మంత్రి చూపిన పరిష్కారం!

రాజు చిత్రసేనుడు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించేవాడు. ఆయన రాజ్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సుభిక్షంగా ఉండేది. ముఖ్యంగా రాజ్యంలో అనేక అభివృద్ధి పనులతో పాటూ చిత్రసేనుడు అనాథలు, పేదలు, వృద్ధులకు ఉచిత అన్న సత్రాలు కట్టించాడు.

Updated : 06 May 2024 04:09 IST

రాజు చిత్రసేనుడు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించేవాడు. ఆయన రాజ్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సుభిక్షంగా ఉండేది. ముఖ్యంగా రాజ్యంలో అనేక అభివృద్ధి పనులతో పాటూ చిత్రసేనుడు అనాథలు, పేదలు, వృద్ధులకు ఉచిత అన్న సత్రాలు కట్టించాడు. నాణ్యమైన, రుచికరమైన వంటకాలు అక్కడ తయారయ్యేవి. రోజూ జనంతో ఆ సత్రాలు తిరునాళ్లల్లా ఉండేవి. అందులో ఒక ప్రధాన సత్రంలో వంట వండి, వడ్డించే వ్యక్తి వృద్ధాప్యం కారణంగా తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అప్పుడు ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఇచ్చిన ప్రకటన మేరకు ఆ రాజ్యం నుంచే కాకుండా, పక్క రాజ్యాల నుంచి కూడా ఎందరో వంట వాళ్లు వచ్చారు.

కొన్ని పరీక్షల అనంతరం అందులో ఇద్దరు వంటవాళ్లు శరభయ్య, భీమయ్య అర్హులుగా నిలిచారు. కానీ ఉన్నది ఒకటే కొలువు! ఇద్దరిలో ఎవర్ని నియమించాలన్నది పెద్ద సమస్యగా మారింది నిర్వాహకులకు. దాంతో వాళ్లు మంత్రికి తమ సమస్యను విన్నవించారు. అంతా విని ఆయన తన తెలివితో ఆ సమస్యను తాను పరిష్కరిస్తానన్నాడు. కానీ ఈ విషయం గోప్యంగా ఉంచమన్నాడు.

మంత్రి చెప్పినట్టు నిర్వాహకులు ముందుగా శరభయ్యతో ఆ సత్రంలో వంటలు వండించారు. అతడు అద్భుతంగా వండి చూపించాడు. అంతే కాకుండా తనే స్వయంగా అందరికీ వడ్డించాడు. భోజనం చేస్తున్న వారిని ప్రేమతో పలకరిస్తూ, వారికి ఏమేమి కావాలో మళ్లీ మళ్లీ అడిగాడు. తిన్న వారంతా ఆహా.. ఓహో.. అన్నారు. వంటలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. అంతకు మించి శరభయ్య వంటలు వడ్డించిన తీరు, పలకరింపు భలే బాగున్నాయని మెచ్చుకున్నారు. దాంతో ఒకరి పరీక్ష పూర్తైంది.

రెండో రోజు భీమయ్య వంతు వచ్చింది. అతడు కూడా తన వంటలన్నీ చక్కని రుచితో వండాడు. కానీ వడ్డిస్తున్నప్పుడు భోజనం చేస్తున్న వారిని పలకరించలేదు. ఎవరికి ఏం కావాలో వాళ్లు అడగకుండానే మౌనంగా వడ్డించేవాడు. చివరికి అతని పరీక్షా పూర్తైంది. అతని వడ్డించే పద్ధతికి జనం కాస్త నిరాశ చెందారు. అందరూ శరభయ్యే ఆ ఉద్యోగానికి ఎంపిక అవుతాడు అనుకున్నారు. అతడు కూడా తన మీద పూర్తి నమ్మకంతో ఆ ఉద్యోగం తనకే వస్తుందని, ధీమాగా ఉన్నాడు.

మంత్రి చివరి ఫలితాలు వెల్లడించాడు. కానీ చిత్రంగా భీమయ్య ఎంపికయ్యాడు. శరభయ్యతో పాటు సత్రంలోని జనం కూడా మంత్రి నిర్ణయానికి ఆశ్చర్యపోయారు. ‘నేనెంతో అద్భుతంగా వంటలు చేసి, అందరికీ ప్రేమతో వడ్డించాను. నేను చూపించిన ప్రేమలో కొంచెం కూడా భీమయ్య చూపించలేదు. అతడినెలా ఎంపిక చేశారో నేను తెలుసుకోవచ్చా?!’ అని అడిగాడు శరభయ్య.

అప్పుడు మంత్రి.. ‘వంట చేయడంలో, వడ్డించడంలో నీకు తిరుగులేదు. భోజనం చేస్తున్న పంక్తిలో నేనూ మారువేషంలో కూర్చున్నాను. నేను మీ ఇద్దరి వంటల్నీ తిన్నాను. ముందు నువ్వు ప్రేమగా అందర్నీ పలకరిస్తూ వడ్డించిన తర్వాత, పక్కకు పోయి కోపంతో, అసహనంతో తింటున్న వారిని నానా తిట్లు తిట్టుకున్నావు. నేను చాటుగా ఉండి అవన్నీ విన్నాను. అక్కడే నీ నైజం బయట పడింది. నీదంతా కపట ప్రేమ! కానీ భీమయ్య మౌనంగా వడ్డిస్తూ భోజనం చేస్తున్న వారిని తన చూపులతో ఆప్యాయంగా పలకరిస్తూ, వారి కడుపుల్ని మాత్రమే కాదు, వారి మనసుల్ని కూడా సంతృప్తితో నింపాడు. పైగా తింటున్న వారిని పల్లెత్తు మాట కూడా అనలేదు. అతనిలోని ఆ సహన గుణమే నాకు నచ్చింది. అదీ కాక నువ్వు వండిన వంటలన్నీ.. చివరికి నీకు మిగులుతాయో, లేదో అని, అన్నీ ముందే.. కాస్త కాస్త పక్కకు తీసి పెట్టుకున్నావు. కానీ భీమయ్య అలా చేయలేదు. వండినవన్నీ ముందు అన్నార్తులకు పెట్టాడు. ఆ తర్వాత మిగిలిన వాటితో తను సరిపెట్టుకున్నాడు. అందరి కడుపులూ నిండాక, తన ఆకలి కోసం ఆలోచించేవాడే నిజమైన వంటవాడు!’ అని చెప్పేసరికి శరభయ్య తన తప్పు తెలుసుకొన్నాడు. భీమయ్యకు అభినందనలు తెలిపి అక్కడ నుంచి నిష్క్రమించాడు. 

నంద త్రినాథ రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని