కాకికి.. గద్ద సాయం..!

ప్రమధ వనంలో చిన్న జంతువులు, పక్షులు నివాసం ఉంటున్నాయి. అందులో బంగారం అనే అడవి కోడి కూడా ఉంది. అవన్నీ చాలా బాగా కలిసిమెలసి ఉంటాయి.

Updated : 24 Apr 2024 01:10 IST

ప్రమధ వనంలో చిన్న జంతువులు, పక్షులు నివాసం ఉంటున్నాయి. అందులో బంగారం అనే అడవి కోడి కూడా ఉంది. అవన్నీ చాలా బాగా కలిసిమెలసి ఉంటాయి. బంగారానికి.. మాణిక్యం అనే చిన్న పిల్ల ఉంది. దాన్ని చాలా గారాబంగా పెంచుకుంటోందది. ప్రతిరోజూ ఉదయాన్నే బయటకి తీసుకెళ్లి.. మిగతా పక్షులతో ఎలా మెలగాలి, ఆహారం ఎలా సంపాదించుకోవాలో నేర్పించేది. మాణిక్యం అంటే.. అక్కడున్న అన్నీ పక్షులకు ఎంతో ఇష్టం. అక్కడే ఒక చెట్టు మీద కాకి కూడా ఉంటుంది. చాలా కాలం తర్వాత దానికి మూడు పిల్లలు పుట్టాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ.. ఎక్కడెక్కడి నుంచో ఆహారం తీసుకొచ్చి పెట్టేదది.

ఒకరోజు ఎప్పటిలాగే పిల్లలను గూటిలో ఉంచి.. ఆహారం కోసం బయటకు వెళ్లిందా కాకి. తిరిగి వచ్చేసరికి.. మూడు పిల్లల్లో రెండు కనిపించలేదు. ఉన్న ఒక్కటేమో.. పాపం భయంతో వణికిపోసాగింది. పైగా గూడు అంతా రక్తంతో ఉంది. ‘ఎవరో నా పిల్లలను చంపి తినేశారు.. అయ్యో!’ అంటూ ఏడవసాగింది తల్లి కాకి. విషయం తెలిసి చుట్టుపక్కల ఉన్న పక్షులన్నీ అక్కడికి చేరుకుని.. దాన్ని ఓదార్చాయి. ‘ఇది పక్క చెట్టు కింది పుట్టలో ఉన్న పాము పనే అయి ఉంటుంది. నువ్వు బయటకి వెళ్లాక.. అది ఇక్కడిక్కడే తిరిగింది. ఇక్కడేం చేస్తున్నావు అని నేను అడిగితే.. ఊరికే పుట్టలో గాలి ఆడక ఇలా వచ్చాను అని చెప్పింది’ అంది ఉడుత. ‘నా రెండు పిల్లలు ఎలాగూ చనిపోయాయి. ఉన్న ఒక్క దాన్నైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ఆ పాముని ఎదిరించే అంత ధైర్యం నాకు లేదు’ అంటూ బాధపడింది కాకి. అప్పుడే బయట నుంచి వచ్చిన గోరువంక ‘ఏం జరిగింది? అంతా ఎందుకలా ఉన్నారు?’ అని ఆడిగింది. దానికి విషయమంతా వివరించాయి పక్షులు. ‘అది కాకి పిల్లలనే కాదు.. రేపు మన పిల్లల్ని కూడా చంపే ప్రమాదం ఉంది. ఆ పాముని ఎదిరించాలంటే ఒకటే ఉపాయం ఉంది. ఇక్కడికి దగ్గరలో దిరిసన చెట్టు మీద భైరవి అనే గద్ద ఉంది. అది ఓ పట్టాన సహాయం చేయదు. కానీ మనకు అది తప్ప సహాయం చేయగలిగిన వాళ్లు ఎవరూ లేరు. దాన్ని ఒప్పించగలిగితే.. ఈ పాము పీడ తొలగినట్లే’ అందా ఉడుత. ‘అయితే రేపు ఉదయాన్నే.. నేను వెళ్లి ఆ గద్దను కలిసి, సహాయం చేయమని అడిగి వస్తాను’ అంది కాకి.  

 అన్నట్లుగానే ఉదయాన్నే బయలుదేరి ఆ గద్ద దగ్గరకు వెళ్లింది కాకి. అప్పుడే నిద్ర లేచిన గద్ద ‘ఎవరు నువ్వు. ఇంత పొద్దున్నే నా దగ్గరకి వచ్చావు?’ అని ప్రశ్నించింది. ‘మీ సహాయం కోరి వచ్చాను. ప్రస్తుతం మీరు తప్ప నాకు మరో దిక్కు లేదు’ అని దీనంగా అంది కాకి. ‘నాకు వేరే పనేం లేదు అనుకుంటున్నావా? నీకు సాయం చేయడానికి.. పో’ అని కసురుకుందా గద్ద. అయినా అక్కడే ఉండి.. ‘నా బిడ్డను కాపాడండి’ అంటూ వేడుకుందది. ‘అసలేంటి.. నీ గోల? వివరంగా చెప్పు..!’ అని అడిగిందా గద్ద. అప్పుడు కాకి విషయమంతా వివరించగానే.. ‘సరే.. నేను సాయం చేస్తాను. కానీ నాకేంటి లాభం’ అందది. ‘మీకు ఏం కావాలో అడగండి..’ అంది కాకి. ‘మీరుండే చెట్టు దగ్గర బంగారం అనే కోడి ఉంది కదా! దాని బిడ్డ మాణిక్యాన్ని తినాలని ఎప్పటి నుంచో నా ఆశ. నేను ఆ పాము సంగతి చూస్తాను. నువ్వు మాణిక్యాన్ని నా దగ్గరకు తీసుకురా’ అంది గద్ద. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన కాకి.. ‘క్షమించండి! నా బిడ్డ కోసం ఇంకో తల్లికి అన్యాయం చేయలేను. పైగా మాణిక్యం, రోజూ మా అందరి మధ్య తిరిగే చిన్నపిల్ల. అయినా ఆ చిన్నపిల్లని తినాలనుకున్నారంటే.. ఆ పాముకి మీకు తేడా లేనట్టే’ అంటూ గద్దకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది కాకి.

గూడు దగ్గరకు వెళ్లాక, పక్షులన్నింటినీ పిలిచి.. ‘మనం మరో ఉపాయం ఆలోచిద్దాం. ఆ గద్ద కూడా స్వార్థంగా ఆలోచిస్తుంది’ అందది. ఇక అన్ని పక్షులూ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాయి. ఇంతలో గద్ద.. పాముని నోటితో పట్టుకొని వచ్చింది. అది చూసి అన్నీ ఆశ్చర్యపోయాయి. అప్పుడు గద్ద.. ‘నాకు నీ మంచితనం నచ్చింది. నీ బిడ్డను రక్షించుకోవడానికి ఇంకొకరి ప్రాణాలను ఫణంగా పెట్టాలనుకోలేదు. అందుకే ఎలాగైనా నీకు సాయం చేయాలని వచ్చాను. ఆ పాముని చంపేశాను. ఇక మీకు ఎలాంటి భయం లేదు’ అంది గద్ద. దాంతో కాకితో సహా పక్షులన్నీ దానికి కృతజ్ఞతలు తెలిపాయి.
కూచిమంచి నాగేంద్ర  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని