బంటీ మంచి బాలుడు!

పన్నెండేళ్ల బంటి, మహా అల్లరి పిల్లాడు. ఎప్పుడూ ఉన్న చోట ఉండడు. కుదురుగా కూర్చోవడం బంటి వల్ల అయ్యే పని కాదు. తరగతి గదిలోనూ పాఠం వినకుండా పక్క పిల్లలతో మాట్లాడుతూ, వారిని కూడా పాఠం వినకుండా చేసేవాడు.

Updated : 19 May 2024 03:35 IST

న్నెండేళ్ల బంటి, మహా అల్లరి పిల్లాడు. ఎప్పుడూ ఉన్న చోట ఉండడు. కుదురుగా కూర్చోవడం బంటి వల్ల అయ్యే పని కాదు. తరగతి గదిలోనూ పాఠం వినకుండా పక్క పిల్లలతో మాట్లాడుతూ, వారిని కూడా పాఠం వినకుండా చేసేవాడు. ఉపాధ్యాయులు హెచ్చరించినా పద్ధతి మార్చుకునేవాడు కాదు. చివరికి వీధిలో కుక్కలు కనపడినా కూడా రాళ్లతో వాటిని కొట్టేవాడు. అవి నొప్పితో బాధపడుతుంటే అనందించేవాడు. ఓ రోజు బడి నుంచి ఇంటికి వెళ్తుంటే దారిలో కనపడ్డ కుక్క పిల్లను రాయితో కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న బంటిని ఆపాడు స్నేహితుడు హరిచరణ్‌.

‘బంటీ... అలా రాళ్లతో మూగ జీవుల్ని కొడితే ఏమొస్తుంది! అలా హింసించడం పాపం. ఇకనైనా పద్ధతి మార్చుకో.. ఒక స్నేహితుడిగా చెబుతున్నా...!’ అన్నాడు హరిచరణ్‌. ‘ఆ విషయం నాకు తెలుసు కానీ.. రాళ్లతో గురి చూసి కొట్టగలగడం ఒక కళ. అది నాకు మాత్రమే సొంతం. కావాలంటే నువ్వూ ప్రయత్నించు. నా ఆనందాన్ని ఆపే హక్కు నీకు లేదు!’ అంటూ బదులిచ్చాడు బంటి. సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్న హరిచరణ్‌ను చూసి నవ్వుకున్నాడు.

మరుసటి రోజు బడి ముగిశాక చేతిలో గులక రాళ్లను ఎగరేస్తూ హరిచరణ్‌ దగ్గరకు వచ్చాడు బంటి. ‘హరీ.. ఈ రోజు నేరుగా ఇంటికి వెళ్లకుండా మామిడి తోటకు వెళ్దామా..? అక్కడ మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయట. సరదాగా దొంగతనం చేద్దాం..’ అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ నవ్వాడు బంటి. ‘దొంగతనం నేరం, పైగా అక్కడ చాలా తేనెతుట్టెలున్నాయి. నేను రాను. నువ్వూ వెళ్లకు’ అన్నాడు హరిచరణ్‌. ‘దొంగతనం నేరం, ఘోరం అని నువ్వు నీతి వాక్యాలు చెబుతావని తెలిసీ, నిన్ను పిలిచా చూడు.. నిజంగా నాదే తప్పు’ అంటూ, అక్కడి నుంచి వెళ్లిపోయాడు బంటి.

తర్వాత మామిడి తోటలోకి వెళ్లి, రాళ్లను విసరడం మొదలుపెట్టాడు. గురి తప్పని అతని రాళ్లు నేరుగా మామిడి పండ్లను తాకి లక్ష్యాన్ని చేధిస్తున్నాయి. ‘త్వరగా.. కిందపడ్డ మామిడి పండ్లను ఏరుకోవాలి. లేదంటే కాపలాదారులు వచ్చేస్తారు. వాళ్లు వచ్చారు అంటే ఇక నా సంగతి అంతే!’ అనుకుంటూ రాళ్లను విసిరాడు. ఒక రాయి గురి తప్పి తేనెతుట్టెను తాకింది. తేనెటీగలు ఆగ్రహంతో బంటిపై దాడి చేశాయి. విపరీతమైన నొప్పితో విలవిల్లాడుతూ కాళ్లకు పని చెప్పాడు బంటి. జరగబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన హరిచరణ్‌ ముందుగానే బంటి వాళ్ల అమ్మానాన్నలకు విషయం చెప్పాడు. అప్పటికే వారు తోట దగ్గరికి వచ్చి ఉన్నారు. గాయాలతో బయటకు వచ్చిన బంటీని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారం రోజుల తర్వాత కానీ కోలుకోలేకపోయాడు బంటి.

ఒక రోజు, ఇంటి ముందు అరుగుపై దిగాలుగా కూర్చున్న బంటి దగ్గరకు హరిచరణ్‌ వెళ్లాడు. ‘బంటీ... చూశావు కదా! నీ అల్లరి ఎలాంటి ప్రమాదాన్ని తీసుకు వచ్చిందో.. రాళ్లను విసరడం ఎల్లప్పుడూ మంచిది కాదు. అక్కడ తేనెటీగలు ఉంటాయని నాకు ముందే తెలుసు. అందుకే నిన్ను హెచ్చరించాను. నువ్వు నా మాట వినలేదు. అయినా ఎందుకైనా మంచిదని మీ అమ్మానాన్నలను అప్రమత్తం చేశాను. దీని వల్ల వారు వెంటనే నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్లగలిగారు. లేకపోతే చాలా ప్రమాదం జరిగి ఉండేది. ఈ సంఘటన తర్వాత అయినా నీలో మార్పు వస్తుందనుకుంటున్నాను’ అంటూ తను తెచ్చిన సంచిని బంటికి అందించాడు హరిచరణ్‌.

దాన్ని తెరిచి చూస్తే అందులో మామిడిపండ్లు ఉన్నాయి. ఆశ్చర్యంగా చూస్తున్న బంటిని చూసి హరిచరణ్, ‘బంటీ.. ఇవి నువ్వు రాయితో కొట్టిన మామిడి పండ్లే! తోట యజమాని రాజయ్య దగ్గర అసలు విషయం చెప్పి క్షమించమని వేడుకుని ఈ పండ్లను కొన్నాను’ అన్నాడు.

‘హరీ.. నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. నాలో మార్పు కోసం నువ్వు చేసిన ప్రయత్నం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ఇక నుంచి నేను మారిన బంటిని. అల్లరి తగ్గించుకుని బాధ్యతగా వ్యవహరిస్తాను’ అన్నాడు బంటి. చెప్పినట్లుగానే, ఆ రోజు నుంచి బంటి పూర్తిగా మారిపోయాడు. మనుషులను మాటలతో, జంతువులను రాళ్లతో హింసించడం మానుకున్నాడు. అందరితో బంటీ మంచి బాలుడు అనిపించుకున్నాడు.  

వడ్డేపల్లి వెంకటేష్‌ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని