Vijay Mallya: విజయ్‌ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్‌ విజ్ఞప్తి

విజయ్‌ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్‌ను ఈ మేరకు అభ్యర్థించింది. 

Updated : 26 Apr 2024 11:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్‌ విజయ్‌ మాల్యా(Vijay Mallya)పై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. ఐరోపాలో అతడి కదలికలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఈ నెల మొదట్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన భారత్‌-ఫ్రాన్స్‌ జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ‘‘ఈ సమావేశంలో ఫ్రాన్స్‌ కొన్ని ముందస్తు షరతులతో అతడిని అప్పగించే అంశాన్ని ప్రతిపాదించగా.. భారత్‌ మాత్రం బేషరతుగా మాల్యా అప్పగింత జరగాలని కోరింది’’ అని ఓ ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది. 15వ తేదీన జరిగిన ఈ భేటీలో భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి కె.డి.దేవాల్‌, ఫ్రాన్స్‌ తరఫున ఓలివర్‌ కార్నో పాల్గొన్నారు. భారత ఇంటెలిజెన్స్‌, హోం డిపార్ట్‌మెంట్‌ అధికారులు దీనికి హాజరయ్యారు. వీరు మనీలాండరింగ్‌, ఉగ్ర ఫండింగ్‌ కేసులకు సంబంధించి పరస్పర సహకారంపై చర్చించారు.  

ప్రస్తుతం మాల్యా యూకేలో నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఆస్తులు కొనుగోలు చేసిన దేశాలకు వెళ్లనీయకుండా చేయాలని భారత్‌ నిర్ణయించింది. దీనిలో భాగంగా నేరస్థుల అప్పగింత ఒప్పందాలున్న దేశాలతో ఈ అంశంపై చర్చలు జరుపుతోంది. ఫ్రాన్స్‌తో భారత్‌కు ఇటువంటి ఒప్పందం ఉంది.

విజయ్‌ మాల్యా భారత్‌లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేశారు. ఈ కేసులో సీబీఐ ముంబయిలోని కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌ ప్రకారం లిక్కర్‌ కింగ్‌ విదేశాల్లో భారీగా ఆస్తులను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత భారత్‌ను వీడి అతడు పారిపోయినట్లు తెలిపింది. అతడు ఫ్రాన్స్‌లో 35 మిలియన్‌ యూరోలు వెచ్చించి స్థిరాస్తి కొనుగోలు చేశాడు. దీనికి తన ఆధీనంలోని కంపెనీ గిజ్‌మో హోల్డింగ్‌ నుంచి చెల్లింపులు జరిపినట్లు సీబీఐ పేర్కొంది. మరో వైపు ఫ్రాన్స్‌ ప్రభుత్వం రూ.14 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను ఇప్పటికే సీజ్‌ చేసింది. ఈడీ అభ్యర్థన మేరకు ఈ చర్యలు తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని