రాము దిద్దిన వ్యాపారం!

వేసవి సెలవుల్లో.. ఏదైనా దుకాణంలో పని చేయాలనుకున్నాడు, చాలా పేద కుర్రాడైన రాము. తల్లిదండ్రులేమో కూలి పనులు చేస్తుంటారు. తాను దుకాణంలో పని చేస్తే వచ్చే డబ్బులతో.. పై తరగతికి పుస్తకాలు, దుస్తులు కొనుక్కోవచ్చు అనుకున్నాడు.

Published : 23 May 2024 00:36 IST

వేసవి సెలవుల్లో.. ఏదైనా దుకాణంలో పని చేయాలనుకున్నాడు, చాలా పేద కుర్రాడైన రాము. తల్లిదండ్రులేమో కూలి పనులు చేస్తుంటారు. తాను దుకాణంలో పని చేస్తే వచ్చే డబ్బులతో.. పై తరగతికి పుస్తకాలు, దుస్తులు కొనుక్కోవచ్చు అనుకున్నాడు. ఒక కిరాణా దుకాణంలో పనికి కుదిరాడు. నర్సింహ దానికి యజమాని. దుకాణంలో ప్రతీ వస్తువును ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతుండేవాడు అతడు. అది గమనించాడు రాము. 

అలా ఎక్కువ ధరలకు సరకులు అమ్మటం రాముకు నచ్చలేదు. అది కొనుగోలుదారుల్ని మోసం చేయడమే అవుతుందని భావించాడు. కానీ తనేం చేయలేకపోయాడు. ఒకరోజు ఓ వస్తువును ఎమ్మార్పీకే రాము అమ్మడాన్ని చూసి, నర్సింహ ఉగ్రుడైపోయాడు. ‘నేను చెప్పినట్టు నువ్వు అమ్మాలి. ఈ దుకాణ యజమాని నువ్వా... నేనా?’ అన్నాడు రామూను. మరోసారి అలా చేస్తే బాగుండదని హెచ్చరించాడు. ఒకసారి దుకాణం, రామూకు అప్పజెప్పి సరకులు తేవడానికి పట్నం వెళ్లాడు నర్సింహ. వెళ్లేముందు ఏ సరకులు, ఎంతకు అమ్మావో రాసి ఉంచమన్నాడు. రాము అయిష్టంగా.. అలాగే చేశాడు. పట్నం నుంచి తిరిగొచ్చిన నర్సింహ.. సరకులు, డబ్బులు లెక్క చూసుకుని సంతోషించాడు. ‘అదీ అలాగే అమ్మాలి... తెలిసిందా?’ అన్నాడు రామూను మెచ్చుకుంటూ. 

‘మీరు చెప్పారని నేను అలా అమ్మాను కానీ, నాకైతే ఇష్టం లేదు. ఎమ్మార్పీ కంటే ఒక్క పైసా కూడా ఎక్కువకు అమ్మకూడదని ప్రభుత్వం కూడా చెబుతోంది. అదీ కాకుండా... ఈ ప్రాంతంలో మన ఒక్క దుకాణమే ఉండడం వల్ల, మనం అలా అమ్ముతున్నాం. కానీ కొనుక్కున్నవాళ్లు అందరూ చాలా బాధపడుతూ సరకులు తీసుకెళుతున్నారు. వాళ్లు అలా బాధ పడడం మనకు మంచిది కాదు’ అని చెప్పాడు రాము. 

నర్సింహ అంతెత్తున లేచాడు. ‘ఏది మంచో, ఏది మంచిది కాదో నువ్వా నాకు చెప్పేది? నాకన్నీ తెలుసు. నేను చెప్పినట్టు వింటేనే నువ్వు నా దుకాణంలో పనిచేస్తావు. లేదా నేను మరొక కుర్రాణ్ని పెట్టుకోవాల్సి వస్తుంది జాగ్రత్త!’ అని కటువుగా చెప్పాడు. చేసేది లేక మౌనంగా ఉండిపోయాడు రాము. ఒకరోజు దుకాణం, రామూకు అప్పజెప్పి నర్సింహ తన చుట్టాలింటికి వెళ్లాడు. అది పల్లెటూరు. బస్సు దిగాడు నర్సింహ. ఎండ మండిపోతోంది. దాహంతో అతని నోరు పిడచకట్టుకుపోయింది. 

ఒక అంగడి దగ్గర ఆగాడు అతడు. నీళ్ల సీసా కావాలన్నాడు. దుకాణం యజమాని ఇచ్చాడు. సీల్‌ తీయబోతూ ఎందుకో అనుమానం వచ్చి ధర ఎంత అని అడిగాడు నర్సింహ. ‘ముప్పై రూపాయలు’ అని చెప్పాడు ఆ దుకాణం యజమాని. నర్సింహ ఆశ్చర్యపోయాడు. ‘అదేంటి? లీటర్‌ నీళ్లసీసా పదిహేను, లేదా ఇరవై రూపాయలుంటుంది కదా? నువ్వేంటి ముప్పై అంటున్నావు?’ అన్నాడు నర్సింహ. ‘చూడయ్యా! నీకు నచ్చితే కొనుక్కో, లేదా వెళ్లిపో. ఈ ప్రాంతంలో ఇదొక్కటే దుకాణం. నువ్వు చెప్పినట్టు పదిహేను, పదికి అమ్మినట్టయితే వ్యాపారం మానేసి, నా దుకాణం మూసుకోవాల్సి వస్తుంది’ అని చిరాగ్గా చెప్పాడు దుకాణ యజమాని. 

ఒకవైపు నడినెత్తిన ఎండ మండిపోతోంది. మరోవైపు విపరీతమైన దాహం! అప్పుడు నీరు తాగకపోతే ప్రాణం పోతుందేమో అనిపించింది నర్సింహకి. చేసేది లేక ముప్పై రూపాయలిచ్చి నీళ్లసీసా కొనుక్కుని గబగబా తాగాడు. దుఃఖంతో, బాధతో దుకాణం వ్యక్తిని తిట్టుకుంటూ ముందుకు కదిలాడు నర్సింహ. 

అతనికి చల్లని మంచి నీళ్లతో దాహం తీరింది. కానీ చెవుల్లో ఎవరో తిట్లు, శాపనార్థాలు పెడుతున్నట్లు అనిపించింది. తను కూడా తన దుకాణంలో ఎక్కువ ధరలకు వస్తువులు అమ్మినప్పుడు కొనుగోలుదారులు బాధపడుతూ, దుఃఖంతో తనను ఇలాగే తిట్టి ఉంటారు అనుకున్నాడు నర్సింహ. చిన్నవాడయినా రాము చెప్పిన మాటల్ని తను పెడచెవిన పెట్టాడు. ప్రత్యక్షంగా ఇప్పుడు అనుభవిస్తేనే కానీ, ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం కాలేదు. ఈ సంఘటన తర్వాత నుంచి నర్సింహలో మార్పు వచ్చింది. తన దుకాణంలో ఎమ్మార్పీకే వస్తువులను అమ్మడం ప్రారంభించాడు. తన యజమానిలో వచ్చిన మార్పును చూసి రాము ఎంతో సంతోషించాడు. 

నంద త్రినాథ రావు 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని