చలమయ్యకు తగిన శాస్తి..!

లక్ష్మీపురం గ్రామంలో చలమయ్య ఆనే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా సోమరి. ఊర్లోని ప్రజల్ని మోసం చేస్తూ.. వారి మధ్య గొడవలు పెడుతూ డబ్బు సంపాదించేవాడు. అలా చేయడం తప్పని.. అతని భార్య ఎన్నిసార్లు చెప్పినా, అస్సలు వినేవాడు కాదు. పైగా.. ‘మనం ఎక్కువ కష్టపడకుండా బతకాలంటే.. ఇదే మంచి మార్గం’ అని చెప్పేవాడు.

Updated : 16 May 2024 06:21 IST

క్ష్మీపురం గ్రామంలో చలమయ్య ఆనే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా సోమరి. ఊర్లోని ప్రజల్ని మోసం చేస్తూ.. వారి మధ్య గొడవలు పెడుతూ డబ్బు సంపాదించేవాడు. అలా చేయడం తప్పని.. అతని భార్య ఎన్నిసార్లు చెప్పినా, అస్సలు వినేవాడు కాదు. పైగా.. ‘మనం ఎక్కువ కష్టపడకుండా బతకాలంటే.. ఇదే మంచి మార్గం’ అని చెప్పేవాడు. ఒకరోజు చలమయ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. దారిలో ఉన్న కిరాణా దుకాణంలో ఒక వ్యక్తి సరకులు కొంటున్నాడు. వెంటనే చలమయ్య అక్కడికి వెళ్లి.. అతనికేదో సైగ చేశాడు. దానికి అతడు సరేనన్నట్లు తలూపాడు. ఆ తర్వాత తీసుకున్న సరకులకు డబ్బు ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లబోయాడతను. అప్పుడు ఆ దుకాణం యజమాని ఆపి.. ‘డబ్బు ఇవ్వకుండా వెళ్తున్నావేంటి?’ అని అడిగాడు. ‘నేను ముందే మీకు ఇచ్చాను కదా..! గల్లా పెట్టెలో వేసుకున్నారు మళ్లీ చూసుకోండి’ అని సమాధానమిచ్చాడా వ్యక్తి. దాంతో అక్కడ గొడవ మొదలైంది. చాలామంది పోగయ్యారు. ఆ వచ్చిన వాళ్లు సరకులు తీసుకున్న వ్యక్తితో.. ‘నువ్వు డబ్బు ఇచ్చినట్లు ఏదైనా సాక్ష్యం చూపించగలవా?’ అని అడిగారు. వెంటనే అక్కడే ఉన్న చలమయ్య కల్పించుకొని.. ‘తను ఇస్తుండగా నేను చూశాను’ అన్నాడు. అంతే ఆ వచ్చిన వాళ్లంతా షాపు యజమానిని తిట్టి వెళ్లిపోయారు. పాపం.. ఇక అతను చేసేదేం లేక మౌనంగా ఉండిపోయాడు. ఇదంతా అదే షాపులో పని చేస్తున్న అభిరామ్‌ అనే అబ్బాయి గమనించాడు. చలమయ్య చెప్పింది అబద్ధమని తెలిసినా.. ఆ సమయంలో తన మాట చెల్లదని ఊరుకున్నాడు.

వెంటనే బయటకు వెళ్లి.. చలమయ్యను రహస్యంగా అనుసరించాడు అభిరామ్‌. అలా కొంచెం దూరం వెళ్లాక.. సరకులు తీసుకున్న వ్యక్తి, చలమయ్య ఒక చోట కూర్చొని వాటిని పంచుకోవడం చూశాడు. ‘ఎలాగైనా చలమయ్య ఆట కట్టించాలి. లేకపోతే గ్రామంలో ఎంతో మంది అతని మోసానికి బలవుతారు’ అనుకున్నాడు అభిరామ్‌. నాలుగు రోజుల తర్వాత.. అభిరామ్‌ నడుచుకుంటూ వెళ్తుంటే, చేపల దుకాణం దగ్గర చలమయ్య కనిపించాడు. అతని వాలకం చూసి.. ఇక్కడ కూడా ఎవరినో తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాడని అనిపించింది అభిరామ్‌కి. వెంటనే చలమయ్య దగ్గరికి వెళ్లి.. ‘నేను ఒక ఉపాయం చెబుతాను. అందుకు మీరు సహకరిస్తే.. ఇద్దరికీ లాభం కలుగుతుంది. మరేం లేదు నా తరఫున ఒక అబద్ధపు సాక్ష్యం చెప్పండి చాలు’ అన్నాడు. అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న చలమయ్య, వెంటనే సరేనన్నాడు.

చేపలు అమ్మే వాళ్ల దగ్గరకు వెళ్లి.. రెండు కిలోల చేపలు ఇవ్వమని అడిగాడు. వాటిని తీసుకొని డబ్బు ఇవ్వకుండానే వెళ్లిపోవాలని చూశాడు అభిరామ్‌. దాంతో వాళ్లు ఆపి అడిగితే.. ‘ముందే ఇచ్చాను కదా!’ అని మొండిగా సమాధానమిచ్చాడు. దాంతో గొడవ మొదలైంది. వెంటనే చలమయ్య కల్పించుకొని.. ‘ఆ అబ్బాయి డబ్బు ఇచ్చిన మాట నిజమే.. నేను చూశాను. చిన్నవాడని అతన్ని బెదిరిస్తున్నారు’ అన్నాడు. అక్కడున్న కొంతమంది.. ‘బాబూ.. నిజం చెప్పు, నువ్వు డబ్బు ఇచ్చావా?’ అని అడిగారు. దానికి ‘లేదండీ.. నేను ఇవ్వలేదు. ఇతనే.. అలా చెప్పమన్నాడు. అందుకు ప్రతి ఫలంగా.. ఈ చేపల్లో తనకు సగం వాటా ఇవ్వాలని అడిగాడు’ అని చలమయ్యను చూపిస్తూ చెప్పాడు అభిరామ్‌. అలా ఊహించని విధంగా కథ అడ్డం తిరగడంతో చలమయ్య ఒక్క క్షణం బిత్తరపోయాడు. ‘ఇతను మన గ్రామంలో ఇలాగే అందరినీ అందరినీ మోసం చేస్తూ బతికేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం.. నేను పని చేసే కిరాణా షాపులో, ఇదే విధంగా దొంగ సాక్ష్యం చెప్పి.. మా యజమానిని మోసం చేశాడు. ఎలాగైనా ఇతని బండారం బయటపెట్టాలని ప్రయత్నించాను. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. అందుకే ఇలా చేశాను..!’ అన్నాడు అభిరామ్‌. దాంతో భయపడిన చలమయ్య పారిపోవాలని అటూఇటూ చూశాడు. కానీ జనం పట్టుకొని దేహశుద్ధి చేశారు.

బూర్లె నాగేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని