అమ్మ మాట వినాలి..!

నందనం అనే అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దాని పేరు భల్లూకం. దానికి బంటి, చంటి అని రెండు పిల్లలు కూడా ఉండేవి. వాటితో కలిసి ఓ గుహలో నివసించేది. వేసవి ఎండ తీవ్రత వల్ల.. పిల్లలను గుహలోనే ఉంచి ఒక్కతే ఆహార సేకరణకు వెళ్లాలని నిర్ణయించుకుంది.

Updated : 09 May 2024 01:17 IST

నందనం అనే అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దాని పేరు భల్లూకం. దానికి బంటి, చంటి అని రెండు పిల్లలు కూడా ఉండేవి. వాటితో కలిసి ఓ గుహలో నివసించేది. వేసవి ఎండ తీవ్రత వల్ల.. పిల్లలను గుహలోనే ఉంచి ఒక్కతే ఆహార సేకరణకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ‘ఎండ చాలా ఎక్కువగా ఉంది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు రాకండి. గుహలోనే ఉండండి. నేను వెళ్లి ఆహారం తీసుకొస్తాను. ఏదైనా అవసరమైతే పక్కనే పొదలో ఉన్న కుందేలు మామను అడగండి. నేను దానికి చెప్పి వెళ్తాను. బయటకు మాత్రం వెళ్లకండి.. వడదెబ్బ తగిలితే చాలా ప్రమాదం’ అని పిల్లలకు జాగ్రత్తలు చెప్పి, వాటిని కాస్త గమనిస్తుండమని.. కుందేలుకు చెప్పి ఆహార సేకరణకు బయలుదేరింది ఎలుగుబంటి.

చంటి, బంటి చాలాసేపు గుహలోనే ఉన్నాయి. కాసేపటికి.. ‘చంటీ! అమ్మ ఆహారం కోసం వెళ్లింది కదా! వచ్చేటప్పటికి చాలా సమయం అవుతుంది. మనం అలా బయటకు వెళ్లి ఆడుకొని వద్దాం పద’ అంది బంటి. అప్పుడు చంటి.. ‘అమ్మ ఎండలో బయటకు వెళ్లొద్దని మరీ.. మరీ.. చెప్పింది. కాబట్టి మనం ఎక్కడికీ వెళ్లకుండా లోపలే ఉందాం’ అని బదులిచ్చింది. ‘అమ్మ అలాగే చెబుతుంది. నా మాట విను.. అలా కాసేపు బయట తిరిగి వద్దాం’ అంటూ చంటిని వెంటపెట్టుకొని బయలుదేరింది బంటి. అవి కుందేలు ఉన్న పొదను దాటి వెళ్తుంటే.. వాటిని చూసిన కుందేలు.. ‘అమ్మ బయటికి వెళ్లొద్దని చెప్పింది కదా! గుహలో ఉండకుండా, ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నారు? తిరిగి గుహలోకి వెళ్లండి’ అని గట్టిగా చెప్పింది. ‘నువ్వు మాకు చెప్పేదేంటి? అయినా మా అమ్మ వచ్చేలోపు మేం తిరిగొచ్చేస్తాం కదా!’ అంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్లాయవి. కొంచెం దూరం వెళ్లాక ఓ చెట్టు నీడలో ఆగి ఎంచక్కా ఆడుకున్నాయి.

ఇంకాసేపటికి బంటి.. ‘మనం కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ మనకు మంచి పుట్టతేనె దొరుకుతుంది’ అంది. అప్పుడు చంటీ.. ‘అమ్మో! ఇంకా ముందుకు వెళ్లడమా.. వద్దు. నాకు ఎందుకో భయంగా ఉంది. మనం ఇంటికి వెళ్లిపోదాం పద!’ అంది. ‘నీకు ఎప్పుడూ భయమే. నేను ఉన్నా కదా! నీకేం కాదు’ అంటూ చంటిని తీసుకొని ఇంకా ముందుకు వెళ్లింది బంటి. అప్పటికే ఎండ తీవ్రత బాగా పెరిగింది. అటువైపుగా వస్తున్న ఒక ఏనుగు వీటిని ఆపి.. ఎక్కడికి వెళ్తున్నారు?’ అని అడిగింది. ‘మా అమ్మ ఇటువైపే వచ్చింది. అదిగో ఆ ముందు ఉంది. అక్కడికే వెళ్తున్నాం’ అని అబద్ధం చెప్పేసింది బంటి. ఇక మళ్లీ అక్కడి నుంచి ముందుకు నడవటం ప్రారంభించాయవి. కాస్త ముందుకు వెళ్లేటప్పటికి ఎండ వల్ల బంటి అక్కడే కూలబడిపోయింది. దాన్ని చూసి.. చంటికి చాలా భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ‘బంటి.. బంటి..’ అంటూ కేకలు వేసింది. ఇంతలోనే అక్కడికి కుందేలు వచ్చింది. దానితో చంటి.. ‘మామా! బంటిని రక్షించు’ అని ప్రాధేయపడింది. కుందేలు వెంటనే ఆ సమీపంలో ఉన్న కొలను దగ్గరకు వెళ్లి, నీరు తెచ్చి బంటిపై చల్లింది. తేరుకున్నాక ఒక చెట్టు నీడలోకి తీసుకెళ్లింది. కాస్త విశ్రాంతి తీసుకున్నాక బంటి పూర్తిగా తేరుకుంది.

అప్పుడు బంటి.. ‘మా అమ్మ, నువ్వు ఇంటిపట్టునే ఉండమని పదేపదే చెప్పారు. అయినా వినకుండా బయటకు వచ్చాము. ఎండలో ఇంత ఇబ్బంది పడ్డాము. మీరు చెప్పినట్లు విని అక్కడే ఆగిపోతే ఇదంతా జరిగేది కాదు. నన్ను క్షమించండి’ అని నెమ్మదిగా అంది బంటి. ‘ఎప్పుడైనా పెద్దలు.. పిల్లల మంచి కోరే చెబుతారు. అందుకే వాళ్లు చెప్పిన మాట వినాలి. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు బయట తిరగకూడదు’ అంది కుందేలు. ఆహార సేకరణ చేసుకొని అదే దారి గుండా వస్తున్న భల్లూకం, చెట్టు నీడలో ఉన్న దాని పిల్లలను చూసి కంగారు పడింది. వెంటనే వాటి దగ్గరకు వెళ్లింది. దానికి కుందేలు విషయమంతా వివరించింది. భల్లూకం పిల్లలను దగ్గరకు తీసుకొని కుందేలుకు కృతజ్ఞతలు చెప్పింది. తెచ్చిన ఆహారం పిల్లలకు అందించింది.

మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని