కుందేలు తీర్పు... మృగరాజులో మార్పు!

అడవిలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఒకవైపు సింహం రాజుగా, నక్క మంత్రిగా మరోవైపు ఏనుగు రాజుగా, కుందేలు మంత్రిగా పోటీ చేస్తున్నాయి. ఎన్నికల రోజు రానే వచ్చింది. అడవిలోని జంతువులు రాజుగా సింహాన్ని, మంత్రిగా కుందేలును ఎన్నుకున్నాయి.

Updated : 20 May 2024 03:50 IST


డవిలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఒకవైపు సింహం రాజుగా, నక్క మంత్రిగా మరోవైపు ఏనుగు రాజుగా, కుందేలు మంత్రిగా పోటీ చేస్తున్నాయి. ఎన్నికల రోజు రానే వచ్చింది. అడవిలోని జంతువులు రాజుగా సింహాన్ని, మంత్రిగా కుందేలును ఎన్నుకున్నాయి. ఏనుగు.. అడవికి రాజుగా ఎంపికైన సింహం దగ్గరకు వెళ్లి అభినందించింది. సింహం గర్వంతో.. ‘నాతోనే పోటీకి సై అన్నావు. ఇప్పుడు నీకు పరాభవం ఎదురైంది కదా!’ అని ఎద్దేవా చేసింది. ఏనుగు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. 

కుందేలు కూడా వచ్చి.. ‘మృగరాజా! మీకు అభినందనలు’ అని అంది. సింహం పక్కనే ఉన్న నక్క, మృగరాజుతో... ‘కుందేలుకు మంత్రిగా గెలిచానని గర్వంగా ఉంది’ అంది. ‘నీ అభినందనలకు ధన్యవాదములు’ అని సింహం కుందేలుకు కాస్త ముభావంగా సమాధానమిచ్చింది. 

నిజానికి అడవికి కుందేలు మంత్రి అయినప్పటికీ సింహంతో ఎప్పుడూ నక్కే ఉండేది. దాని సలహాలతోనే సింహం పాలన చేయడం వల్ల జంతువులు చాలా ఇబ్బంది పడ్డాయి. తనకు మద్దతు ఇవ్వని జంతువులపై సింహానికి లేనిపోని మాటలు చెప్పి నక్క వాటికి ఇబ్బంది కలిగించేది. అలాంటి జంతువులన్నీ ఏకమై సింహం దగ్గరికి వెళ్లి... ‘మృగరాజా! మేమంతా కుందేలును మంత్రిగా ఎన్నుకున్నాం. కానీ మీరు నక్క సలహాలతో పాలన చేస్తూ జంతువులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇది సరి కాదు’ అన్నాయి. 

‘ఇకపై కుందేలు సలహాలతోనే పాలన జరుగుతుంది’ అని వాటికి మృగరాజు హామీ ఇచ్చింది. దీంతో జంతువులన్నీ వెళ్లిపోయాయి. ‘వాళ్ల కన్ను వాళ్ల వేళ్లతోనే పొడవాలి. వారితోనే కుందేలు మాకు మంత్రిగా అక్కర్లేదని అనిపిద్దాం. ఇకపై ఎటువంటి సమస్య వచ్చినా కుందేలుతోనే పరిష్కారం చెప్పిద్దాం’ అని నక్క, మృగరాజును ఒప్పించింది. 

ఒకరోజు నక్క, మృగరాజుతో.. ‘గున్న ఏనుగు మన అడవి జంతువులు తాగే మంచి నీటి కొలనులో దిగి నీటిని బురదమయం చేస్తోంది. దానిపై తగిన చర్యలు తీసుకోండి’ అని ఫిర్యాదు చేసింది. వెంటనే మృగరాజు, సమావేశం ఏర్పాటు చేసింది. మంత్రి కుందేలుతో.. ‘ఈ గున్న ఏనుగు మన అడవి జంతువులు తాగే నీటిని బురదమయం చేస్తోంది. దీనికి తగిన శిక్ష విధించు’ అని ఆజ్ఞ జారీ చేసింది. అప్పుడు మంత్రి కుందేలు.. ‘మృగరాజా! విచారణ చేసి శిక్ష విధించాలి’ అని అంది. 

‘నేను విచారణ చేయించాను. నువ్వు శిక్ష మాత్రమే విధించు’ అని గట్టిగా అరిచింది. కుందేలు ఆలోచించి, తల్లి ఏనుగుతో.. ‘గున్న ఏనుగు, కొలను నీటిని బురదమయం చేసింది కాబట్టి, ఇకపై కొలను నీటిని ఎవరూ బురదమయం చేయకుండా నువ్వు, గున్న ఏనుగు ప్రతిరోజు కాపలా ఉండాలి. ఎవరైనా బురదమయం చేస్తే వెంటనే మీరు వాటిని శిక్షించవచ్చు. ఇదే మీకు శిక్ష’ అని తీర్పు చెప్పింది. 

తల్లి ఏనుగు, గున్న ఏనుగు కుందేలు తీర్పునకు ‘సరే’ అని బదులిచ్చాయి. నక్క, కుందేలు తీర్పు విని గాబరా పడింది. ఎందుకంటే అదే అనునిత్యం ఆ కొలనులో తన అనుచరులతో దిగి బురదమయం చేసేది. ఇప్పుడు ఏనుగు కాపలా ఉంటే వీలు పడదని కంగారు పడ్డది. ఎప్పుడైతే గున్న ఏనుగు, ఏనుగు కొలనుకు కాపలాగా ఉన్నాయో అప్పటి నుంచి జంతువులన్నింటికీ చక్కని నీరు లభించడం మొదలైంది. కుందేలు తీర్పు మనకు చాలా మేలు చేసిందని జంతువులన్నీ మెచ్చుకున్నాయి. 

ఇలా మంత్రికి మంచి పేరు రావడం నక్క జీర్ణించుకోలేక పోయింది. మరోసారి మృగరాజుతో... ‘మన అడవిలో తోడేలు, కుందేలు పిల్లలను వేటాడుతూ నచ్చినట్లు తినేస్తోంది. దానికి సరైన శిక్ష విధించకపోతే కుందేళ్ల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది’ అని చెప్పింది. వెంటనే మృగరాజు, అడవి జంతువులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ తోడేలును రప్పించి మంత్రి కుందేలుతో.. ‘ఇది అడవిలో హాయిగా జీవిస్తున్న కుందేలు పిల్లలను వేటాడుతోంది. వాటి జాతినే నాశనం చేయాలని చూస్తోంది. దీనికి సరైన శిక్ష విధించు’ అని ఆజ్ఞ జారీ చేసింది. 

కుందేలు తోడేలును... ‘నీపై వచ్చిన ఫిర్యాదుకు ఏం సమాధానం చెబుతావు?’ అని అడిగింది. మృగరాజు కల్పించుకొని.. ‘నువ్వు విచారణ చేయనక్కర్లేదు. శిక్ష మాత్రమే విధించు’ అని కోప్పడ్డది. మంత్రి కుందేలు ఆలోచించి.. ‘ఈ తోడేలు... కుందేలు జాతిని నాశనం చేస్తోంది. కాబట్టి ఆ కుందేలు జాతిని రక్షించే బాధ్యత నేటి నుంచి తీసుకోవాలి. కుందేళ్లను ఎవరూ వేటాడకుండా ఈ తోడేలు నిరంతరం కాపలా ఉండాలి’ అని తీర్పు చెప్పింది. 

ఇది వినడంతోనే నక్క బెంబేలెత్తింది. ఎందుకంటే కుందేళ్లను ఇష్టం వచ్చినట్లు వేటాడుతూ తింటున్నది నక్కే. ఇప్పుడు మంత్రి కుందేలు తీర్పుతో తోడేలు వాటికి రక్షణగా నిలుస్తుంది. ఇక తన కుందేళ్ల వేట సాగదని అనుకుంది. తోడేలు కుందేళ్ల పిల్లలను నిరంతరం కాపాడుతూ కుందేలు జాతికి బంధువైంది. 

అడవి జంతువులు సింహం దగ్గరకు వెళ్లి... ‘మృగరాజా! మీరు మంత్రి కుందేలు ద్వారా ఇస్తున్న తీర్పులు అడవికి చాలా మేలు చేస్తున్నాయి. మీరు చాలా గొప్ప పరిపాలకులు’ అని పొగడ్తలతో ముంచెత్తాయి. మృగరాజు అడవి జంతువుల పొగడ్తలకు ఉబ్బితబ్బిబ్బైంది. సింహంలో మార్పు వచ్చింది. 

‘నువ్వు ఇచ్చిన తీర్పుల వల్ల నాకు చాలా మంచి పేరు వచ్చింది. నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ మరో సమావేశంలో.. కుందేలును, సింహం అభినందించింది. ఇంతలో అక్కడకు నక్క రాగా మృగరాజు దానితో... ‘ఇకపై నువ్వు నా దగ్గరకు రావద్దు. ఎటువంటి ఫిర్యాదులు చేయవద్దు. ఈ అడవిలో జీవించాలంటే నువ్వు కూడా ఇతరులకు మేలు కలిగే విధంగా నడుచుకోవాలి. లేకపోతే నా పంజా దెబ్బకు నీ ప్రాణాలు పోతాయి’ అంటూ నక్కకు చీవాట్లు పెట్టింది. 

‘మన్నించండి. నన్ను మంత్రిగా ఎన్నుకోలేదనే అక్కసుతో కుందేలును ఇబ్బంది పెట్టాలని చూశాను. ఇన్ని రోజులూ అనవసరమైన ఫిర్యాదులు చేశాను. ఇకపై నేను మీతో కలిసి మెలిసి బతుకుతాను’ అని వేడుకుంది. కుందేలుకు క్షమాపణలు చెప్పుకుంది. నక్కలో వచ్చిన మార్పునకు జంతువులన్నీ సంతోషించాయి. 

మొర్రి గోపి   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని