గాజుపై మోజు పెంచే మ్యూజియమిది!

అంతా గాజుమయం... భవంతి దగ్గర్నించి లోపలున్న వస్తువుల వరకు... అంతేకాదు... అందులో గాజు గ్రంథాలయం కూడా ఉంది... ఇంతకీ ఇవన్నీ దేని గురించి? మ్యూజియాల్లో పురాతన వస్తువుల్ని మనం తాకకుండా, అవి మనకు కనిపించేలా ఉండటానికి గాజు అద్దాల వెనుక ఉంచుతారు.

Published : 22 Dec 2016 01:17 IST

గాజుపై మోజు పెంచే మ్యూజియమిది!

అంతా గాజుమయం... భవంతి దగ్గర్నించి లోపలున్న వస్తువుల వరకు... అంతేకాదు... అందులో గాజు గ్రంథాలయం కూడా ఉంది... ఇంతకీ ఇవన్నీ దేని గురించి?

మ్యూజియాల్లో పురాతన వస్తువుల్ని మనం తాకకుండా, అవి మనకు కనిపించేలా ఉండటానికి గాజు అద్దాల వెనుక ఉంచుతారు. కానీ ఆ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన వస్తువులు కూడా గాజువే. ఎప్పుడో వేల ఏళ్లనాటి గాజు కళాఖండాల దగ్గర్నించి ఇప్పటి గాజు అలంకరణ సామగ్రి వరకు కనిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పూర్తిగా గాజు థీమ్‌తో ఉన్న ప్రదర్శన శాల ఇది.


* పేరు ‘కార్నింగ్‌ మ్యూజియం ఆఫ్‌ గ్లాస్‌’. అమెరికా న్యూయార్క్‌లోని కార్నింగ్‌లో ఉందిది.
* ఎటు చూసినా గాజు వస్తువులతో మెరిసిపోయే ఈ మ్యూజియంలో 35 శతాబ్దాల నాటి రకరకాల గాజు వస్తువుల్ని చూడొచ్చు. అంటే 3,500 ఏళ్ల క్రితం మానవుడు వాడిన గాజు గిన్నెలు, చెంబులు, దుస్తులు, బొమ్మలు, నిలువెత్తు శిల్పాలు, వేలాడే బల్బులు, పెట్టెలు, పనిముట్లు వంటివెన్నో దర్శనమిస్తాయి. ఇవన్నీ 45 వేలకు పైనే ఉంటాయి.
* ఈజిప్టు నాగరికత కాలానికి చెందిన గాజు పరికరాలూ కనిపిస్తాయి. అప్పట్లో గాజు తయారీకి ఉపయోగించే కొలిమి, వాడిన ఉపకరణాల వంటివీ ప్రదర్శనలో ఉంచారు.
* ఈ మ్యూజియాన్ని 1951లో థామస్‌.ఎస్‌.బుచ్నెర్‌ అనే ఆయన గాజు ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలపడానికి ఏర్పాటు చేశారు.
* ఇందులో ప్రత్యేకంగా ఉన్న గాజు గ్రంథాలయంలో లక్షలాది పుస్తకాలు ఉంటాయి. అంటే ఇవన్నీ గాజు చరిత్రకు సంబంధించినవే అన్నమాట.
* ఇంకా గ్లాస్‌ మేకింగ్‌, హాట్‌ గ్లాస్‌ షో వంటి ఇతర విభాగాలూ ఉంటాయి. వీటిల్లో గాజు తయారీ చూపిస్తారు. మనమూ ఇందులో పాల్గొని ఎంచక్కా గాజుతో బొమ్మలు చేసుకోవచ్చు. ఏటా చలికాలంలో మేక్‌ యువర్‌ ఓన్‌ గ్లాస్‌ స్నోమ్యాన్‌ పేరిట ప్రత్యేక శిబిరం నిర్వహిస్తుంటారు. శిక్షణ కూడా ఇస్తారు.


* ఇక్కడ ప్రపంచ దేశాలకు చెందిన గాజు వస్తువులతో గాజు మార్కెట్‌ ఉంటుంది. ఇందులో వేలాది రకాల విభిన్నమైన గాజు వస్తువులు దొరుకుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని