చిన్నూకు నచ్చని బెండకాయ కూర!

చిన్నూకు వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. మొదటి పరీక్ష రాసి ఇంటికి ముఖం వేలాడేసుకుని వచ్చాడు. ‘చిన్నూ! ఎందుకలా ఉన్నావు? పరీక్ష బాగా రాయలేదా?’ అని అడిగింది చిన్నూ వాళ్ల అమ్మ లలిత.

Updated : 16 Apr 2024 04:41 IST

చిన్నూకు వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. మొదటి పరీక్ష రాసి ఇంటికి ముఖం వేలాడేసుకుని వచ్చాడు. ‘చిన్నూ! ఎందుకలా ఉన్నావు? పరీక్ష బాగా రాయలేదా?’ అని అడిగింది చిన్నూ వాళ్ల అమ్మ లలిత. ‘నాకు సమయం సరిపోలేదమ్మా... ప్రశ్నపత్రంలో చాలామటుకు నాకు వచ్చు. కొన్ని జవాబులు మాత్రమే రావు’ బిక్క మొహంతో అన్నాడు చిన్నూ. ‘అదేంటీ? దాదాపు అన్నీ వచ్చినప్పుడు రాయడానికి ఎందుకు సమయం సరిపోలేదు?’ అని ఆశ్చర్యంగా అంది లలిత.
‘నేను ముందు రానివాటి గురించి ఆలోచించాను. అవి రాసిన తరువాత నాకు వచ్చినవి రాద్దామనుకున్నాను. రానివాటి గురించి ఆలోచించడం వల్ల వచ్చినవి కూడా మరచిపోయాను’ ఏడుపు గొంతుతో అన్నాడు చిన్నూ. ‘నువ్వు ముందు బాధ పడటం ఆపి ఇలా కూర్చో.. చిన్నూ!’ అంటూ.. లాలనగా దగ్గర కూర్చోబెట్టుకుంది లలిత. చిన్నూ ముఖంలో చాలా బాధ కనిపిస్తోంది.
‘చిన్నూ! ప్రశ్నపత్రం తీసుకోగానే ముందు మనకు బాగా వచ్చినవి రాసేయాలి. తరువాత పర్వాలేదు అనుకున్నవి రాయాలి. చివరకు రానివాటి కోసం ప్రయత్నించాలి. ఏదీ వదిలేయకూడదు. జవాబు వచ్చినంత వరకు రాయాలి’ అని చెప్పింది లలిత. ‘నాకు యూనిట్‌ పరీక్షల్లో కూడా మార్కులు తక్కువ వచ్చాయి. అప్పుడు టీచర్‌ నువ్వు చెప్పినట్లే చెప్పారు. కానీ అలా వచ్చినవి ముందు రాస్తే, రానివి పూర్తిగా మరిచిపోతా కదమ్మా!’ అన్నాడు చిన్నూ.  
‘చిన్నూ! మనకు వచ్చిన జవాబులు రాయడానికి ఎక్కువ ఆలోచించే అవసరముండదు. గబగబా రాసేస్తాం. దాంతో మనకు సమయం కలిసి వస్తుంది’ అంది లలిత. అర్థం కానట్లు చూస్తున్నాడు చిన్నూ. ‘తరువాత రానివాటి కోసం సమయం అధికమైనా, ఎక్కువ మార్కులు తగ్గవు’ అంది లలిత.
‘అయితే ఇప్పుడు నాకు మార్కులు తక్కువ వస్తాయా?’ అని మళ్లీ దిగాలుగా అన్నాడు చిన్నూ. ‘నువ్వు ఇలా బాధ పడుతుంటే నిజంగానే మిగిలిన పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయి. నిరాశ మనిషిని కృంగిపోయేలా చేస్తుంది. ఒక పరీక్షలో మార్కులు తగ్గాయని బాధ పడుతూ కూర్చుంటే మిగిలిన వాటిల్లో కూడా తగ్గుతాయి. నువ్వు చేసిన పొరపాటు సరిదిద్దుకుని బాగా చదువుకుంటే, అన్నింట్లో మార్కులు బాగానే వస్తాయి’ అని సర్దిచెప్పింది లలిత. ఆమె ఎంత చెప్పినా చిన్నూ ముఖంలో చాలా బాధ కనిపిస్తోంది. టీచర్‌ చెప్పినా, తను వివరించినా అసలు విషయం చిన్నూకు అర్థం కాలేదని గమనించింది.
‘చిన్నూ! ఈ రోజు నీకు ఇష్టమైన బంగాళదుంపల కూర చేశాను. తొందరగా పుస్తకాలు సర్దుకుని వస్తే భోజనం పెడతాను’ అంది లలిత. ‘అలాగే అమ్మా’ అంటూ పుస్తకాల సంచి అల్మారాలో పెట్టుకుని, కాళ్లు చేతులు కడుక్కొని అమ్మ దగ్గరకు వెళ్లాడు చిన్నూ. లలిత పళ్లెంలో అన్నం పెట్టి బెండకాయ కూర కలిపి చిన్నూ ముందర పెట్టింది.
‘ఇదేంటమ్మా! నాకు ఈ కూర ఇష్టముండదని తెలుసు కదా. నాకు ఆలూ కావాలి’ అని ముఖం చిట్లించి అన్నాడు చిన్నూ. ‘ముందు నీకు నచ్చని కూరతో తిను, తరువాత నీకు నచ్చిన కూరతో తిను చిన్నూ!’ అంది లలిత. ‘నేనలా తినను. ముందు నాకు ఇష్టమైన దాంతోనే తింటాను’ అని పేచీ పెట్టాడు.
‘చూశావా చిన్నూ!... మనకు నచ్చిందయితేనే ఇష్టంగా, తొందరగా తినగలం. నచ్చనివి తినాలంటే అయిష్టంగా అనిపించి చాలా సేపు నెమ్మదిగా తింటాము. చదువు కూడా అంతే. మనకు వచ్చిన ప్రశ్నలకు జవాబులు గబగబా రాసేయగలం. రాని ప్రశ్నలకు జవాబులు రాయడానికి మనకు ఆలోచించడంతోనే చాలా సమయం వృథా అవుతుంది’ అంది లలిత. చిన్నూకు విషయం బాగా అర్థమైనట్లుగా అతడి ముఖం వికసించింది.
‘సరేనమ్మా! ఇక నుంచి నేను పరీక్షల్లో ముందు వచ్చిన జవాబులను మాత్రమే రాస్తాను. కానీ ఇప్పుడు మాత్రం నాకు ఆలూనే కావాలి’ అని బుంగమూతి పెడుతూ అన్నాడు. ‘సరే చిన్నూ! నీకు అర్థం కావాలని బెండకాయ కూర కలిపాను. ఇప్పుడు నీకు నచ్చిందే పెడతాను’ అని నవ్వుతూ అంది లలిత. అప్పటి నుంచి పరీక్షల్లో జవాబులు రాయడానికి సమయం సరిపోలేదు అని చిన్నూ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు.

కె.వి.సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని