దొరికిన ఉత్తరాల దొంగ!

నందనం అడవికి రాజు సింహం. నందనంలో ఉండే జంతువులు, పక్షులకు చుట్టు పక్క అడవుల్లో చాలా మంది బంధువులు, స్నేహితులు ఉండేవారు. వాటి మధ్య యోగక్షేమాలు, ఇతర సమాచారాలు చేరవేయటానికి కోతిని నియమించింది సింహం. ప్రతిరోజూ ఉదయం సింహం గుహకు చేరిన ఉత్తరాలను కోతి ఒక సంచిలో వేసుకుని వాటి చిరునామాలకు చేరవేసేది. ఒకరోజు కోతి, సంచిలో ఉత్తరాలు వేసుకుని అడవిలో నడుస్తుండగా...

Published : 18 Apr 2024 01:17 IST

నందనం అడవికి రాజు సింహం. నందనంలో ఉండే జంతువులు, పక్షులకు చుట్టు పక్క అడవుల్లో చాలా మంది బంధువులు, స్నేహితులు ఉండేవారు. వాటి మధ్య యోగక్షేమాలు, ఇతర సమాచారాలు చేరవేయటానికి కోతిని నియమించింది సింహం. ప్రతిరోజూ ఉదయం సింహం గుహకు చేరిన ఉత్తరాలను కోతి ఒక సంచిలో వేసుకుని వాటి చిరునామాలకు చేరవేసేది.

ఒకరోజు కోతి, సంచిలో ఉత్తరాలు వేసుకుని అడవిలో నడుస్తుండగా... ‘మామా! మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా?’ అని అడిగింది ఒక బుజ్జి కుందేలు. ‘రాలేదల్లుడూ! ఇది పదోరోజు నన్ను అడగటం. వస్తే ఇవ్వనా!?’ అంది కోతి. అది అలా పోతుండగా దారిలో... ‘తమ్ముడూ! నాకేమైనా ఉత్తరాలున్నాయా?’ అని అడిగింది ఏనుగు. ‘లేవన్నా!’ అంది కోతి.

అలా ఉత్తరాల సంచితో నడుస్తూ ఉండగా దారిలో ఎలుగుబంటి కనిపించింది. ‘కోతి బావా! నాకు ఉత్తరాలే ఇవ్వటం లేదు!?’ అని పలకరించింది. ‘అయ్యో! వస్తే ఇవ్వనా బావా!’ అని నవ్వింది కోతి.

అదే అడవిలో ఓ నక్క ఉండేది. అది కోతి ఉత్తరాలు గమ్యస్థానాలకు చేర్చటం లేదని, బద్ధకంతో కొద్ది మందికే ఇస్తోందని అన్ని జంతువులకూ చెప్పింది. మృగరాజు గుహ నుంచి ఉత్తరాలు సేకరించి, నేరుగా ఇంటికి పోయి నిద్రపోతోందని ప్రచారం చేసింది. నిజమే కావచ్చని అనుమానించాయి అడవి జీవులు. ఇదే విషయాన్ని మృగరాజుకు చెప్పాయి.

‘కోతి స్వభావం నాకు తెలుసు. అది చాలా మంచిది. అందుకే నేను దాన్ని కొలువులోకి తీసుకున్నాను. అయినా ఫిర్యాదును స్వీకరించి కోతిపై నిఘా పెడతాను!’ అని పంపేసింది సింహం. మరునాడు ఉదయం సింహం గుహ నుంచి ఉత్తరాలు సేకరించింది కోతి.

తానే స్వయంగా వానరాన్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంది సింహం. ఎవరికీ తెలియకుండా దాన్ని అనుసరించింది. దారిలో.. ‘మామా! ఈ రోజైనా మా అమ్మ నుంచి ఉత్తరం వచ్చిందా?’ అని అడిగింది బుజ్జి కుందేలు. ‘వచ్చింది అల్లుడూ! ఇదిగో అందుకో!’ అంది కోతి.

‘నువ్వే చదివి వినిపించు!’ అని అడిగింది కుందేలు. ‘బుజ్జీ! నేనిక్కడ క్షేమం. నువ్వు ఎలా ఉన్నావు? సమయానికి తిని నిద్రపో! ఈ ఉత్తరంతో పాటు నీకు ఇష్టమైన మిఠాయిలు పంపుతున్నాను. అవి కోతి మామ ఇస్తాడు. సంతోషంగా తిను. నేను త్వరలో వస్తాను!’ అని చదివి, మిఠాయిల పొట్లం ఇచ్చింది కోతి. ఇక తర్వాత అక్కడ నుంచి నెమ్మదిగా గుహకు చేరింది సింహం.

మరునాడు ఉదయం.. ‘ప్రభూ! కోతి ఉండే చింతచెట్టు తొర్రలో ఎవరికీ పంచని ఈ ఉత్తరాలు దొరికాయి!’ అని తిరిగి ఆరోపించాయి జంతువులు. ‘మిత్రులారా! కోతి చాలా మంచిది. మీరంతా నక్క మాటలు నమ్మి, కోతిపై ఆరోపణలు చేశారు. నేను నిన్న స్వయంగా కోతిని అనుసరించాను. ఉత్తరాలు అందరికీ పంచటమే కాదు, అమాయకంగా తల్లి ఉత్తరం కోసం ఎదురు చూస్తున్న బుజ్జి కుందేలుకు తానే ఉత్తరం రాసింది. మిఠాయిలు కూడా ఇచ్చి సంతోష పెట్టింది. ఇలా ఎందుకు చేసిందంటే.. ఓ పదిహేను రోజుల క్రితం పక్క అడవికి పోతున్న తల్లి కుందేలును, నక్క చంపి తినటం నేను చూశాను. ఇక మీరు చూపిస్తున్న ఉత్తరాలు నకిలీవి. వీటిని నక్కే సృష్టించి చింతచెట్టు తొర్రలో దాచింది’ అని అసలు నిజాన్ని బయటపెట్టింది సింహం.

అన్నీ కలిసి దూరంగా చెట్టుచాటున దాగున్న నక్కను, సింహం ముందుకు తీసుకు వచ్చాయి. భయంతో నక్క తన తప్పు ఒప్పుకొంది. ఇదంతా తెలియని కోతి అప్పుడే ఉత్తరాలు సేకరించటానికి గుహకు వచ్చింది. ‘ప్రభూ! మీ కొలువులో పనిచేస్తున్న కోతి మీద ఈర్ష్ష్యతో ఇలా చేశానని అంగీకరించింది నక్క. అవమానంతో అది పక్క అడవికి పారిపోయింది. జంతువులన్నీ కోతిని అభినందించాయి.

పైడిమర్రి రామకృష్ణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని