కదిలే ద్వీపం.. ఎంతో అద్భుతం!

అదో ద్వీపం... చాలా చిన్నగా ఉంటుంది... కానీ దాని ప్రత్యేకత ఏంటో తెలుసా? అటూ ఇటూ కదలడం... వింతగా ఉందా?అయితే ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్లండి మరి! తేలియాడే వూర్ల గురించి వినుంటారు. కానీ కదిలే ద్వీపం గురించి విన్నారా? పేరు ‘షిరోమోనికూగ్‌ ఐలాండ్‌’. చూడాలంటే నెదర్లాండ్స్‌కి వెళ్లాలి.

Published : 13 Dec 2016 01:09 IST

కదిలే ద్వీపం.. ఎంతో అద్భుతం!

అదో ద్వీపం... చాలా చిన్నగా ఉంటుంది... కానీ దాని ప్రత్యేకత ఏంటో తెలుసా? అటూ ఇటూ కదలడం... వింతగా ఉందా?అయితే ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్లండి మరి!
తేలియాడే వూర్ల గురించి వినుంటారు. కానీ కదిలే ద్వీపం గురించి విన్నారా? పేరు ‘షిరోమోనికూగ్‌ ఐలాండ్‌’. చూడాలంటే నెదర్లాండ్స్‌కి వెళ్లాలి.
* ఇక్కడి ఫ్రైస్‌ల్యాండ్‌ ప్రావిన్స్‌లో ఉన్న ఈ ద్వీప విస్తీర్ణం చాలా తక్కువ. పదహారు కిలోమీటర్ల పొడవు నాలుగు కిలోమీటర్ల వెడల్పు ఉంటుందంతే. కానీ దీన్ని చూడ్డానికి ఏటా మూడు లక్షల మందికిపైగా వస్తుంటారు.
* ఇంతకీ దీని గొప్పేంటి అంటే... ఈ బుల్లి ద్వీపం నీటిలో దక్షిణం నుంచి తూర్పుకు, తూర్పు నుంచి దక్షిణానికి అటూ ఇటూ కదులుతూ ఉండటం. అదేంటి భూమి ఎక్కడైనా కదులుతుందా? అని ఆశ్చర్యపోకండి. నిజానికి ఈ ద్వీప భూభాగమేమీ కదలదు కానీ తీవ్రమైన గాలులు, సముద్రపు పోట్ల వల్ల ఈ ద్వీపం ఒకవైపు కొంచెం మూసుకుపోతూ ఉంటుంది. మరో వైపు భూభాగం బయటపడుతుంది. దీంతో ఈ ద్వీపమే కదిలినట్టు అనిపిస్తుంది. అంతేకాదు దీనివల్ల ఇది రోజుకో రూపంలో మారుతూ ఉంటుంది.
* 762 సంవత్సరాల క్రితం ఈ ద్వీపం ఇప్పుడున్నట్టు కాకుండా దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ఉత్తరం వైపు ఉండేదిట. ఏటా సగటున ఈ ద్వీప స్వరూపంలో 2.62 మీటర్ల తేడా కనిపిస్తుంది.


* ఇందులో ఓ బుల్లి వూరు కూడా ఉంది. దాని పేరు కూడా షిరోమోనికూగ్‌. ఈ గ్రామంలో వెయ్యి మంది వరకు నివసిస్తుంటారు. ఇక్కడి ప్రజలు కారు కొనాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిందే. మొత్తం 200 మందికి కార్లున్నాయి. ఇక్కడ తక్కువ జనాభానే ఉన్నప్పటికీ ఈ వూరు గ్రామపంచాయితీ కాకుండా మున్సిపాలిటీనే.
* ఈ వింత ద్వీపాన్నే నెదర్లాండ్స్‌ మొదటి జాతీయ పార్కుగా చెబుతారు.
* ఇక్కడ అప్పట్లో సన్యాసులు ఉండేవారట. షిరో అంటే బూడిద అని, మోనిక్‌ అంటే సన్యాసులు, వూగ్‌ అంటే ద్వీపం అని అర్థం. అందుకే బూడిదరంగు సన్యాసుల ద్వీపం అని పిలుస్తారు.
* పర్యటకుల కోసం ప్రత్యేకంగా వసతి గృహాలూ, ఇతర సౌకర్యాలూ ఉంటాయిక్కడ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని