గిరికి నిజంగా మంచి కలే వచ్చింది!

ఆ రోజు ఆదివారం. ఉదయాన్నే కాఫీ తాగుతున్న శ్రీలక్ష్మికి ‘థాంక్యూ.. థాంక్యూ!’ అంటూ గట్టిగా అరుస్తున్న కొడుకు గిరి గొంతు వినిపించడంతో ఆశ్చర్యపోయింది.

Updated : 21 Apr 2024 06:58 IST

ఆ రోజు ఆదివారం. ఉదయాన్నే కాఫీ తాగుతున్న శ్రీలక్ష్మికి ‘థాంక్యూ.. థాంక్యూ!’ అంటూ గట్టిగా అరుస్తున్న కొడుకు గిరి గొంతు వినిపించడంతో ఆశ్చర్యపోయింది. గబగబా తన దగ్గరకు పరిగెత్తింది. ఆ అబ్బాయి.. నిద్రలోనే నవ్వుతూ, కలగంటున్నట్లున్నాడు. అప్పుడామె.. ‘నాన్నా గిరీ! లే.. టైమ్‌ చాలా అయింది’ అంటూ నిద్ర లేపింది. దాంతో ఉలిక్కిపడి లేచి.. చుట్టూ చూశాడు. ‘ఇదంతా కలా?’ అని నిరాశగా అన్నాడు. శ్రీలక్ష్మి నవ్వుతూ.. ‘ముందు పళ్లు తోముకుని రా.. ఆ తర్వాత కలేమిటో చెబుదువు కానీ’ అంది. ‘లేదమ్మా..! ముందు కలేంటో చెబుతాను. లేదంటే మర్చిపోతా. ఎంత మంచి కలో!’ అన్నాడా అబ్బాయి పక్క మీదే కూర్చుని. దాంతో ‘అలాగే ఇప్పుడే చెప్పు మరి’ అందామె. ‘అమ్మా..! గిన్నిస్‌ రికార్డు సాధించా తెలుసా?’ అన్నాడు గిరి సంతోషంగా. ‘గిన్నిస్‌ రికార్డే.. ఎందులో?’ అని నవ్వుతూ అడిగింది శ్రీలక్ష్మి. ‘వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు నేను ఓ కొత్త పరికరం కనుక్కున్నానమ్మా! ఇంతవరకు ఎవరూ అలాంటిది తయారు చేయలేదు తెలుసా!’ అన్నాడా అబ్బాయి. ‘నిజంగా మంచి కలే వచ్చింది’ అంది వాళ్లమ్మ.

ఇంతలో.. గిరి వాళ్ల నాన్న గదిలోకి వచ్చి.. ‘నేనంతా విన్నాను. నువ్వు లేచి పళ్లు తోముకుని రా. మనం దీని గురించి మాట్లాడుకుందాం’ అన్నాడు. ఇక వెంటనే లేచి.. పళ్లు శుభ్రం చేసుకొని వచ్చి, అమ్మ ఇచ్చిన పాలు తాగుతూ.. నాన్న దగ్గరకెళ్లి కూర్చున్నాడు గిరి. ‘నాన్నా! పొద్దున్నే వచ్చిన కలలు నిజం అవుతాయని నానమ్మ అప్పుడెప్పుడో చెప్పింది. మరి నా కల పొద్దున్నే కదా వచ్చింది. నిజం అవుతుంది కదూ!’ అని అమాయకంగా అడిగాడు. ఆయన నవ్వుతూ.. ‘నిజం అవుతాయి’ అని అంటుండగానే.. ‘భలే.. భలే..’ అని చప్పట్లు కొట్టాడు గిరి. ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అన్నారు అబ్దుల్‌ కలాం. గొప్ప పనుల గురించిన కలలు మంచివే. అయితే ఊరికే ఊహల్లో తేలిపోతూ ఉంటే లాభం లేదు. వాటిని నిజం చేసుకోవడం ముఖ్యం. అందుకు తగ్గ కృషి చేయాలి. ఇంతకూ కాలుష్యం గురించి కదూ నీ కల?’ అన్నాడు గిరి వాళ్ల నాన్న. ‘అవును నాన్నా.. అలాగే గిన్నిస్‌ రికార్డు గురించి కూడా!’ అని చెప్పాడా అబ్బాయి.

అప్పుడు గిరి వాళ్ల నాన్న.. ‘ఇంతకీ కాలుష్యం ఎన్ని రకాలో తెలుసా?’ అని అడిగాడు. ‘కాలుష్యం ప్రధానంగా మూడు రకాలు.. వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూమి కాలుష్యం. ఇంకా శబ్ద కాలుష్యం కూడా ఉంటుందని మా టీచర్‌ చెప్పారు’ అన్నాడు గిరి. ‘మరి ఈ కాలుష్యాలకు కారణమేంటో చెప్పగలవా?’ అని ప్రశ్నించారాయన. ‘కర్మాగారాలు, వాహనాలు వదిలే పొగ, రసాయనాల విడుదల.. అడవులు, చెత్తను తగలబెట్టడం వల్ల వచ్చే పొగ, వంటచెరకు వినియోగం మొదలైన కారణాల వల్ల గాలి కలుషితం అవుతోంది. పరిశ్రమల వ్యర్థాలను నదులు, కాలువల్లోకి పంపడం, సముద్రాల్లో చెత్త పడేయడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతోంది. నేలలో కలిసిపోని ప్లాస్టిక్‌ వ్యర్థాలు అధికం కావడం, పంట పొలాలకు వాడే రసాయనిక క్రిమి సంహారక మందులు మొదలైన వాటి వల్ల నేల కలుషితమవుతోంది. ఫ్యాక్టరీలు, వాహనాలు, బాణాసంచా చేసే తీవ్ర శబ్దాల వల్ల ధ్వని కాలుష్యం పెరిగిపోతోంది’ అని బదులిచ్చాడా అబ్బాయి. ‘చాలా బాగా చెప్పావు గిరి... వీటిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. అందుకు మొక్కలు నాటడం, ప్లాస్టిక్‌ వాడకం తగ్గించడం, రసాయనిక వ్యర్థాలు నీటి వనరులలో కలవకుండా జాగ్రత్తపడడం, పొలాలకు సేంద్రియ ఎరువులను వాడడం, బ్యాటరీతో నడిచే వాహనాలను వాడటం వంటివి తప్పక పాటించాలి. ఇవన్నీ కూడా ముందు ముందు నీకు ఇంకా బాగా తెలుస్తాయి. కాలుష్యాన్ని అరికట్టినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యం అవుతుంది. నువ్వు ఈ అంశాలపై దృష్టి పెట్టి.. ఆ దిశగా ఆలోచిస్తూ ఉంటే నీ కల తప్పక నిజం అవుతుంది. కాబట్టి పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులు రాసేశాను.. అయిపోయింది అనుకోకుండా, వాటిని ఆచరిస్తూ.. కొత్త ఆలోచన, ప్రయోగాలతో కాలుష్య నివారణ కోసం కృషి చేయాలి.. సరేనా?’ అని చెప్పాడు గిరి వాళ్ల నాన్న. ‘తప్పకుండా నాన్నా!’ అని జవాబిచ్చాడు గిరి. ‘మా గిరి.. తన కలను తప్పక సాకారం చేసుకుంటాడు’ అంటూ కొడుకును దగ్గరికి తీసుకుంది శ్రీలక్ష్మి.

 జె.శ్యామల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు