మొగ్గ తొడిగిన మల్లెచెట్టు..!

ఉదయాన్నే నిద్రలేచి.. మల్లెచెట్టు దగ్గరకు వెళ్లిన శ్రేయ ‘భలే.. భలే..! నా మల్లెచెట్టు ఎన్ని పూలు పూసిందో’ అని ఆనందంగా అరిచింది. ‘మరి నా చెట్టెందుకు పూయలేదు?

Published : 02 May 2024 00:03 IST

దయాన్నే నిద్రలేచి.. మల్లెచెట్టు దగ్గరకు వెళ్లిన శ్రేయ ‘భలే.. భలే..! నా మల్లెచెట్టు ఎన్ని పూలు పూసిందో’ అని ఆనందంగా అరిచింది. ‘మరి నా చెట్టెందుకు పూయలేదు? నువ్వు నా చెట్టుకు నీళ్లు పోసి ఉండవు. అసలు నీ కుండీని.. నా కుండీకి దూరంగా పెట్టు’ కోపంగా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన శ్రేష్ఠ. ‘నేను రెండింటికీ నీళ్లు పోశానురా’ తమ్ముడితో మెల్లగా చెప్పింది శ్రేయ. ‘ఇప్పుడు అలాగే చెబుతావు. ఈరోజు నుంచి నువ్వు నా చెట్టు దగ్గరకు రాకు’ కోపంగా అన్నాడు శ్రేష్ఠ. ‘సరే నీ ఇష్టం.. ఇదుగో నా మల్లె చెట్టు ఆ వైపు పెట్టుకుంటున్నా’ అంది శ్రేయ. ఆ సాయంత్రం ఎవరి చెట్టుకు వాళ్లే నీళ్లు పోసుకున్నారు. ఇదంతా వాళ్లమ్మ ఏమీ తెలియనట్టు వెనకగా వెళ్లి గమనించింది.

శ్రేష్ఠ చెట్టు కుండీ నిండుగా నీళ్లు పోశాడు. ‘ఆ చిన్న చెట్టుకు అన్ని నీళ్లు అవసరం లేదు తమ్ముడూ!’ అంది శ్రేయ. ‘నాకు తెలుసు. నీకు కుళ్లు.. అసలు నా చెట్టు గురించి నీకెందుకు’ అన్నాడు శ్రేష్ఠ వాళ్ల అక్కతో. అక్కడే ఉండి ఈ మాటలు విన్న వాళ్లమ్మ.. ‘అక్కని ఎవరైనా అలా అంటారా? తను చెప్పింది నిజమే. చెట్టుకు మరీ ఎక్కువ నీళ్లు పోయకూడదు’ అని చెప్పింది. ‘మీ ఇద్దరూ ఒక్కటేనమ్మా..!’ కాస్త కోపంగా అన్నాడు శ్రేష్ఠ. ‘కోపంలో ఉన్న వాడికి, ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు’ అని ఏమీ అనకుండా ఊరుకుంది వాళ్లమ్మ.

అలా కొన్ని రోజుల వరకు ఉదయం, సాయంత్రం మల్లెచెట్టుకు నీళ్లు పోస్తూనే ఉన్నాడు శ్రేష్ఠ. అలా చేస్తే.. తన చెట్టునిండా మొగ్గలు వచ్చేస్తాయని అనుకుంటున్నాడా అబ్బాయి. కానీ వారం రోజులకే ఆకులు పసుపు రంగులోకి మారిపోయాయి. చెట్టులో కళ మొత్తం తగ్గిపోయింది. అవతల శ్రేయ చెట్టు మాత్రం చక్కగా మొగ్గలతో కళకళలాడుతోంది. దాంతో శ్రేష్ఠకు ఏం చేయాలో అర్థం కాలేదు. ‘నర్సరీ వాళ్లు నీకు మంచి మొక్క ఇచ్చారు, నాకు పిచ్చి మొక్క ఇచ్చారు.. అందుకే ఇలా అయింది. నేను మళ్లీ కొత్త మొక్క తెచ్చుకుంటాను. నీ చెట్టు కన్నా ఎక్కువ పూలు పూసేది కొనుక్కుంటా. చూస్తుండు’ అక్కతో ఉక్రోషంగా అన్నాడా అబ్బాయి.

ఆ రాత్రి భోజనాల వేళ.. శ్రేష్ఠకు ఇష్టమైన పూరీలు, కూర పెట్టింది అమ్మ. తనకు కొసరి కొసరి వడ్డించసాగింది. శ్రేష్ఠ కడుపు నిండిపోయింది. ఇక తినలేకపోతున్నాడు.. అయినా వాళ్లమ్మ ఇంకొంచెం తిను అంటూ మళ్లీ వడ్డించబోయింది. ‘ఎంత ఇష్టమైనా ఒకేసారి ఇన్ని పూరీలు ఎలా తింటానమ్మా’ కాస్త కోపంగా అన్నాడు శ్రేష్ఠ. దాంతో ఆమె చిన్నగా నవ్వి.. ‘నిజమే! ఒక్కసారిగా ఎక్కువ ఎవరూ తినలేరు. ఒకవేళ బలవంతంగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నువ్వు ఇంక తినొద్దులే.. ఇవి దాచిపెడతాను రేపు పొద్దున్నే తిందువు గానీ!’ అంది అమ్మ. శ్రేష్ఠ లేచి బయటికి వెళ్లి చేయి కడుక్కొని వచ్చాడు. తనని పిలిచి, దగ్గర కూర్చోబెట్టుకొని.. ‘మల్లెచెట్టు కూడా నీలాంటిదే. దానికి కావాల్సినంత నీటిని మాత్రమే తీసుకుంటుంది. మరీ ఎక్కువైతే.. ఆకులు పసుపు రంగులోకి మారి, వేర్లు కుళ్లిపోయి.. చివరకు చెట్టు చచ్చిపోతుంది. అందుకే చెట్టుకు తగినన్ని నీళ్లే పోయాలి. అవసరం అనుకుంటే సేంద్రియ ఎరువులు వాడాలి. అప్పుడే చెట్లు చక్కగా పెరిగి ఎక్కువ పూలు పూస్తాయి. కాయలు కాసే చెట్లయితే ఎక్కువ కాయలు కాస్తాయి. మనం చెట్టుకు చేసే పోషణ పైనే దాని ఎదుగుదల ఆధారపడుతుంది’ అని అర్థమయ్యేలా వివరించింది వాళ్లమ్మ.

కాసేపు ఆలోచించిన ఆ అబ్బాయి.. ‘పాపం నా మల్లెచెట్టు, నేను పోసిన అన్ని నీళ్లు తాగలేక నాలాగే ఎంత ఆయాసపడి ఉంటుందో. ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్లే చేస్తానమ్మా. దానికి తగినన్ని నీళ్లే పోస్తాను’ అని అమాయకంగా అన్నాడు. వాళ్ల అక్క వంక చూస్తూ.. ‘ఇక నా మల్లెచెట్టు కూడా నీ చెట్టు లాగా బాగా పూలు పూస్తుంది అక్కా!’ అని అన్నాడా అబ్బాయి. ‘తప్పకుండా పూస్తుంది తమ్ముడూ..! రేపు నేను ఆ కుండీలో గట్టిపడ్డ మట్టిని కూడా తవ్వి, వదులు చేస్తాలే’ అంది శ్రేయ. మరుసటిరోజు ఉదయాన్నే.. రంగు మారిన ఆకుల్ని తుంచేసి, మట్టి వదులు చేసింది శ్రేయ. వారం పాటు దాన్ని శ్రద్ధగా చూశారు.. అంతే! మల్లెచెట్టు మళ్లీ కొత్త ఆకులు తొడిగింది. కొన్నిరోజులకు మొగ్గలు కూడా వచ్చాయి. ఆరోజు శ్రేష్ఠ.. ‘అక్కా! భలే భలే..నా మల్లెచెట్టుకు మొగ్గలు వచ్చాయి. అబ్బ! ఎంత బాగున్నాయో!’ సంతోషంగా అరిచాడు. శ్రేయ పరుగున వెళ్లి చూసి.. ‘అవునురా! ఎంత అందంగా ఉన్నాయో’ అంది ఆనందంగా. ఇక పిల్లల్ని చూస్తూ నవ్వుకుంది వాళ్లమ్మ.

జె.శ్యామల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని