పుడుతూనే ఏడాది వయసు!

ఓ చిన్న దేశం... ఇక్కడ వింత లెక్కలున్నాయ్‌... భలే ఆహారపు అలవాట్లున్నాయ్‌... ఎంతో సాంకేతికతా ఉంది...

Published : 06 Jan 2018 02:08 IST

దక్షిణ కొరియా
పుడుతూనే ఏడాది వయసు! 

దేశం: దక్షిణ కొరియా
రాజధాని: సియోల్‌
జనాభా: 5,14,46,201
విస్తీర్ణం: 100,210చ.కిలోమీటర్లు
కరెన్సీ: సౌత్‌కొరియన్‌ ఓన్‌
అధికారిక భాష: కొరియన్‌
ఓ చిన్న దేశం... ఇక్కడ వింత లెక్కలున్నాయ్‌... భలే ఆహారపు అలవాట్లున్నాయ్‌... ఎంతో సాంకేతికతా ఉంది... ఇంతకీ ఎక్కడ? ఏమా సంగతులు?
ఆసియా ఖండం తూర్పు భాగంలో ఉన్న ద్వీపకల్ప దేశం దక్షిణ కొరియా. ఇది ఉత్తర కొరియాతో సరిహద్దుల్ని పంచుకుంటుంది.
* అత్యంత అభివృద్ధి చెందిన ప్రపంచ నగరాల్లో ఈ దేశ రాజధాని నగరం సియోల్‌ ఒకటి.
* ఇప్పుడు ఉన్న జనాభాలో 82శాతం మంది పట్టణాలు, నగరాల్లోనే జీవిస్తున్నారు.
* జేజు ఇక్కడ ఎత్తయిన పర్వతం. ఎంతుంటుందంటే 6,398 అడుగులు.
* ఇక్కడ పుట్టిన యువకులు 21 నుంచి 24 నెలలపాటు తప్పకుండా మిలటరీలో పనిచేయాల్సి ఉంటుంది.
* ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందడం ఇక్కడ గౌరవంగా, ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. వీరికి అత్యధిక వేతనమూ వస్తుంది.
* 4 అంకెను దురదృష్ట సంఖ్యగా భావిస్తారు. అందుకే చాలా భవనాల్లో నాలుగో అంతస్థును కట్టరు. పదమూడునూ అంతే.

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన బాన్‌కీమూన్‌ పుట్టింది ఈ దేశంలోనే.

* పిల్లలకు పేర్లు పెట్టడానికి చాలానే డిమాండ్‌ ఉంటుందిక్కడ. 60శాతం కుటుంబాల వారు నిపుణుల్ని సంప్రదించి మాత్రమే వారి పిల్లలకు పేర్లు పెడతారు. ఈ సేవలందించేందుకు అక్కడ కార్యాలయాలూ ఉంటాయిట.
* ఇక్కడ 20శాతం మంది పేర్ల చివర కిమ్‌ ఉంటుంది. లీ, పార్క్‌ అనే పేర్లూ ఎక్కువగా చివరన పెట్టుకుంటారు.
* వయసు లెక్కించడంలో ఇక్కడి పద్ధతి వేరు. పుట్టిన పిల్లలను ఏడాది వయసున్న వారిగా లెక్కిస్తారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వారి వయసును లెక్కిస్తారన్నమాట. అలాగే సంవత్సరం మారిపోతే వయసూ ఒక సంవత్సరం పెరిగిపోయినట్టు భావిస్తారు. అంటే డిసెంబర్‌లో పుట్టిన పాపాయికి జనవరి రాగానే రెండేళ్లు వచ్చేస్తాయన్నమాట.
* ఓటు వెయ్యాలంటే కచ్చితంగా 19ఏళ్లు వచ్చి ఉండాలి.
* శరీరంపై ఎవరైనా టాటూ వేయించుకోవాలంటే ఇక్కడ కచ్చితంగా వైద్యుడిచ్చిన ధ్రువ పత్రం ఉండాల్సిందే.
* జననాల రేటు ఇక్కడ చాలా తక్కువగా ఉంది. ప్రస్తుత లెక్కలు అలాగే కొనసాగితే 2750 సంవత్సరం నాటికి దక్షిణ కొరియన్ల సంఖ్య సున్నాకు చేరుకుంటుందట.

మేకప్‌ మ్యాన్స్‌!

* మేకప్‌ అంటే అది ఆడవాళ్లకు మాత్రమే పరిమితమైనదని అనుకుంటారు. కానీ ఈ దేశం సంగతి వేరు. ఇక్కడ పురుషులూ ఎక్కువగా మేకప్‌ని ఇష్టపడతారు. దీని కోసం దాదాపుగా ఏటా 900 మిలియన్‌ డాలర్లను ఖర్చుపెడతారు.
20శాతం మంది మగవాళ్లు రోజూ మేకప్‌ వాడతామని చెబుతున్నారట.
* ప్రపంచంలోనే ప్లాస్టిక్‌ సర్జరీలకు పెట్టింది పేరు ఈ దేశం. అందుకే దీన్ని ‘వరల్డ్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ’ అని పిలుస్తారు.
* ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు తప్పకుండా ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్న వారే ఉంటారట.
* అతి బరువు ఉన్న వారు ఇక్కడ కేవలం 3.2శాతం మందే. ఇలాంటి వారు అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో మొదటిది జపాన్‌కాగా తర్వాత దక్షిణ కొరియానే ఉంది.

జైలు పాలే!  

* ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు శత్రు దేశాల్లా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఇక్కడ ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌పై ఎవ్వరూ జాలి చూపించకూడదు. ఆయనకు అనుకూలంగా మాట్లాడకూడదు. అలాంటి బ్లాగులూ నడపకూడదు. ఈ నిబంధనల్ని లెక్కచేయకుండా ఆ పనిచేసిన వారిని జైల్లో పెడతారు.
* కొరియా 1948లో ఉత్తరకొరియా, దక్షిణ కొరియాగా విడిపోయింది. ఈ రెండు దేశాలకూ మధ్య విబేధాలతో 1950-1953 మధ్య కొరియా యుద్ధం వచ్చింది. అది ముగిశాక కూడా ఈ దేశాలు శత్రువులుగానే ఉంటున్నాయి.
* ఉత్తర కొరియా ఈ దేశానికి ఏమైనా బెదిరింపులు పంపించాలనుకుంటే ఫ్యాక్స్‌ ద్వారా దాన్ని చేరవేస్తుందట.
* ఈ దేశానికి అండగా నిలబడటానికి ఎప్పుడూ అమెరికా బలగాలు ఇక్కడ ఉంటాయి.

ఎక్స్‌ప్లోరర్‌ నుంచే.. 

* ఇక్కడ ఆన్‌లైన్‌ షాపింగ్‌, నెట్‌ బ్యాంకింగ్‌ వ్యవహారాల్ని కచ్చితంగా ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ నుంచే చెయ్యాలి. ఇందుకు వేరే ఏ బ్రౌజర్‌నీ ఉపయోగించకూడదు. దాన్నే వాడాలని ఇక్కడ చట్టమే ఉంది.
* ప్రపంచంలో వేగంగా ఇంటర్నెట్‌ వచ్చే దేశాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది.
* దాదాపుగా అన్ని చోట్లా ఉచిత వైఫై జోన్లుంటాయి.
* ప్రముఖ ఎలాక్ట్రానిక్స్‌ సంస్థ శామ్‌సంగ్‌ ఇక్కడిదే.

నాచు తినేస్తారు..

* ప్రపంచం మొత్తం వాడే సీవీడ్‌ అనే సముద్రపు నాచులో 90శాతం ఇక్కడే వినియోగిస్తారు. దీనితో చేసుకునే సీవీడ్‌ సూప్‌ వీరి సంప్రదాయ వంటకం. పుట్టిన రోజుల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో దీన్ని చేసుకుంటారు.
* ఆక్టోపస్‌లను ఎక్కువగా తింటారు.
* వరి, బార్లీ, దుంపల్ని ఎక్కువగా పండిస్తారు.
* ఎలక్ట్రానిక్స్‌, టెలీకమ్యునికేషన్స్‌కి సంబంధించిన పరికరాల తయారీ కోసం ఇక్కడ కుటీర పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని