కార్తీ కల.. చిలుకకు విడుదల..!

ఆ రోజు కార్తి పుట్టినరోజు. ఇల్లంతా ఒకటే కోలాహలంగా ఉంది. సెలవురోజు కూడా కలిసి రావడంతో.. అమ్మానాన్నలు కూడా ఆఫీసుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. ఇంతలోనే.. ‘సాన్నం చేసి.. దేవుడికి దండం పెట్టుకొని, ఒకసారి హాల్లోకి రా.

Published : 07 May 2024 00:27 IST

రోజు కార్తి పుట్టినరోజు. ఇల్లంతా ఒకటే కోలాహలంగా ఉంది. సెలవురోజు కూడా కలిసి రావడంతో.. అమ్మానాన్నలు కూడా ఆఫీసుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. ఇంతలోనే.. ‘సాన్నం చేసి.. దేవుడికి దండం పెట్టుకొని, ఒకసారి హాల్లోకి రా. నీకో మంచి బహుమతి తీసుకొచ్చాను’ అన్నాడు కార్తి వాళ్ల నాన్న. ఆ మాటలు విని.. గబగబా దండం పెట్టుకొని హల్లోకి పరిగెత్తాడు కార్తి. అక్కడికి వెళ్లగానే.. తనకు ఎదురుగా టేబుల్‌ పైన ఒక ముసుగు వేసిన పెట్టె కనిపించింది. అందులో ఏముందో అసలు బయటకు తెలియట్లేదు. అదేంటో తెలుసుకోవాలని చాలా ఆతృతగా అడిగాడు కార్తి. కానీ ‘నువ్వు కనిపెట్టు అదేంటో.. అప్పుడే దాన్ని తెరిచి చూపిస్తాము’ అని తనని ఆట పట్టించసాగారు ఇంట్లో వాళ్లు. కార్తి ఎన్ని వస్తువుల పేర్లు చెప్పినా, అది కాదు.. ఇది కాదు.. అంటున్నారు.

కాసేపటి తర్వాత.. ముభావంగా కూర్చున్న కార్తీని పెట్టె దగ్గరకు తీసుకెళ్లి.. ఆ ముసుగు తొలగించి చూపించాడు వాళ్ల నాన్న. అది చూసి ఆనందంగా కేరింతలు కొట్టాడా అబ్బాయి. దాని కింద ఒక మెరిసే పంజరం, అందులో అందమైన రామచిలుక ఉంది. ‘ఎంత అందంగా ఉందో.. నేను ఎంచక్కా రోజూ దీనితో ఆడుకోవచ్చు. ఎప్పటి నుంచో అడుగుతుంటే.. ఈ పుట్టినరోజుకి తీసుకొచ్చారు. థాంక్యూ నాన్నా!’ అన్నాడు కార్తి. ఇక ఆ రోజంతా చిలుకతోనే చక్కగా ఆడుకున్నాడు. దానికి పండు తినిపించి, నీళ్లు తాగించాడు. రాత్రి దాన్ని తన గదిలోనే ఒక మూలన పెట్టి పడుకున్నాడు.

ఇంతలో కళ్లు తెరిచి చూస్తే తనని ఎవరో పంజరంలో పెట్టారు. ఒకటే అరుపులు, కేకలు పెడుతున్నాడు. ఒకరు వచ్చి, తనకు తినాలని లేకపోయినా.. తిను తిను అంటూ నోటిలో ఏవేవో పదార్థాలు పెడుతున్నారు. మరొకరు దగ్గరకు వచ్చి నచ్చినట్లుగా పిలుస్తూ.. చిటికెలు వేస్తున్నారు. ఇంకొందరు వచ్చి, పంజరాన్ని గిర గిర తిప్పుతూ.. సంబరపడిపోతున్నారు. అసలు ఏం జరుగుతోందో తనకు అర్థం కావడం లేదు. పక్కన అమ్మానాన్నలు, తెలిసిన వాళ్లూ ఎవరూ లేరు. అక్కడి వాళ్ల భాష కూడా కార్తీకి అర్థం కావడంలేదు. వదిలిపెట్టమని తను అరుస్తూ ఎంత వేడుకున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరూ అతన్ని చూసి ఆనందంగా నవ్వుకుంటున్నారు. ఇక ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా గట్టిగా ‘అమ్మా..!’ అంటూ అరిచాడు కార్తి. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి.. ‘కార్తీ.. కార్తీ..! ఏమైంది? ఎందుకు నిద్రలో అలా అరుస్తున్నావు? కల ఏమైనా వచ్చిందా’ అంటూ మంచి నీళ్లు చేతికి ఇచ్చింది. అవి తాగిన కార్తి.. ఒకసారి పంజరం వైపు చూశాడు. చిలుక కిచకిచమంటూ అరుస్తూ.. అందులోనే తిరుగుతుంది. దాన్ని కాసేపు అలాగే చూసి.. నిద్రపోయాడు.

ఉదయం నిద్ర లేవగానే అమ్మానాన్నలను, పంజరాన్ని తీసుకొని మేడ మీదకు వెళ్లాడు కార్తి. ‘నాన్నా.. మీరు నాపైన ఎంతో ప్రేమతో తెచ్చిన ఈ చిలుకను, పంజరం నుంచి వదిలేద్దాం అనుకుంటున్నాను’ అన్నాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన వాళ్ల నాన్న.. ‘నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావనే కదా తీసుకొచ్చాను. ఎందుకు వదిలేయడం’ అని అడిగాడు. ‘నాకు రాత్రి ఒక కల వచ్చింది నాన్నా! నన్ను ఒక పంజరంలో బంధించి.. మీరెవరూ లేని చోట పెట్టారు. అందరూ నన్ను చూసి ఆనందిస్తున్నారు. కానీ నాకు మీరు లేని చోట ఉండటం భయమేసింది. ఇలా బందిఖానాలో ఉంచటం ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కదా! నాకు ఈ చిలుకను చూస్తే కూడా అలానే ఆనిపించింది. ఒకప్పుడు పంజరంలో చిలుకను చూసి ఆనందించే వాడిని. కానీ ఇప్పుడు చిలుక.. పచ్చని చెట్ల మధ్య ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. మనం దానికి పెట్టే పండ్ల కన్నా, అది రోజూ వెళ్లి.. చెట్టుపైన ఉన్న కాయలను పొడిచి తింటేనే ఆనందంగా ఉంటుంది కదా! అమ్మా..’ అన్నాడు కార్తి. తన మాటలకు అమ్మానాన్నలు ఎంతో సంతోషించారు. తను చెప్పినట్లుగానే.. చిలుకను పంజరం నుంచి విడిచిపెట్టారు. అది రివ్వున ఎగురుకుంటూ వెళ్లి.. పక్కనే ఉన్న పచ్చని చెట్టు మీద వాలింది. దాన్ని చూసి ‘భలే.. భలే!’ అంటూ చప్పట్లు కొట్టాడు కార్తి.

సింగంపల్లి శేష సాయి కుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని