మృగరాజు మతిమరుపు!

మహేంద్రగిరి అడవిని పాలించే మృగరాజు కేసరికి మతిమరుపు సమస్య వచ్చింది! మంత్రి ఎలుగుబంటిని పిలిచి.. ‘నేను చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నాను. నాకు జ్ఞాపక శక్తి తగ్గిపోయింది.

Updated : 22 Apr 2024 00:21 IST

హేంద్రగిరి అడవిని పాలించే మృగరాజు కేసరికి మతిమరుపు సమస్య వచ్చింది! మంత్రి ఎలుగుబంటిని పిలిచి.. ‘నేను చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నాను. నాకు జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. కాబట్టి నా దైనందిన విషయాలు నాకు జ్ఞాపకం చేయడానికి ఏ జంతువునైనా నియమించుకోవాలి. అందుకు ఏర్పాట్లు చేయి’ అని ఆజ్ఞ జారీ చేసింది. ‘అలాగే మృగరాజా!’ అంది మంత్రి ఎలుగుబంటి.

‘సింహానికి సహాయంగా ఉండడానికి ఆసక్తి ఉన్న జంతువులు గుహ దగ్గరకు రావలెను’ అని అడవి జీవులకు చెప్పమని కాకిని, ఎలుగుబంటి పురమాయించింది. కాకి ఈ విషయాన్ని జంతువులకు తెలియజేసింది. కానీ మృగరాజుతో ఉండడానికి ఏ జంతువూ సాహసం చేయలేదు. ఒక నక్క, తోడేలు మాత్రం మంత్రి ఎలుగుబంటిని కలిశాయి.

‘మృగరాజుకు జ్ఞాపకశక్తి తగ్గింది. మీరిద్దరు రోజుకొకరు చొప్పున సింహం వెన్నంటి ఉండి విషయాలు జ్ఞాపకం చేస్తుండాలి. ఈ రోజు నుంచే ఆ బాధ్యతలు తీసుకోవాలి’ అని నక్క, తోడేలుకు విడమరచి చెప్పింది ఎలుగుబంటి. ఆ రోజే నక్క తన విధుల్లో చేరింది. మరుసటి రోజు తోడేలు మృగరాజు వెన్నంటే నడిచింది. ఇలా కాలం గడుస్తోంది.

అడవిలో ఉన్న కొన్ని జంతువులకు మృగరాజుకు జ్ఞాపకశక్తి తగ్గిందనే విషయం తెలిసింది. అవి సింహం దగ్గరకు వచ్చి తమ సానుభూతి తెలియజేయడం మొదలుపెట్టాయి. ఇలా కొన్ని రోజులు గడిచాక మృగరాజు మంత్రి ఎలుగుబంటిని పిలిచి.. ‘మన అడవి జీవులతో రేపు సమావేశం ఏర్పాటు చేయి’ అని ఆజ్ఞాపించింది. ఎలుగుబంటి సరే అని, కాకితో సమాచారం అడవి జీవులకు చేరవేసింది.

తర్వాత రోజు జంతువులు, పక్షులు.. మృగరాజు గుహ దగ్గరకు వచ్చి చేరాయి. మృగరాజు ఒక బండరాయిపై కూర్చుంది. ఇరువైపులా నక్క, తోడేలు ఉన్నాయి. మంత్రి ఎలుగుబంటి కూడా ఉంది. మృగరాజు సమావేశానికి విచ్చేసిన జంతువులతో... ‘ఈ రోజు సమావేశానికి కారణమేమిటంటే... మంత్రి ఎలుగుబంటి వృద్ధాప్యం వల్ల తన బాధ్యతలను నిర్వర్తించలేకపోతున్నానని నన్ను పదేపదే వేడుకుంటోంది. అందుకే మన అడవి వ్యవహారాలు చక్కగా చూసుకునే మంత్రిని ఎంపిక చేయాలని తలచాను. ఆ క్రమంలోనే నాకు సహాయకులు కావాలని అడవిలోని జంతువులకు తెలియజేశాను. అప్పుడు నక్క, తోడేలు నాకు సహాయంగా ఉండటానికి వచ్చాయి. నేను మతిమరుపుతో బాధపడుతున్నానని, నాకు అన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని అబద్ధం ఆడాను. రోజుకొకరు చొప్పున నాతో పాటు అవి ఉండే విధంగా వాటికి చెప్పి.. వాటి ప్రవర్తన, పనితీరు గమనించాను. నక్క నిరంతరం నా మతిమరుపును ఆసరా చేసుకుని మోసం చేస్తూ తన ఆహార అవసరాలు తీర్చుకునేది. నా మతిమరుపు గురించి అడవిలో కొన్ని జంతువులకు కూడా చెప్పింది. కానీ తోడేలు నాకు సమయానికి అన్ని గుర్తుచేస్తూ చేదోడు వాదోడుగా ఉండేది. మోసం చేయడానికి అది ఎప్పుడూ ప్రయత్నం చేసేది కాదు. అంతేకాకుండా అడవిలోని జంతువులు, పక్షుల యోగక్షేమాలు, కష్టాలు నాకు తెలియజేసేది. ఇంకా వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ఉండడానికి వీలుగా వర్షపు నీరు గుంతల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని సలహాలు కూడా ఇచ్చింది. తోడేలు సలహా వల్ల వర్షపు నీటిని, గుంతల్లోకి చేరే విధంగా కాలువలు తవ్వించాం. అందువల్ల ఈ వేసవిలో నీటి ఎద్దడి తగ్గింది. తోడేలు పనితీరు, ప్రవర్తన నాకు నచ్చాయి. అందుకే మన అడవికి మంత్రిగా తోడేలును నియమిస్తున్నాను’ అని ప్రకటించింది. 

మృగరాజుకు మతిమరుపు అని నమ్మి చాలా సందర్భాల్లో నక్క, దాన్ని మోసం చేసి తన ఆహార అవసరాలు తీర్చుకుంది. ఇప్పుడిక సింహం తనకు మతిమరుపు లేదు అని చెప్పడంతో నక్క తాను చేసిన తప్పులు గుర్తుకు తెచ్చుకుని వణికిపోయింది. వెంటనే మృగరాజు కాళ్లపై పడి.. ‘నన్ను క్షమించండి’ అని ప్రాధేయపడింది.

మృగరాజు, నక్కతో... ‘ఒక బాధ్యతను స్వీకరిస్తానని ముందుకు వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా నెరవేర్చాలి. అప్పుడే విశ్వాసం పెరుగుతుంది. అలాగే యజమాని లోపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగపరచకూడదు’ అని చెప్పి క్షమించింది. మృగరాజు నిర్ణయం విన్న జంతువులన్నీ కూడా తోడేలును మంత్రిగా ఆమోదించాయి. వృద్ధాప్యం కారణంగా బాధ్యతల నుంచి వైదొలుగుతున్న ఎలుగుబంటి, మంత్రిగా నియమితమవుతున్న తోడేలును అభినందించింది.

మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని