భలే.. భలే.. పిచ్చుకలు!

ఉదయాన్నే నిద్ర లేచి, సోఫాలో కూర్చొని.. ‘అమ్మా! ఇప్పుడు సెలవులు కదా! నేను ఆడుకోవడానికి మా స్నేహితుల ఇంటికి వెళ్తాను’ అన్నాడు ప్రవీణ్‌. ‘ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

Updated : 08 May 2024 04:18 IST

దయాన్నే నిద్ర లేచి, సోఫాలో కూర్చొని.. ‘అమ్మా! ఇప్పుడు సెలవులు కదా! నేను ఆడుకోవడానికి మా స్నేహితుల ఇంటికి వెళ్తాను’ అన్నాడు ప్రవీణ్‌. ‘ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బయటికి ఎక్కడికీ వెళ్లకుండా.. కుదురుగా ఇంట్లోనే ఉండు’ అంది వాళ్లమ్మ జానకి. ‘మరి ఎలాగమ్మా.. రోజంతా ఇంట్లోనే ఉండి ఏం చేయాలి’ అని కాస్త చిరాగ్గా అన్నాడు ప్రవీణ్‌. ‘సెలవుల్లో నీకు కాలక్షేపం అవ్వడం కోసం నాన్న.. డ్రాయింగ్‌ బుక్‌, కలర్స్‌.. అలాగే కథల పుస్తకాలు తెచ్చారు.. అవి చదువుకో. అంతగా కావాలంటే సాయంత్రం కాస్త ఎండ తగ్గిపోయాక.. నీ స్నేహితుల దగ్గరకు వెళ్దువు, సరేనా..! అంది జానకి. ‘అలాగేనమ్మా..!’ అంటూ జవాబిచ్చాడు ప్రవీణ్‌.

ప్రవీణ్‌ హాల్లో కూర్చుని ఎంచక్కా బొమ్మలు వేసుకుంటున్నాడు. ఇంతలోనే.. ఓ చిన్ని పిచ్చుక కిచకిచమని అరుస్తూ వరండాలో పడిపోయింది. అది చూసిన ప్రవీణ్‌.. ‘అమ్మా!’ అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపులు విని ఏం జరిగిందోనని కంగారుగా వచ్చింది జానకి. ‘అమ్మా.. ఒక చిన్ని పిచ్చుక మన వరండాలో పడిపోయింది పాపం..’ అని జాలిగా అన్నాడు. వెంటనే ఆమె.. నీళ్లు తీసుకొచ్చి దానికి తాగించడానికి ప్రయత్నించింది. ఆ పిచ్చుక మెల్లమెల్లగా కొన్ని నీళ్లు తాగి.. కాసేపాగి తుర్రున ఎగిరిపోయింది. ‘పాపం పిచ్చుకకు ఎంత దాహం వేసిందో కదా!’ అన్నాడు ప్రవీణ్‌. ‘అవును! మనమంటే దాహం వెయ్యగానే నీళ్లు తెచ్చుకొని తాగేస్తాం. కానీ పక్షులు, జంతువులకు ఎవరిస్తారు. ఈ ఎండలకు.. ఉన్న చెరువులు, కాలువలు ఎండిపోతాయి. ఇలా నీళ్లు దొరక్క చాలా పక్షులు చనిపోతాయి కూడా’ అంది జానకి. ‘అయ్యో! మరి ఎలాగమ్మా!’ అమాయకంగా అన్నాడు ప్రవీణ్‌. ‘ఏముంది.. గిన్నెల్లో కొన్ని నీళ్లు పోసి వాటిని పెరట్లో, వరండాలో పెట్టాలి. అవి చూసి వచ్చిన పక్షులు తాగుతాయి’ అంది వాళ్లమ్మ. ‘వరండాలో అయితే వాటికి కనిపించదేమో. మన ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది కదా! అక్కడ చిన్న చిన్న కర్రలు పాతి, వాటి మీద నీళ్ల గిన్నెలు పెడతాను’ అన్నాడు ప్రవీణ్‌.  

చెప్పినట్లుగానే.. పెరట్లో ఉన్న చెక్కలు తెచ్చి ఖాళీ స్థలంలో పాతాడు. వాటి మీద చిన్న గిన్నెలు, డబ్బాలు పెట్టీ.. నీళ్లు పోశాడు. ఇంకా వాళ్లమ్మ ఇచ్చిన పెసర, మినప గింజలు కూడా అక్కడక్కడా చల్లాడు. ఇక వెళ్లి భోజనం చేసి.. మళ్లీ డ్రాయింగ్‌ వేసుకోవడం ప్రారంభించాడు. కానీ తన మనసంతా బయటే ఉంది. ‘అమ్మా.. ఇంకా ఒక్క పక్షి కూడా రావడం లేదేంటి?’ అని అటువైపుగా చూస్తూ అడిగాడు. ‘వస్తాయి నాన్న.. ముందు ఒక పక్షి వచ్చి చూస్తే.. ఇక్కడ నీళ్లు ఉన్నాయని మిగతా వాటికి చెబుతుంది. అప్పుడు అన్నీ వస్తాయి’ అని బదులిచ్చింది జానకి. అప్పుడే.. కిచకిచమంటూ ఒక పిచ్చుక వచ్చింది. దాన్ని చూసి ‘భలే.. భలే..!’ అంటూ బయటికి వెళ్లబోయాడు ప్రవీణ్‌. అప్పుడు వాళ్లమ్మ.. ‘నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్లకు. నిన్ను చూసి భయపడి నీళ్లు తాగకుండానే వెళ్లిపోతుంది’ అంది. దాంతో అలాగేనంటూ అక్కడే ఉండిపోయాడు. పిచ్చుక అక్కడున్న గింజలు తిని, కాసిన్ని నీళ్లు తాగి వెళ్లిపోయింది. అది అక్కడున్నంత సేపు కిటికీలోంచి.. ఆశ్చర్యంగా చూశాడు ప్రవీణ్‌. ఇంకాసేపటికి.. అక్కడికి చాలా పక్షులు వచ్చాయి. అది చూసి ప్రవీణ్‌ చాలా సంతోషించాడు. ఆ విషయాన్ని వెంటనే తన స్నేహితులకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

మరుసటి రోజు ఉదయాన్నే తన స్నేహితులను వెంటపెట్టుకొచ్చాడు ప్రవీణ్‌. పిల్లలంతా కలిసి గిన్నెల్లో నీళ్లు నింపి.. పక్షుల కోసం పెట్టారు. ఇంతలో ప్రవీణ్‌ వాళ్లమ్మ అందరికీ ఎంచక్కా పాయసం చేసి పెట్టింది. పిల్లలంతా పాయసం తింటూ పక్షులు ఎప్పుడొస్తాయా.. అని బయటికి చూడసాగారు. కాసేపటికి రకరకాల పక్షులు అక్కడికి వచ్చి, గింజలు తిని.. నీళ్లు తాగి వెళ్లిపోయాయి. అది చూసిన పిల్లలు ‘అయ్యో ఆంటీ..! పక్షులన్నీ వెళ్లిపోతున్నాయేంటి?’ అని అడిగారు. ‘అవి ఇక్కడే ఉండిపోవు పిల్లలూ..! మీరు ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్లినప్పుడు మళ్లీ తిరిగి ఇంటికి వెళ్తారు కదా! అవి కూడా అంతే’ అని చెప్పింది జానకి. ‘ఓ.. అలాగా.. మేము కూడా ఇంటికి వెళ్లి పక్షుల కోసం.. నీళ్లు పెడతాం’ అంటూ బయలుదేరారు పిల్లలు.

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని