చందన చెప్పింది.. వందన మారింది..!

అనగనగా ఒక నందనవనం. అందులో వందన అనే చిట్టి చిలుక, తన తల్లితో కలసి జామ చెట్టు మీద నివసిస్తోంది. దానికి జామపండ్లు అంటే చాలా ఇష్టం. రోజూ ఉదయాన్నే జామపండు తిన్నాక.. అదే చెట్టు మీద ఉన్న కోయిల, కాకి పిల్లలతో ఆడుకునేది.

Published : 26 May 2024 00:23 IST

నగనగా ఒక నందనవనం. అందులో వందన అనే చిట్టి చిలుక, తన తల్లితో కలసి జామ చెట్టు మీద నివసిస్తోంది. దానికి జామపండ్లు అంటే చాలా ఇష్టం. రోజూ ఉదయాన్నే జామపండు తిన్నాక.. అదే చెట్టు మీద ఉన్న కోయిల, కాకి పిల్లలతో ఆడుకునేది. కానీ వాటిని కావాలనే ఏడిపించి.. ఆటలో భాగంగానే అలా చేశానంటూ సాకులు చేప్పేది. ప్రతిరోజూ వందన అలాగే ప్రవర్తిస్తుండటంతో.. ‘ఇక మేము నీతో ఆడలేము’ అంటూ.. కోకిల, కాకి పక్కనే ఉన్న ఇంకో చెట్టు మీదకు వెళ్లిపోయాయి. అప్పుడు కూడా.. వందన ఏమాత్రం బాధపడకుండా.. ‘మీరు వెళ్లిపోతే నాకేంటి? ఇంకెవరైనా వస్తారు.. నాతో ఆడుకోవడానికి!’ అంది. 

ఒకరోజు చందన అనే ఉడుత ఆ చెట్టు మీదకు వచ్చింది. దాన్ని చూసిన వందన.. వెంటనే వెళ్లి పక్కన వాలింది. ‘నా పేరు వందన.. ఇదే చెట్టు మీద మా అమ్మతో కలిసి ఉంటాను. మరి నువ్వు?’ అంటూ ఉడుతను అడిగింది. అది కూడా పరిచయం చేసుకొని.. ‘ఇటుగా వెళ్తూ.. ఆకలి వేయడంతో చెట్టు మీదకు పండు తిందామని వచ్చాను’ అని చెప్పింది. ‘ఆకలి వేస్తోందా?’ అని ఒక పండు కోసి.. చందనకు ఇచ్చింది వందన. ‘నీ గుణం నాకు నచ్చింది. నాతో స్నేహం చేస్తావా?’ జామపండు తీసుకుంటూ అడిగింది చందన. ‘ఓ.. తప్పకుండా చేస్తాను. నేను కూడా మంచి స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాను’ అని బదులిచ్చింది వందన. అలాగేనంటూ.. చందన జామపండు తింటూ, వందనను అమాంతం కూర్చున్న కొమ్మ మీద నుంచి కిందికి తోసింది. ఏం జరుగుతుందో తెలియక కింద పడిపోతూ.. మళ్లీ వెంటనే పైకి ఎగిరింది. కాస్త కుదుటపడ్డాక.. ‘ఎందుకలా తోసావు?’ కోపంగా అడిగింది. ‘మనం స్నేహితులం కదా! ఊరికే సరదాగా తోసానంతే. భయమేసిందా?’ అని నవ్వుతూ అంది చందన. 

దానికి నిజంగానే భయమేసినా.. ‘అలా ఏం కాదు..!’ అని పైకి నవ్వుతూ చెప్పింది. మళ్లీ కాసేపటికి.. వందన కూడా ఓ పండు తెంపుకొని తినసాగింది. అప్పుడు చందన దాన్ని తిననివ్వకుండా లాక్కొని కిందపడేసింది. ‘మళ్లీ ఎందుకలా చేశావు. కిందపడిన పండు నేను తినను. అయినా ఒకరు తింటున్న పండుని అలా పడేయడం తప్పు కదా!’ అని చందన వైపు కోపంగా చూస్తూ అడిగింది వందన. ‘ఇది కూడా నా ఆటలో భాగమే మిత్రమా.. అయినా ఆడుతుంటే అల్లరి అంటే ఎలా?’ నవ్వుతూ అడిగింది చందన. ఎదురు తిరిగితే.. ఉన్న ఒక్క నేస్తం కూడా ఉండదని.. ‘అలాగా.. నేను ఇంకో పండు కోసుకొని తింటాలే!’ అంది వందన. అప్పుడే చందన అది తినగా మిగిలిన పండులోని గింజలను వందన మీదకు విసరసాగింది. ‘అదేంటి? ఎంగిలి గింజలు అలా విసరడం తప్పు కదా! అవి నాకు తగులుతున్నాయి’ అని కాస్త విసుగ్గా అంది వందన. ‘అయ్యో! వందనా..! ఇది కూడా నా ఆటలో భాగమే. నేను ఇలాగే ఆడతాను’ అంది చందన. ఇదంతా భరించలేని వందన.. ‘ఆటలంటూ అల్లరి చేస్తున్నావు. నన్ను కావాలనే ఏడిపిస్తున్నావు. ఇక నుంచి నీతో నేను ఆడను..!’ అని చందనతో గట్టిగా చెప్పింది.

‘అవునా! మరి నీ ప్రవర్తన వల్ల ఇన్ని రోజులు కోకిల, కాకి ఎంత ఇబ్బంది పడ్డాయో ఇప్పటికైనా అర్థమైందా!’ అంది చందన. ‘తెలిసింది.. అందుకే నా నేస్తాలను క్షమాపణ అడగాలని అనుకుంటున్నాను. ఇంతకీ ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు?’ అని ఆశ్చర్యంగా అడిగింది వందన. ‘నేను ఈ చుట్టుపక్కలే తిరుగుతుంటాను. అలా ఒకసారి మీరు ఆడుకుంటుంటే చూశాను.. కానీ కొన్నిరోజుల తర్వాత మీరు మాట్లాడుకోవట్లేదని మీ మిత్రులు కోకిల, కాకి వచ్చి నాతో చెప్పి.. చాలా బాధపడ్డాయి. నీ బుద్ధి మార్చి.. ఎలాగైనా మళ్లీ మిమ్మల్ని కలపాలి అనుకున్నాను. అందుకే నీ దగ్గరకు వచ్చి.. నీతో స్నేహం చేశాను’ అంది చందన. ‘అయితే.. పద మనం ఇద్దరం కలిసి వెంటనే నా మిత్రుల దగ్గరకు వెళ్దాం’ అని వందన అనగానే, రెండూ కలిసి బయలుదేరాయి. అక్కడికి వెళ్లాక.. ‘మిత్రులారా..! మీ ఇద్దరూ నన్ను క్షమించండి. నా చేష్టలతో మీరు చాలా ఇబ్బందిపడ్డారు. ఇంకెప్పుడూ అలా చేయను. ఇదిగో ఇది మన కొత్త నేస్తం. దీని వల్లే.. నాకు మీరు ఎంత ఇబ్బందిపడి ఉంటారో తెలిసొచ్చింది’ అని చెప్పింది వందన. అప్పుడు మూడూ కలిసి.. చందనకు కృతజ్ఞతలు తెలిపాయి. అప్పటి నుంచి దాన్ని కూడా వాటితో చేర్చుకున్నాయి. ఎంచక్కా అన్నీ కలిసి ఎలాంటి గొడవలు లేకుండా ఆడుకోసాగాయి.

కె.వి.లక్ష్మణ రావు 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని