ఇసుక కోట... అతి పెద్దదంట!

అదో ఇసుక కోట...ఈ మధ్యే కట్టారు... దానిపై తాజ్మహల్తో పాటు బోలెడు వింతలున్నాయి... పైగా ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఇసుక కోట ఇదే!

Published : 17 Jan 2016 11:49 IST

ఇసుక కోట...అతి పెద్దదంట!

అదో ఇసుక కోట...ఈ మధ్యే కట్టారు... దానిపై తాజ్‌మహల్‌తో పాటు బోలెడు వింతలున్నాయి... పైగా ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఇసుక కోట ఇదే!

 సైకత శిల్పాలు ఎన్నో చోట్ల చేస్తుంటారు. కానీ ఈ మధ్య కట్టిన ఒక ఇసుక కోట గిన్నిస్‌ రికార్డు కొట్టింది. ఇంత వరకూ ఎక్కడా ఇంత ఎత్తయిన ఇసుక కోట కట్టలేదు. ఈ కోట విశేషాలు చెప్పుకోవాలంటే బోలెడు ఉన్నాయి తెలుసా?

* అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో వర్జీనియా కీ బీచ్‌ పార్కులో ఈ ఇసుక కోటను ఈ మధ్యే నిర్మించారు సైకత శిల్పకారులు.

* ఈ కోట ఎత్తు సుమారు 50 అడుగులు ఉంది. అంటే దాదాపు నాలుగంతస్తుల భవనమంత అనుకోవచ్చు. పైగా ఈ కోటపై ప్రపంచ వింత కట్టడాలన్నింటినీ మలిచారు. మన దేశ అద్భుతం తాజ్‌మహల్‌తోపాటు, పారిస్‌ నగరంలో కొలువుదీరిన ఈఫిల్‌ టవర్‌, అమెరికాలోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ, ఇటలీకి చెందిన లీనింగ్‌ టవర్‌ ఆఫ్‌ పీసా లాంటి ఎన్నో చారిత్రక కట్టడాల ఆకారాలను ఈ కోటపైనే మలిచారు.

* కోట నిర్మాణానికి 12 మంది శిల్పకారులు శ్రమించారు. ఇందులో టెడ్‌ సీబర్ట్‌ అనే కళాకారుడికైతే ఇసుక శిల్పాల నిర్మాణంలో ఏడు ప్రపంచ రికార్డులు వచ్చాయి.

* గత నవంబరులో బ్రెజిల్‌లో కట్టిన ఓ ఇసుక కోటకు అతి ఎత్తయినదిగా రికార్డు వచ్చింది. దాని ఎత్తు 41 అడుగులు. ఇప్పుడు ఈ కొత్త ఇసుక కోటను దాని కన్నా ఎక్కువ ఎత్తుగా నిర్మించడంతో ఆ రికార్డును ఇది బద్దలు కొట్టిందన్నమాట!

* ఈ ఇసుక కోటను టర్కిష్‌ ఎయిర్‌ లైన్స్‌ వాళ్లు నిర్మిస్తున్నారు.

* ఈ సైకత కోట మొత్తం నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమయ్యిందో తెలుసా? ఏకంగా 1800 టన్నులు. అంటే 18,00,000 కిలోల ఇసుక అన్నమాట!

* ఈ కోట మూడు వారాలపాటు మాత్రమే పర్యటకులకు కనువిందు చేస్తుంది. అయితే ఈ బీచ్‌లోని ఇసుకతో దీన్ని కట్టారనుకోకండి. ఒక గనిలో నుంచి ప్రత్యేకంగా ఇసుకను తెప్పించి, దానికి కాస్త బంకమట్టిని కలిపి కోటను చేశారు. బాగా వేగంగా గాలి వీచినా, భారీ వర్షం కురిసినా ఈ కోట కూలిపోతుందిట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని