పుకొని నివాళులు అర్పించాయి.

వడ్డేపల్లి వెంకటేశ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని