చంద్రసేనుడి మంచితనం..!

అనంతగిరిని చంద్రసేనుడు పాలించేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ప్రతి ఏడాదీ రెండు పంటలు పండటంతో అక్కడి ప్రజలకు ధాన్యం కొరత ఉండేది కాదు.

Updated : 20 Apr 2024 04:39 IST

నంతగిరిని చంద్రసేనుడు పాలించేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ప్రతి ఏడాదీ రెండు పంటలు పండటంతో అక్కడి ప్రజలకు ధాన్యం కొరత ఉండేది కాదు. పచ్చటి చెట్లతో ప్రతి గ్రామం కళకళలాడేది. దాంతో పొరుగున ఉన్న చంద్రగిరి రాజు జయంతుడి కన్ను అనంతగిరి మీద పడింది. అతని సైనిక బలం చాలా ఎక్కువ. ఒకరోజు జయంతుడు.. ‘మాకు సామంత రాజుగా ఉంటావా? లేక యుద్ధానికి సిద్ధమా?’ అని చంద్రసేనుడికి లేఖ రాశాడు. తన దగ్గర ఉన్న ఒక్కొక్క సైనికుడు నలుగురిని ఎదుర్కునే సామర్థ్యం కలవాడు. కానీ చంద్రసేనుడు శాంతిని అనుసరించే వ్యక్తి. లేఖ అందుకున్న ఆయన.. ‘ఒక నెల రోజుల సమయం ఇవ్వండి. మీకు ఏ విషయం అనేది వివరిస్తాను’ అని బదులు లేఖ పంపాడు. ఒక మాసం గడువే కదా అని ఆయన ఏమీ అనలేకపోయాడు.

జయంతుడికి వేట అంటే చాలా ఇష్టం. ఒకరోజు పదిమంది సైనికులతో కలిసి.. గుర్రం మీద చంద్రగిరి, అనంతగిరి పొలిమేరలో అడవికి వేటకు వెళ్లాడు. జింకను వేటాడాలని.. అతి వేగంగా దౌడు తీయిస్తూ అడ్డుగా ఉన్న ముళ్ల పొదల మీద నుంచి గుర్రాన్ని తీసుకెళ్లాడు. దాంతో వెనక కాళ్లకు ముళ్ల కొమ్మలు తగులుకుని గుర్రంతో పాటు రాజు కూడా ఆ పొదల్లో పడిపోయాడు. రాజుతో వచ్చిన సైన్యం వేరే దిక్కుకు వెళ్లింది. ఒంటి నిండా ముళ్లు గుచ్చుకోవడంతో కాపాడమంటూ అరవసాగాడు రాజు. అటుగా వెళ్తున్న కోయలు అది గమనించి.. రాజును, గుర్రాన్ని బయటకు తీశారు. జయంతుడిని భుజాన వేసుకుని, గురాన్ని మెల్లగా నడిపిస్తూ కోయదొర వద్దకు తీసుకెళ్లారు.

ఆయన పసరు ఆకులతో వైద్యం చేసే వీరయ్యను పిలిపించాడు. పసరును సిద్ధం చేసుకున్న తర్వాత ఒకరు ఒంటిలో దిగిన ముళ్లను తీసేస్తుంటే.. ఆయా చోట్ల పసరును రాయసాగాడు వీరయ్య. ఇంకొందరేమో.. గుర్రానికి గుచ్చుకున్న ముళ్లను తొలగించి, దానికి కూడా పసరు మందు చికిత్స చేశారు. కాసేపటికి మెలకువలోకి వచ్చిన రాజు.. ‘నేను ఎక్కడున్నాను?’ అని అడిగాడు. ‘మీరు అనంతగిరి పొలిమేరలోని కోయలగూడెంలో ఉన్నారు’ అని బదులిచ్చాడు కోయదొర. జయంతుడి కోసం వెతుకుతున్న సైనికులు కోయలకు కనిపించడంతో వారిని, రాజు వద్దకు చేర్చారు. అప్పుడిక రాజు.. ‘నేను మా దేశం వెళ్లిపోతాను’ అన్నాడు. ‘మహారాజా! మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కదలడానికి వీల్లేదు. గుచ్చుకున్నవి తుమ్మ ముళ్లు, చాలా విషపూరితమైనవి. కనీసం ఒక పదిహేను రోజుల పాటు ఇక్కడే ఉండి చికిత్స చేయించుకోవాలి. గుర్రం కోలుకోవడానికి ఇంకాస్త సమయం పట్టొచ్చు’ అని చెప్పాడు దొర.

అదే సమయానికి చంద్రసేనుడు అటువైపుగా వెళ్తూ.. జయంతుడిని చూసి, దగ్గరకు వెళ్లి ‘మహారాజుకు వందనం’ అన్నాడు. జయంతుడు ప్రతి నమస్కారం చేసి.. ‘నేనే మీ వద్దకు రావాలనుకున్నాను. కానీ కదల్లేని పరిస్థితిలో ఉన్నాను’ అన్నాడు జయంతుడు. ‘మహారాజా! దొర చెప్పినట్లు పూర్తిగా కోలుకున్నాక వెళ్లండి. గుర్రానికి చికిత్స పూర్తయ్యాక మీ రాజ్యానికి పంపిస్తాను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు చంద్రసేనుడు.

అలా కొన్ని రోజులు గడిచాయి. జయంతుడు పూర్తిగా కోలుకుని రాజ్యానికి చేరుకున్నాడు. అప్పుడు వెళ్లి చంద్రసేనుడిని కలిసి.. ‘నేను మీకు శత్రువును.. బంధించి సులువుగా నా రాజ్యాన్ని హస్తగతం చేసుకోవచ్చు. కానీ అలా చేయకుండా చికిత్స అందించి మానవత్వాన్ని చాటుకున్నారు’ అన్నాడు. ‘గాయపడిన వారిని బంధించడం రాజనీతి కాదు. వారు పూర్తిగా స్పృహలో ఉన్నప్పుడే యుద్ధం చేయాలి. అది ధర్మనీతి’ చెప్పాడు చంద్రసేనుడు. ‘మీరు నెల రోజుల సమయం కావాలని కోరడం మంచి పని అయ్యింది’ అన్నాడు జయంతుడు. ‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మిగిలి ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి అంత సమయం పడుతుంది. యుద్ధం వల్ల అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. నేను శాంతి కోరుకునేవాడిని.. సామంత రాజుగా మీకు తల ఒగ్గి ఉండటం నాకు ఇష్టం లేదు. స్నేహశీలిగా నా రాజ్యాన్ని మీకు అప్పగిద్దామనుకున్నాను’ అని బదులిచ్చాడు చంద్రసేనుడు. ‘ఒక శత్రువుకే ఇంత గౌరవాన్ని ఇచ్చిన మీరు ప్రజలను ఇంకెంత బాగా చూసుకుంటారో అర్థమైంది. నేను పంపిన లేఖను ఉపసంహరించుకుంటున్నాను. నన్ను మీ సోదరుడిగా భావించండి’ అన్నాడు జయంతుడు. ‘అలాగే సోదరా!’ అని ఆలింగనం చేసుకున్నాడు చంద్రసేనుడు.

యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని