సింగయ్య ఎంపిక..!

సిరిపురంలో నివసించే సింగయ్యకు అరవై ఏళ్లు. ఆయన దగ్గర చాలా డబ్బు ఉన్నా.. సేవలు చేసే వాళ్లు మాత్రం ఎవరూ లేరు. వయసు మీద పడటంతో.. తన సొంత పనులు కూడా చేసుకోలేకపోతున్నాడు.

Updated : 15 May 2024 05:12 IST

సిరిపురంలో నివసించే సింగయ్యకు అరవై ఏళ్లు. ఆయన దగ్గర చాలా డబ్బు ఉన్నా.. సేవలు చేసే వాళ్లు మాత్రం ఎవరూ లేరు. వయసు మీద పడటంతో.. తన సొంత పనులు కూడా చేసుకోలేకపోతున్నాడు. దాంతో.. తనకు సహాయకుడిగా ఒక తెలివైన యువకుడిని పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయం తెలిసి ఇద్దరు యువకులు ఆయన దగ్గరకు వచ్చారు. ‘నాకు సహాయకుడిగా కావాల్సింది ఒక్కరే. సరే.. మీ ఇద్దరికీ చిన్న పరీక్షలు పెడతాను. వాటిలో నెగ్గిన వారినే ఎంపిక చేస్తాను. అయినా.. వేతనం తక్కువని తెలిసీ, ఈ పనికి ఎందుకు వచ్చారు?’ అన్నాడు సింగయ్య. ‘అయ్యా! నా పేరు రత్నాకరుడు. నేను ధనవంతుల బిడ్డనే. నా చదువుకు తగిన పని లభించేదాకా.. ఇది కాలక్షేపంగా ఉంటుందని వచ్చాను’ అని చెప్పాడు మొదటి యువకుడు. ‘నా పేరు గుణనిధి. పేదరికంలో కూడా కష్టపడి నన్ను ఇంతటి గొప్ప చదువులు చదివించిన నా తల్లిదండ్రులకు.. నేను పని చేస్తే కాస్త సహాయంగా ఉంటుందని వచ్చాను’ అని బదులిచ్చాడు రెండో వ్యక్తి.

అలాగేనంటూ బదులిచ్చిన సింగయ్య.. ‘మీ ఇద్దరికీ చెరో ఐదు వందల రూపాయలు ఇస్తాను. మూడు నెలల్లో అవి రెట్టింపు అయ్యే పని మీరు వారంలో పూర్తి చేయాలి’ అని వారికి డబ్బు ఇచ్చాడు. వెళుతూ వెళుతూ గుణనిధి.. ‘మీ పశువుల పాక ఎందుకు ఖాళీగా ఉంది’ అని అడిగాడు. ‘నా ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. నేను వాటికి సేవలు చేయలేక అమ్మేశాను’ అన్నాడు సింగయ్య. వారం రోజుల తర్వాత.. రత్నాకరుడు వచ్చి, ‘అయ్యా! ఈ ధనాన్ని నేను అంత తక్కువ సమయంలో రెట్టింపు చేయలేను. నిజంగా అలా చేయగలిగితే, అసలు ఈ లోకంలో పేదవారే ఉండరుగా?’ అన్నాడు. అదే సమయంలో గుణనిధి.. ఎడ్ల బండ్లపై కొన్ని ఎండు కట్టెలు తీసుకువచ్చి.. పశువుల పాకలో పెట్టాడు. ‘వచ్చేది వర్షాకాలం. ఈ ఎండు కట్టెలు.. అప్పుడు అమ్మకానికి పెడితే మన పెట్టుబడికి రెట్టింపు లాభాలు వస్తాయి’ అన్నాడు.

మరుసటి రోజు.. ‘ఈ ఇంటిని ఎటువంటి మార్పులూ చేయకుండా ఇలానే ఉంచి.. ప్రతి నెలా స్థిర ఆదాయం వచ్చే మార్గం చెప్పండి’ అన్నాడు సింగయ్య. ‘ఎంతో ధనంతో పాటు, పండ్ల తోటలు, మరెన్నో వ్యవసాయ భూములు ఉన్న మీరు.. ఇంకా ధనం సంపాదించాలి అనుకోవడమే తప్పు. దానికి సంబంధించిన మార్గాల గురించి మీరు ఆలోచించకూడదు’ అని వెంటనే అన్నాడు రత్నాకరుడు. ‘పంట భూములు, పండ్ల తోటలకు ప్రకృతి సహకరించకపోతే మనకు రాబడి ఉండదు. ఇల్లు ఎలాగూ రోడ్డుకు దగ్గరలోనే ఉంది కాబట్టి.. ముందున్న ఖాళీ స్థలంలో ప్రతీ వారం.. కూరగాయలు, పండ్లు అమ్మితే.. వాటి ద్వారా ప్రతి మాసం స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ‘ఎంత డబ్బు ఉన్నా సరే.. సంపాదించాలి అనుకోవడం తప్పేమీ కాదు. కానీ ఆ ధనం మనకు మాత్రమే కాకుండా.. సమాజ హితంగా ఉండాలి. ఏవైనా ఆశ్రమాలు, పాఠశాలలు, వైద్యశాలలకు సహాయం చేయవచ్చు. భవిష్యత్తులో మనం లేకపోయినా.. చేసిన మంచి కార్యక్రమాలు మాత్రం ఎప్పటికీ గుర్తుంటాయి’ అన్నాడు గుణనిధి.

 ‘నాయనలారా! మనం చేసే వృత్తిపై అంకిత భావం ఉండాలి. మన అభివృధ్ధికి కారకులైన తల్లిదండ్రులకు సహాయంగా ఉండటం మన ధర్మం. మనం బాగుండటమే కాకుండా.. ఇతరుల మంచినీ కోరుకోవాలి. వీలైనంత వరకు మనకు ఉన్న దాంట్లో.. తోటి వారికి సహాయం చేయాలి. ఈ లక్షణాలన్నీ గుణనిధిలో ఉన్నాయి. అందుకే నా సహాయకుడిగా తననే నియమించుకుంటున్నాను’ అని చెప్పాడు సింగయ్య. రత్నాకరుడిని దగ్గరికి పిలిచి.. ‘మనం ఏ పని చేసినా.. ఇష్టంతో చేయాలి. కాలక్షేపానికి కాదు. అప్పుడు అది ఎంత కష్టమైనా మనకు ఇబ్బందిగా అనిపించదు’ అని వివరించాడు. ఆ మాటలకు సరేనంటూ జవాబిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు రత్నాకరుడు. ఆ రోజు నుంచే పనిలో చేరి.. ఎంచక్కా పనులు చేసుకోసాగాడు గుణనిధి.
బెల్లంకొండ నాగేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని