logo

ఆయన ‘చె’ప్పింది ‘వి’నాల్సిందే

చంద్రగిరి దుర్గానికి చెందిన కీలక వైకాపా నేత దౌర్జన్యాలు, దోపిడీలకు అంతే లేదు. నుదుటిపై బొట్టుతో నవ్వుతూ గంగి గోవులా కనిపించే ఈ నేతను చూస్తే  నియోజకవర్గ ప్రజలు వణికిపోయే పరిస్థితికి వచ్చారు.

Updated : 27 Apr 2024 06:48 IST

చంద్రగిరి దుర్గంలో కీలక వైకాపా నేత ప్రైవేటు రాజ్యాంగం
బెదిరించి భూములు లాక్కోవడమే నైజం
ఈనాడు - తిరుపతి

చంద్రగిరి దుర్గానికి చెందిన కీలక వైకాపా నేత దౌర్జన్యాలు, దోపిడీలకు అంతే లేదు. నుదుటిపై బొట్టుతో నవ్వుతూ గంగి గోవులా కనిపించే ఈ నేతను చూస్తే  నియోజకవర్గ ప్రజలు వణికిపోయే పరిస్థితికి వచ్చారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఆయన కన్ను పడిన భూమిని నయానోభయానో సొంతం చేసుకుంటున్నారు. ఇందుకోసం విపక్షమైనా, స్వపక్షమైనా వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు.

  • తన భూమి కబ్జాకు గురైందని ఓ మహిళ చంద్రగిరి నియోజకవర్గంలో ఓ కీలక నేత దృష్టికి తీసుకెళ్లగా.. తన కుడిభుజమైన ఓ సర్పంచి వద్దకు వెళ్లాలని సూచించారు. సర్పంచి వద్ద కబ్జాదారులు ఉండటాన్ని చూసిన ఆమె నిర్ఘాంతపోయింది. ఇదే విషయాన్ని సదరు నేతకు చెప్పగా ఎన్నికల్లో సర్పంచి ఎంతో మేలు చేశాడని, ఆ భూమి వ్యవహారం మర్చిపోవాలని అనడంతో ఆమె ఆశలు వదులుకున్నారు.
  • వైకాపా తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఓ మహిళ నుంచి 250 అంకణాల భూమి లాక్కున్న ఈ నేత దాన్ని తన కార్యాలయంలో పనిచేసే మహిళ, అనుచరుల పేరిట బలవంతంగా రాయించుకున్నారు.
  • హైదరాబాద్‌లో ఉండే కొందరికి చంద్రగిరి నియోజకవర్గంలో 60 ఎకరాల వరకు భూములున్నాయి. వీటి విలువ పెరుగుతోందని గ్రహించిన ఈ నేత వారిని బెదిరించి ఎకరాకు కేవలం రూ.3 లక్షలు చొప్పున ఇచ్చి లాగేసుకున్నారు.
  • ఎంపీటీసీ మాజీ సభ్యురాలొకరు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ఆమెకు వైకాపాకు చెందిన కీలక ప్రజాప్రతినిధి ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో అనుచరుడితో ఫోన్‌ చేయించి మాట్లాడారు. మళ్లీ పార్టీలోకి రావాలని, లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడతావంటూ బెదిరించారు.

భూ ఆక్రమణలకు పక్కా ప్రణాళిక

ఈ నేత భూముల కబ్జాకు అనుచరులతో పాటు కుటుంబ సభ్యులను వాడుకుంటున్నారు. ముందుగా ఎక్కడెక్కడ అనుకూలమైన భూములు ఉన్నాయనే విషయాన్ని గుర్తిస్తున్నారు. ఆపై వాటి యజమానుల వివరాలు తెలుసుకుని వారిని తిరుపతిలోని తమ కార్యాలయానికి పిలిపిస్తారు. భూమి రాసి ఇవ్వాలని సున్నితంగా అడుగుతారు. ససేమిరా అంటే బెదిరిస్తారు. చెప్పినట్లు చేస్తే ఎంతో కొంత చేతుల్లో పెడతామని.. లేకుంటే బలవంతంగానైనా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటామని హెచ్చరిస్తారు. చేసేది లేక అనేకమంది రాసిచ్చేస్తున్నారు. వినకుంటే దాడులకు తెగబడుతున్నారు. ఇలా రూ.వందల కోట్ల విలువైన భూములు సొంతం చేసుకున్నారు.

పిలుపొచ్చిందా వామ్మో..  

ఆలూమగల పంచాయితీ మొదలు కుటుంబ కలహాలు, భూ దందాల వరకు అన్ని సెటిల్‌మెంట్లు తిరుపతి కార్యాలయంలోనే నెరపుతున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే హెచ్చరిస్తుంటారు. దేవుడి పేరు పెట్టుకున్న కార్యాలయంలో ఇవేం కార్యకలాపాలు అంటూ బాధితులు వాపోతున్నారు. అధికారులు ఎవరైనా సరే అక్కడికి రావాల్సిందే. దీంతో ఆ కార్యాలయం నుంచి పిలుపు వచ్చిందంటే తప్పనిసరిగా తమ భూమో, డబ్బులకో ఎసరు వచ్చినట్లేనని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మాజీ ప్రజాప్రతినిధికే చుక్కలు

జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యేకి తిరుపతికి ఆనుకుని ఏడు ఎకరాల వరకు కుటుంబ సభ్యుల పేరుతో పట్టా భూమి ఉంది. దీనికి మ్యుటేషన్‌ చేయించుకునేందుకు ఆయన నియోజకవర్గ ప్రజాప్రతినిధిని మాట సాయం అడిగారు. రూ.5 కోట్లు ఇస్తే చేయిస్తాననడంతో అవాక్కయ్యారు. భూమి విలువ ఎకరా రూ.10 కోట్లకు పైగా ఉండటంతో అడిగినంత ఇచ్చేందుకు సిద్ధం కాగా మరో మెలిక పెట్టారు. నగదు వద్దని, ప్రధాన రహదారికి ఆనుకుని ఎకరా భూమి రాసివ్వాలని కీలక నేత అనడంతో ఆయన మ్యుటేషన్‌ చేయించుకోవడాన్ని పక్కనబెట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చాక చేయించుకుంటానని తన సన్నిహితుల వద్ద వెల్లడించాడంటే ఈయన దుశ్చర్య ఏ స్థాయికి చేరిందో చెప్పనలవి కాదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని