గల్లంతయ్యే గజిబిజి పజిల్‌!

కొండాకోనలు దాటుకుంటూ...అడ్డంకులు అధిగమిస్తూ...దారుల్ని గుర్తుపడుతూ...ముందుకు సాగాలి...ఇవన్నీ స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఆట విషయాలు కాదు...నిజమైన అడవిలోని ఓ పజిల్‌ సంగతులు!

Published : 11 Jan 2017 01:14 IST

గల్లంతయ్యే గజిబిజి పజిల్‌!

కొండాకోనలు దాటుకుంటూ...అడ్డంకులు అధిగమిస్తూ...దారుల్ని గుర్తుపడుతూ...ముందుకు సాగాలి...ఇవన్నీ స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఆట విషయాలు కాదు...నిజమైన అడవిలోని ఓ పజిల్‌ సంగతులు!

చిక్కుదారుల్లో దారి కనుక్కుంటూ పజిల్ని పూర్తి చేయడమంటే మనకెంతో ఇష్టం. మరి ఇలాంటి పజిల్ని కాగితంపైనో, ఫోన్లోని ఆటల్లోనో కాకుండా నిజంగానే చేస్తే? అబ్బ ఇంకెంత సరదా కదా. దట్టమైన అడవిలో ఇలాంటి గమ్మత్తయిన పజిల్‌ ఒకటుంది. పేరు పజిల్‌వుడ్‌. 

* చూడాలంటే ఇంగ్లండ్‌లోని కోలోఫోర్డ్‌ దగ్గర్లో ఉన్న డీన్‌ అడవికి వెళ్లాల్సిందే.

* ఈ అడవిలోనే ఉంటుందీ పజిల్‌వుడ్‌.

* ఇందులో నడుస్తున్న కొద్దీ వింత వింత రూపాల్లో పెద్ద రాళ్లు, ఎత్తయిన చెట్లు, పచ్చికతో కప్పి ఉన్న రాతిబండలు, రహస్య గుహలు కనపడుతుంటాయి. పోతూ ఉంటే గజిబిజిగా బోలెడు దారులతో ఉంటుంది. వేలాడే వంతెనలు, చిత్రమైన చెట్ల వేరులు దర్శనమిస్తాయి. ఎటు వెళితే ఏ దారి వస్తుందో తెలియక అయోమయంగా ఉంటుంది. తప్పిపోతామేమో అనే భయం కూడా వస్తుంది. సరైన దారిని కనుక్కుంటూ ముందుకు వెళ్లాలి.

* మొత్తం 14 ఎకరాల్లో ఉండే ఈ అడవిలో ఈ పజిల్‌ దారి కిలోమీటరున్నర పొడవుంటుంది.

* చిన్నాపెద్దా తేడాలేకుండా చెట్ల మధ్య దాగున్న ఈ పజిల్‌వుడ్‌ని పూర్తి చేయడానికి బోలెడు మంది వస్తుంటారు.

* ఇక దీని చరిత్ర విషయానికి వస్తే... ఎప్పుడో రోమన్‌ కాలంలో ఈ ప్రాంతంలో ముడి ఇనుప ఖనిజ నిల్వలు ఉండేవి. వీటి తవ్వకాలతో ఏర్పడిన దారిని 1800లో ఒకాయన చిన్న చిన్న గజిబిజి దారులతో, వంతెనలతో పర్యటక ప్రాంతంగా మార్చాడు. ఇదే నెమ్మదిగా పజిల్‌వుడ్‌ అయ్యింది.

* ఇక్కడ ఓసారి మూడువేలకుపైన రోమన్‌ కాలపు నాణేలు మట్టి కూజాల్లో దొరికాయిట.

* ఈ పజిల్‌వుడ్‌ను ఎన్నో సినిమాల్లో, బీబీసీ టీవీ ప్రదర్శనల్లో చిత్రీకరించారు.

* సందర్శకుల్ని మరింత ఆకట్టుకోవడానికి ఇక్కడ రకరకాల జంతువుల్ని కూడా ఉంచారు. దుకాణాలు, రెస్టారెంట్లూ ఉన్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని