కుజుడిపై దిబ్బలోయ్‌... కొత్త కబురు తెలిసిందోయ్‌!

అంగారక గ్రహం అంటే ఎంతో ఆసక్తి... అక్కడ జీవం ఉందా? నీరు ఉందా? అని ఎన్నో సందేహాలు... అందుకే ఎప్పుడూ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉంటారు...

Published : 16 Apr 2016 00:32 IST

కుజుడిపై దిబ్బలోయ్‌... కొత్త కబురు తెలిసిందోయ్‌!

అంగారక గ్రహం అంటే ఎంతో ఆసక్తి... అక్కడ జీవం ఉందా? నీరు ఉందా? అని ఎన్నో సందేహాలు... అందుకే ఎప్పుడూ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉంటారు... ఇప్పుడు ఆశ్చర్యపరిచే ఓ సంగతి తెలిసింది... ఇంతకీ ఏంటది?

* అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంగారకుడిపై పరిశోధనలు చేయడానికి ‘క్యూరియాసిటీ’ రోవర్‌ను పంపిందని తెలుసుగా. అది ఎప్పటికప్పుడు అక్కడి విశేషాలను మనకు పంపుతూ ఉంది. మరి కొత్తగా పంపిన కబురేంటో తెలుసా? మార్స్‌పై ఉన్న మౌండ్స్‌ (దిబ్బలు) చాలా ఎత్తుగా ఉన్నాయని. ఈ దిబ్బల గుట్టు తెలుసుకోవడం వల్ల ఒకప్పుడు ఈ అరుణగ్రహంపై నీరు ఉండేదనే సంగతి కూడా తెలిసింది.

* అంగారకుడిపై వాయవ్యభాగంలో ‘గేల్‌’ అనే భారీ బిలం 154 కిలోమీటర్ల చుట్టు కొలతతో ఉంది. ఈ ప్రాంతంలోనే పదుల సంఖ్యలో మౌండ్స్‌ ఉన్నాయి.

* ఈ దిబ్బల్ని ‘నాసా’ 1970లోనే గుర్తించింది. కానీ ఇప్పుడు మార్స్‌పై చక్కర్లు కొడుతున్న క్యూరియాసిటీ రోవర్‌ వీటి గురించి మరో కొత్త విషయం బయటపెట్టింది. ఈ మౌండ్స్‌ ఒక్కో దాని ఎత్తు దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది. కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి ఈ గ్రహంపై వస్తున్న మార్పులు, చర్యల వల్లే ఈ దిబ్బలు ఏర్పడ్డాయని తేలింది. * ఒకప్పుడు నీరు ఉండేది, అది క్రమంగా ఎండిపోయి బిలాలుగా ఏర్పడ్డాయి. గ్రహంపై వచ్చిన మార్పుల వల్ల వీటి పైభాగంలో రాతి అవక్షేపాలు పొరలు పొరలుగా ఏర్పడి దిబ్బలుగా రూపొందాయని తేల్చారు. దీంతో ఇక్కడ ఇదివరకు నీటి జాడలుండేవనే సంగతీ తెలిసింది.

* మరి మన భూమిమీదా ఇంత పెద్ద దిబ్బలు ఏర్పడాలిగా అనే అనుమానం వస్తుంది. కానీ భూమి ఖండాలుగా ఉంటుంది. ఈ ఖండాలు కదులుతుండడం వల్ల ఇంత ఎత్తయిన దిబ్బలు ఏర్పడవు, అంగారకుడిపై ఖండచలనాలు ఉండవు కాబట్టి దిబ్బలు పెరుగుతూ వచ్చాయి.

* టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల పరిశోధన ఈ గుట్టు విప్పింది. వారేం చేశారంటే... 30 సెంటీమీటర్ల వెడల్పు, నాలుగు సెంటీమీటర్ల ఎత్తున్న సూక్ష్మ నమూనా బిలాల్ని తయారుచేశారు. అందులో ఇసుకను నింపారు. దాన్ని గాలి సొరంగంలో ఉంచారు. అప్పుడు గాలి తీవ్రతకు బిలంలోని ఇసుక ఎంత ఎత్తుకు వెళుతోంది, ఇసుక కదలికలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. ఇసుక కదలికల్లో వచ్చిన మార్పులతో కంప్యూటర్‌ నమూనాల్ని తయారుచేశారు. ప్రయోగంలో ఇసుకతో ఏర్పడ్డ అర్ధచంద్రాకారం దిబ్బలు అచ్చంగా అంగారకుడిపై ఇసుక దిబ్బల తరహాలోనే ఏర్పడ్డాయని రుజువైంది.

 

 


మీకు తెలుసా?

* అంగారకుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం భూమి.
* మార్స్‌ సూర్యుడి నుంచి నాలుగో స్థానంలో ఉంటుంది.
* ఉపరితలం ఐరన్‌ ఆక్సైడ్‌తో ఉండటం వల్ల ఎర్రగా ఉంటుంది.
* రోమన్ల యుద్ధ దేవుడి పేరు మీదుగా మార్స్‌ అనే పేరు వచ్చింది.
* ఈ కుజ గ్రహానికి ఫోబోస్‌, డీమోస్‌ అనే రెండు చందమామలుంటాయి.
* సౌర కుటుంబంలో అతిపెద్ద అగ్నిపర్వతం ఒలింపస్‌ మాన్స్‌ ఈ గ్రహంపైనే ఉంటుంది. ఎత్తు దాదాపు 25 కిలోమీటర్లు. అతి పెద్ద లోయ కూడా ఇక్కడే ఉంటుంది. పేరు మారినర్‌ వ్యాలీ. పొడవు 4 వేల కిలోమీటర్లు, లోతు ఏడు కిలోమీటర్లు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని