ఇష్టంతోనే.. కష్టపడు..!

స్వాతి, వేసవి సెలవులకు అమ్మమ్మ వాళ్ల ఊరు కవతరం వెళ్లింది. అది చాలా అందమైన పల్లెటూరు. అందులో విశాలమైన ఆవరణలో ఉన్న పెంకుటింట్లో వాళ్ల తాతయ్య రంగయ్య, అమ్మమ్మ శాంతమ్మ ఉంటారు.

Updated : 18 May 2024 03:44 IST


స్వాతి, వేసవి సెలవులకు అమ్మమ్మ వాళ్ల ఊరు కవతరం వెళ్లింది. అది చాలా అందమైన పల్లెటూరు. అందులో విశాలమైన ఆవరణలో ఉన్న పెంకుటింట్లో వాళ్ల తాతయ్య రంగయ్య, అమ్మమ్మ శాంతమ్మ ఉంటారు. ఒకరోజు తెల్లవారుజామున అదే పనిగా కోడి కూస్తుంటే స్వాతికి మెలకువ వచ్చింది. మెల్లగా లేచి.. నిద్ర ముఖంతోనే బయటికి వచ్చింది. అక్కడ.. చిన్న దూడ రంకెలు వేస్తుంటే తాతయ్య దాన్ని ఆపడానికి అరుస్తున్నాడు. ఇంకాసేపయ్యాక.. అమ్మమ్మ గేదె దగ్గర పీట వేసుకుని కూర్చుని, చిన్న బిందెలో పాలు పితుకుతుంటే అక్కడికి వెళ్లి కూర్చుందా అమ్మాయి. ‘తల్లీ! లేచావా? వెళ్లి ముఖం కడుక్కో. పాలు కాచిస్తాను.. తాగేసి తాతయ్యతో కలిసి పొలం దగ్గరకు వెళ్దువుగానీ’ అంది శాంతమ్మ. ‘పొలం దగ్గరకా.. తప్పకుండా వెళ్తాను అమ్మమ్మా..!’ అంటూ వెంటనే వెళ్లి, పళ్లు తోముకొని వచ్చింది స్వాతి. ఈలోగా శాంతమ్మ.. స్వాతికి చిక్కటి పాలు గ్లాసులో పోసిచ్చింది. అలాగే రంగయ్యకు కూడా గ్లాసుడు కాఫీ ఇచ్చింది. పాలు తాగుతూ.. ‘అమ్మమ్మా! ఈ పాలు భలే రుచిగా ఉన్నాయి. మా ఇంటి దగ్గర కన్నా ఇవే బాగున్నాయి’ అంది స్వాతి. ‘ఇవి స్వచ్ఛమైన పాలు తల్లీ..! అందుకే అంత రుచిగా ఉన్నాయి. మీరు అక్కడ తాగేవి ఇంత స్వచ్ఛమైనవి కాదు కదా!’ అంది శాంతమ్మ.

తర్వాత తాతయ్యతో కలిసి స్వాతి పొలానికి బయలుదేరింది. అక్కడ పచ్చని పొలాలను చూసి మైమరిచి పోయింది. అన్ని మొక్కలను చూపిస్తూ.. ‘తాతయ్యా! ఈ మొక్క పేరేంటి? ఆ మొక్క పేరేంటి?’ అని అడగసాగింది. ఆయన అన్నింటి గురించి ఓపికగా వివరించారు. ‘ఇది వరి పంట. ఈ పంట నారు వేసినప్పటి నుంచి.. రోజూ నీళ్లు పట్టాలి. పురుగు పట్టకుండా పురుగుల మందులు చల్లాలి. ఎక్కువ పంట పండటానికి ఎరువులు వేయాలి. అలా జాగ్రత్తగా పెంచితే 108 రోజుల తర్వాత, వరి కంకులు తయారవుతాయి. వాటిలో వడ్ల గింజలు ఉంటాయి. వాటిని మిల్లులో మర పట్టిస్తే మనం తినే బియ్యం వస్తాయి’ అని చెప్పాడు రంగయ్య. ‘అమ్మో! మనం తినే అన్నం కోసం ఇంత కష్టపడాలా తాతయ్యా?’ అని ఆశ్చర్యంగా అంది స్వాతి. ‘అవునమ్మా! అందుకే అన్నం ఎప్పుడైనా వృథా చేయకూడదు. అవసరమైనంత మాత్రమే పెట్టుకోవాలి. వరి పండించే రైతు కష్టాన్ని మనం గౌరవించాలి’ అన్నాడు రంగయ్య. కాసేపటికి ఇద్దరూ ఇంటికి వచ్చారు. అప్పటికే శాంతమ్మ వారికి టిఫిన్లు పూర్తి చేసి కవ్వంతో వెన్న చిలుకుతోంది. కానీ అదంతా ఏంటో స్వాతికి అర్థం కాలేదు. ‘అమ్మమ్మా! ఏమిటది? నువ్వు ఎందుకు కర్రతో అలా తిప్పుతున్నావు?’ అని అడిగింది. ‘ఇది కర్ర కాదమ్మా! కవ్వం అని అంటారు. దీనితో చాలాసేపు ఇలా మజ్జిగ చిలికితే, వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నని కరగబెడితే నెయ్యిగా మారుతుంది’ అని చెప్పింది శాంతమ్మ. ‘అమ్మమ్మా! నెయ్యి కోసం ఇంత కష్టపడాలా? ఎంచక్కా డబ్బాల్లో దొరుకుతుంది కదా!’ అంది స్వాతి. ‘ఆ డబ్బాల్లో దొరికేది కూడా ఇలా తయారు చేసిందేనమ్మా’ అని బదులిచ్చింది శాంతమ్మ.

‘ఏంటి అమ్మమ్మ.. నెయ్యి కోసం కష్టపడాలని నువ్వు చెబుతున్నావు. పంట కోసం కష్టపడాలని తాతయ్య చెబుతున్నారు. కష్టపడకుండా ఏదీ రాదా?’ అని సందేహంగా అడిగింది స్వాతి. ‘ఒక శిలను బాగా చెక్కితేనే మంచి శిల్పంలాగా తయారవుతుంది. నిప్పులో కాల్చితేనే స్వచ్ఛమైన బంగారం సిద్ధమవుతుంది. దేనికైనా కష్టపడటమే విజయ రహస్యం. కష్టపడకుండా వచ్చిందేదీ ఎక్కువ రోజులు ఉండదమ్మా!’ అన్నాడు రంగయ్య. ఆయన చెప్పేవన్నీ చాలా ఆసక్తిగా వింటోంది స్వాతి. ‘మనం చేసే పనిని ముందుగా ఇష్టపడాలి. అప్పుడది ఎంత కష్టమైనా ఇబ్బందిగా అనిపించదు.. నువ్వు కూడా ఇప్పటి నుంచే కష్టపడి చదువుకుంటే.. పెద్దయ్యాక మంచి స్థాయిలో ఉంటావు.. సరేనా!’ అన్నాడు రంగయ్య. దానికి ‘అలాగే తాతయ్యా! నేను నువ్వు చెప్పినట్లే చేస్తాను’ అని బదులిచ్చింది స్వాతి. ఇంతలోనే శాంతమ్మ వారికి టిఫిన్‌ తీసుకొచ్చి వడ్డించింది.  

కె.వి.సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని