దొంగలు చేసిన సాయం..!

అవంతి రాజ్యంలో బుడగడు, మల్లేశం, బసవయ్య, రంగదాసు అనే నలుగురి దొంగల ముఠా ఉండేది. ఒకరోజు వాళ్లు చలమచర్ల గ్రామాన్ని దోచుకోవడానికి బయలుదేరారు. ఆ ఊరి సమీపంలోకి చేరుకునేసరికే అర్ధరాత్రి అయింది. అలా వెళ్తుండగా వారికి.. ఆ ఊర్లో మంటలు ఎగిసి పడుతుండటం కనిపించింది.

Updated : 04 May 2024 04:31 IST

వంతి రాజ్యంలో బుడగడు, మల్లేశం, బసవయ్య, రంగదాసు అనే నలుగురి దొంగల ముఠా ఉండేది. ఒకరోజు వాళ్లు చలమచర్ల గ్రామాన్ని దోచుకోవడానికి బయలుదేరారు. ఆ ఊరి సమీపంలోకి చేరుకునేసరికే అర్ధరాత్రి అయింది. అలా వెళ్తుండగా వారికి.. ఆ ఊర్లో మంటలు ఎగిసి పడుతుండటం కనిపించింది. ఒక ఇంట్లో వెలుగుతున్న దీపాన్ని, పిల్లి కింద పడేటంతో ఆ మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి కావడంతో.. ఊరంతా గాఢ నిద్రలో ఉన్నారు. దాంతో మంటలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి ఊరంతా వ్యాపించాయి. ఊరు తగలబడిపోవడం చూసి, రంగదాసు ఆనందంతో చప్పట్లు కొడుతూ.. ‘కలిసొచ్చే కాలం అంటే ఇదే.. ఒకవైపు జనాలు తమ ఇళ్లను కాపాడుకునే ప్రయత్నంలో ఉంటారు. ఇంకో వైపు మనం ఏ ఆటంకం లేకుండా ఊరిని దోచుకోవచ్చు’ అన్నాడు. ఆ మాటలు ముఠా నాయకుడు బుడగడికి అస్సలు నచ్చలేదు. దాంతో అతను.. ‘ఊరు తగలబడి పోతుందని.. జనమంతా దుఃఖసాగరంలో ఉంటే, మనం దోచుకోవాలనుకోవడం చాలా తప్పు. ముందు ఆ ఆలోచన మానుకొని, మనం వారికి సహాయం చేద్దాం పదండి!’ అన్నాడు.

ఇక వాళ్లు పరుగున ఊరిలోకి వెళ్లారు. అక్కడ జనం ఏడూస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నలుగురూ సాహసించి తగలబడిపోతున్న ఇళ్లలోకి వెళ్లి.. కదలలేని స్థితిలో ఉన్న ముసలి వాళ్లను బయటకు మోసుకొచ్చారు. వస్తు సామగ్రిని బయటకు తెచ్చారు. దగ్గర్లో ఉన్న బావి నుంచి నీళ్లు తెచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అలా గ్రామస్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. తెల్లవారే సమయానికి మంటలు అదుపులోకి వచ్చాయి. ఇంతలో.. ‘దొంగలు.. దొంగలు..!’ అంటూ అరుపులు వినిపించాయి. వాళ్లు నలుగురే అపరిచితులు కాబట్టి.. అందరికీ వారి మీదే అనుమానం వచ్చింది. ప్రాణాలకు తెగించి సహాయం చేసినప్పటికీ.. నటిస్తూ దోచుకుంటున్నారని అపోహపడ్డారు గ్రామ ప్రజలు. దాంతో వాళ్లను చెట్టుకు కట్టేసి.. రాజ భటులకు అప్పజెప్పారు.

వారం తర్వాత మహారాజు వచ్చి.. ‘మీరు ఆ ఊరిలో దొంగతనం చేశారు. కాబట్టి మీకు శిక్ష తప్పదు’ అన్నాడు. ‘మేం దొంగలం అన్నమాట నిజమే. కానీ ఆ ఊరిలో ఎలాంటి వస్తువులూ దోచుకోలేదు. మమ్మల్ని నమ్మండి. ఇంకెప్పుడూ దొంగతనాలు చేయం’ అని వేడుకున్నారా నలుగురు. ‘జనాలు చమటోడ్చి సంపాదించిన సొమ్మును దోచుకోవడం చాలా తప్పు. నష్టం తప్ప.. మీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మరణదండనే మీకు సరైన శిక్ష’ అని రాజు కోపంగా అన్నాడు. అక్కడున్న ప్రజలు కూడా.. మరణ దండనే తగిన శిక్ష’ అంటూ రాజుకు వంతపాడారు. అప్పుడు అక్కడికి వచ్చిన భద్రయ్య అనే వ్యక్తి.. ‘వారికి మరణ శిక్ష వేయడం సరైంది కాదు. చేసిన తప్పును ఒప్పుకున్న వాళ్లకి క్షమాభిక్ష పెట్టడం ధర్మం. అయినా వాళ్లు ఆ రోజు దొంగతనానికే వచ్చినా.. ఏమీ దోచుకోలేదు. ఊరు తగలబడిపోతుంటే.. వారికి సహాయం చేశారు. ఎంతోమంది ప్రాణాలు రక్షించారు. వీళ్లలో మంచి మనసు కూడా ఉంది. కాబట్టి ఆ నలుగురికి మరణ శిక్ష విధించడం కాకుండా.. మంచి పని ఇప్పించి వారిలో మార్పు వచ్చేలా చేయడం మంచిది. మా పల్లెలో నాకు పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడికి తీసుకెళ్లి నేను శిక్షణ ఇప్పిస్తాను. మంచి మనుషులుగా మారుస్తాను’ అన్నాడు. ఆ మాటలు విన్న రాజు కాసేపు ఆలోచించి.. ‘ఒక అవకాశం ఇస్తున్నాను. అప్పటికీ వారి బుద్ధి మార్చుకోకపోతే శిక్ష మాత్రం తప్పదు’ అన్నాడు.

అలా భద్రయ్య నలుగురినీ తన వెంటపెట్టుకొని వెళ్లాడు. ‘మీరు ఇంతకు ముందు దొంగతనాలు చేశారు కాబట్టి.. మంచి చేసినా ఎవరూ గుర్తించరు. అందుకే మంటల నుంచి ఆ గ్రామ ప్రజలను రక్షించినా వారికి దొంగతనం చేస్తున్నారనే అనిపించింది. ఇప్పటి నుంచి అయినా.. జాగ్రత్తగా పనులు చేసుకుంటూ ఆ పేరు పోయేలా చేసుకోండి’ అని చెప్పాడు. సంవత్సరం గడిచే సరికి.. వాళ్లు పూర్తిగా మారిపోయారు. ఎంచక్కా వ్యవసాయం చేసుకోసాగారు. ఆలోచనా విధానాన్ని మంచి వైపు మార్చుకుంటే.. జీవితం సాఫీగా సాగిపోతుందని నిరూపించారు.

గుండ్రాతి సుబ్రహ్మణ్యం గౌడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని