బావి తెచ్చిన బడి..!

దేవగిరి పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో సిరిపురం అనే గ్రామం ఉంది. అక్కడ చలమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని ఇంట్లో మంచినీటి బావి ఉండేది.

Published : 05 May 2024 00:06 IST

దేవగిరి పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో సిరిపురం అనే గ్రామం ఉంది. అక్కడ చలమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని ఇంట్లో మంచినీటి బావి ఉండేది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్లు ఆ బావి నీళ్ల మీదే ఆధారపడేవారు. తెల్లవారక ముందు నుంచి నీళ్లు తోడటం ప్రారంభిస్తే.. మళ్లీ రాత్రి పొద్దుపోయే వరకు అలా తోడుతూనే ఉండేవారు. ఉచితంగానే వాళ్లందరికీ నీళ్లు ఇచ్చేవాడు చలమయ్య. ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి బావి చాంతాడులు కొత్తవి మారుస్తుండేవాడు అతను. ఆ చుట్టుపక్కల పాఠశాల లేకపోవడంతో.. అక్కడి పిల్లలంతా దేవగిరికి వెళ్లి చదువుకోవాల్సి వచ్చేది. సౌకర్యాలు లేక చదువు మానేసిన వాళ్లు కూడా ఉన్నారు. అది గమనించిన చలమయ్య.. గ్రామ పెద్దలతో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ‘అయ్యా! మన ఊరి పిల్లలు, పొరుగు గ్రామాల పిల్లలు ఇబ్బందులు పడుతూ దూరంగా వెళ్లి చదువుకోవడం చాలా బాధగా అనిపిస్తుంది. అది సరైంది కాదు. కాబట్టి మనమంతా కలిసి డబ్బు జమచేసి, పాఠశాల నిర్మించుకోగలిగితే.. అది మన భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. మనం పాఠశాల ఏర్పాటు చేసుకుంటే.. ప్రభుత్వం ఉపాధ్యాయులను పంపించడానికి కూడా సిద్ధంగా ఉంది. ఊరి మధ్యలో నాకు కొంత ఖాళీ స్థలం ఉంది. అది నేను ఉచితంగానే పాఠశాల నిర్మాణానికి ఇస్తాను. అలాగే కొంత ఖర్చు కూడా భరిస్తాను. మిగిలింది.. ఊరంతా కలిసి విరాళాలు అందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం’ అని వివరించాడు.

కానీ ఎవరూ చలమయ్య మాటలు అంగీకరించలేదు. విరాళాలు ఇవ్వడానికి ముందుకు రాలేదు. దాంతో అతనికి నిరాశే ఎదురయ్యింది. ఇంటికి వెళ్లి కాసేపు ఆలోచించిన చలమయ్య, మరుసటిరోజు ఉదయాన్నే.. ‘ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా.. రేపటి నుంచి చలమయ్య బావిలోని మంచి నీళ్లు తెచ్చుకునేవారు, ఒక బిందెకు రెండు రూపాయలు చెల్లించాలి. లేకపోతే ఆ నీళ్లు తీసుకెళ్లడానికి వీల్లేదు’ అని దండోరా వేయించాడు. ఈ విషయాన్ని పొరుగు గ్రామాలకు కూడా చేరవేశాడు. అది విన్న గ్రామ ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ‘ఇన్ని రోజులుగా లేనిది.. ఇప్పుడు నీళ్లు అమ్ముకోవడం ఏంటి?’ అని మాట్లాడుకోసాగారు. కానీ ఇక మరో దారి లేక.. చలమయ్యకు రెండు రూపాయలు చెల్లించి, నీళ్లు తీసుకెళ్లడం ప్రారంభించారు ప్రజలు.

ఇలా ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. అనంతరం కొన్ని రోజులకు పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించాడు చలమయ్య. ఆరు నెలల్లోనే పనులు మొత్తం పూర్తయ్యాయి. పాఠశాల ప్రారంభ సభలో ఆ జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘ప్రతి గ్రామంలో మీలాగ ఐకమత్యంతో ఉన్న ప్రజలు ఉంటే.. వారికి ఎవరి సహాయం లేకపోయినా అభివృద్ధిలో ముందుంటారు’ అని ప్రశంసించారు. ఇక అప్పుడు చలమయ్య మాట్లాడుతూ.. ‘ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికీ నా నమస్కారాలు. ముందుగా నేను పాఠశాల నిర్మించుకుందామని అడిగినప్పుడు ఎవరూ స్పందించలేదు. విరాళాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలో అర్థంకాక.. చాలా ఆలోచించాను. అలా వచ్చిన ఆలోచనతోనే.. మా ఇంటి నుంచి ప్రతిరోజు తీసుకెళ్లే నీళ్లకు డబ్బులు చెల్లించాలని షరతు పెట్టాను. ఆ డబ్బుని కూడా ఈ పాఠశాల నిర్మాణానికి ఉపయోగించాను. ఈ ఊరి ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా దీనికి సాయం చేసినట్లే. దానికి నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ నిర్మాణం మీ అందరి ఆర్థిక సహకారంతోనే జరిగింది. త్వరలోనే మనం వైద్యశాల కూడా నిర్మించుకుందాం. రేపటి నుంచి అందరూ మంచినీళ్లు ఉచితంగా తీసుకువెళ్లొచ్చు’ అన్నాడు. దాంతో అక్కడున్న వారంతా కరతాళ ధ్వనులతో చలమయ్యను అభినందించారు.

బెల్లంకొండ నాగేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని