ఓ సింహం.. ఆరు ప్రశ్నలు!

సకలం అనే అడవిలో సాధు జంతువులు మాత్రమే ఉండేవి. అవి కలిసిమెలిసి జీవించేవి. వాటికి ఒక ఏనుగు రాజుగా ఉండేది. ఒకరోజు ఎక్కడి నుంచో ఒక సింహం ఆ వనంలోకి ప్రవేశించింది. సాధు జంతువులను విచ్చలవిడిగా వేటాడి చంపసాగింది.

Published : 23 Apr 2024 00:34 IST


కలం అనే అడవిలో సాధు జంతువులు మాత్రమే ఉండేవి. అవి కలిసిమెలిసి జీవించేవి. వాటికి ఒక ఏనుగు రాజుగా ఉండేది. ఒకరోజు ఎక్కడి నుంచో ఒక సింహం ఆ వనంలోకి ప్రవేశించింది. సాధు జంతువులను విచ్చలవిడిగా వేటాడి చంపసాగింది. ఏనుగు దాని అనుచరులతో కలిసి సింహం గుహకు వెళ్లింది. ‘నువ్వు ఇలా విచక్షణ రహితంగా జంతువులను చంపుతూ పోతే తర్వాత నీకు ఆహారానికి జంతువులే ఉండవు. రోజూ ఒక జంతువును నీ దగ్గరకు ఆహారంగా పంపిస్తాను. ఈ పద్ధతి వల్ల నీకు చాలా కాలం తిండి లభిస్తుంది. వేటాడే శ్రమ కూడా ఉండదు’ అంది.

సింహానికి ఏనుగు చెప్పింది సబబుగా అనిపించింది. ఒక నిమిషం ఆలోచించి... ‘నిజమే! విచ్చలవిడిగా వేటాడటం వల్ల నా శక్తి, ఆహారమూ వృథా అవుతోంది. కానీ రోజుకు ఒకటి కాదు, రెండు జంతువులను పంపండి’ అంది. అందుకు ఏనుగు అంగీకరించలేదు. ఒక జంతువును మాత్రమే పంపిస్తానంది.

సింహం మళ్లీ ఒక నిమిషం పాటు ఆలోచించి.. ‘నా దగ్గరికి ఆహారంగా రెండు జంతువులను పంపండి. వాటిని ఆరు ప్రశ్నలడుగుతాను. అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానాలు చెప్పిన జంతువును వదిలేస్తాను. చెప్పని దాన్ని మాత్రమే తింటాను. రెండూ సరైన సమాధానాలు చెప్పకుంటే రెండింటినీ తింటాను. రెండూ సరైన సమాధానాలు చెబితే నేను ఈ అడవి వదిలి వెళ్లిపోతాను. మాట తప్పడం మా వంశంలో లేదు’ అంది.

ఏనుగుకు, సింహం చెప్పిన ఒప్పందం నచ్చింది. ‘రెండు జంతువులూ సరైన సమాధానాలు చెబితే సింహం బాధ తప్పుతుంది కదా!’ అనుకుంది. ‘నా ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానం చెప్పడం జరగని పని. ఏ శ్రమా లేకుండా రోజూ రెండు జంతువులను హాయిగా ఆరగించవచ్చు’ అని అనుకుంది సింహం. ఈ ఒప్పందాన్ని జంతువులన్నింటికీ చెప్పింది ఏనుగు. సమాధానాలు చెబితే.. ఆ సింహం బాధ తప్పుతుందని సంతోషించాయి జంతువులు.

ఆరోజు సింహానికి ఆహారంగా రెండు జింకలను పంపింది ఏనుగు. ఒక జింకను గుహ బయట ఉండమని చెప్పింది సింహం. గుహ లోపలున్న జింకను ఆరు ప్రశ్నలడిగింది. అది సరైన సమాధానాలు చెప్పకపోవడంతో.. దాన్ని చంపి రెండోదాన్ని లోపలికి పిలిచింది. దాన్ని కూడా ప్రశ్నలడిగింది సింహం. ‘నాలుక లేనిది ఏది?.. వెంట్రుకలు లేనిది ఏది?.. జీర్ణశక్తి లేనిది ఏది?.. చెవులు లేనిది ఏది?.. కొలతల లెక్కలు తెలిసింది ఏది?.. ప్రతి జీవికీ ఉండాల్సింది ఏమిటి?..’ ఈ ప్రశ్నలకు మరో జింక కూడా సరైన సమాధానాలు చెప్పలేకపోయింది. దీంతో దాన్ని కూడా చంపి తింది సింహం. అలా సింహం ప్రశ్నలన్నింటికీ ఏ జీవి కూడా.. సరైన సమాధానాలు చెప్పలేక దానికి ఆహారమయ్యేది.

గజరాజుకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ అడవిలో చిట్టి, బుడత అనే రెండు కుందేళ్లు ఉండేవి. అవి చాలా తెలివైనవి.  ఏనుగు వాటిని పిలిచి విషయం వివరించి.. ‘ఆ ప్రశ్నలేమిటో కానీ ఏ జంతువూ సరైన సమాధానాలు చెప్పి ప్రాణాలతో తిరిగి రాలేదు. మన అడవిలో మీకు చాలా తెలివైన వారనే పేరుంది. ఈ రోజు మీరు సింహం దగ్గరకు వెళ్లండి’ అంది. కుందేళ్లు బయలుదేరి గుహ దగ్గరకు చేరుకున్నాయి. సింహం చిట్టిని గుహ లోపలికి పిలిచి, బుడతను బయట ఉండమని చెప్పింది.

సింహం అడిగిన ప్రశ్నలకు.. చిట్టి సరైన సమాధానాలు చెప్పింది. ‘శభాష్‌’ అంది సింహం. తర్వాత బుడతను లోపలికి పిలిచింది. ఆ ఆరు ప్రశ్నలడిగింది. ‘నాలుక లేనిది మొసలి.. వెంట్రుకలు లేనిది తాబేలు.. జీర్ణశక్తి లేనిది చేప.. చెవులు లేనిది పాము.. కొలతల లెక్కల గురించి తెలిసింది గిజిగాడికి.. ప్రతి జీవికి ఉండాల్సింది మంచి మనసు..’ అని అన్నింటికీ సరైన సమాధానాలు చెప్పింది బుడత. ‘శభాష్‌’ అంది సింహం. ‘నాకు మంచి మనసు, మాటకు కట్టుబడే గుణం ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నా’ అంది సింహం. తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అడవిని వదిలి వెళ్లిపోయిందది. దాని పీడ విరగడైనందుకు అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి. దీనికి కారణమైన చిట్టి, బుడతను అన్ని జీవుల సమక్షంలో సత్కరించింది ఏనుగు.

డి.కె.చదువులబాబు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని