నింగి సింగారం... రంగుల సోయగం!

ఆకాశంలో ఎప్పుడో ఓ సారి ఇంద్ర ధనుస్సు వస్తేనే మనం ఆనందంగా చూసేస్తాం. అప్పుడప్పుడూ పెళ్లిళ్లకో, వేడుకలకో లైటింగ్‌ పెడితేనే అక్కడంతా తిరిగి సంతోషపడిపోతాం. అవును. నిజంగానే వర్ణాలు మనల్ని.....

Published : 16 Feb 2018 02:15 IST

నింగి సింగారం... రంగుల సోయగం!

మిన్ను... రంగులద్దుకుంటుంది... చీకటి... వెలుగులు సంతరించుకుంటుంది... అందరినీ ఆశ్చర్యపరుస్తుంది... అసలు ఎక్కడ? ఏంటా వింత?
కాశంలో ఎప్పుడో ఓ సారి ఇంద్ర ధనుస్సు వస్తేనే మనం ఆనందంగా చూసేస్తాం. అప్పుడప్పుడూ పెళ్లిళ్లకో, వేడుకలకో లైటింగ్‌ పెడితేనే అక్కడంతా తిరిగి సంతోషపడిపోతాం. అవును. నిజంగానే వర్ణాలు మనల్ని అబ్బురపరుస్తాయి. మరేమో కొన్ని చోట్ల కొన్ని రాత్రిళ్లు భలేగా ఉంటాయ్‌! మధ్యరాత్రికొచ్చే సరికి ఆకాశం రంగులతో నిండిపోతుంది. ఆ మధ్యలో మినుకు మినుకుమంటూ నక్షత్రాలు మెరిసిపోతుంటాయి. ఆ వెలుగు జిలుగుల్లో చీకటి చిన్నబోతుంది. చూసిన కళ్లకు ‘ఆకాశం వేడుకలేమైనా చేసుకుంటోందేమో’ అనిపించేస్తుంది. ఈ వింత కొన్ని చోట్ల, కొన్ని సార్లు మాత్రమే కనిపిస్తుంది. ఒక ప్రత్యేకమైన వాతావరణ తీరు ఇది.

* ఇదెలా ఏర్పడుతుందంటే... గుండ్రంగా ఉన్న మన భూమికి పైనా, కిందా... ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఉంటాయి కదా. వాటి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. అక్కడ కొన్ని రోజులకోసారి ఓ రంగుల వృత్తం ఏర్పడుతుంది.
దీన్నే అరోరా, అరోరా ఓవల్‌, నార్త్రన్‌ లైట్స్‌, సౌత్రన్‌ లైట్స్‌, పోలార్‌ లైట్స్‌, అరోరా బోరైలీస్‌...లాంటి పేర్లతో పిలిచేస్తారు.

* ఈ అరోరా ఏర్పడినప్పుడు ధ్రువాల వైపున్న దేశాల్లో రాత్రిళ్లు ఆకాశం వెలుగులీనుతుంది. పచ్చ, నీలం, ఎరుపు, పసుపు, గులాబీ... ఇలా ఎన్నెన్నో వన్నెల్లో కనువిందు చేస్తుంది. దీంతో అక్కడకు బోలెడు మంది పర్యాటకులు రాత్రిళ్లు బస చేసేందుకు పయనమవుతారు.

* ఉత్తరాన ఆర్కిటిక్‌ వలయానికి దగ్గరగా ఉండే ప్రాంతాలు, దక్షిణాన అంటార్కిటికాకు దగ్గరగా ఉండే దేశాల ప్రాంతాల్లో ఈ చమక్కులు కనిపించేస్తాయి. కెనడా, అమెరికా, స్వీడన్‌, గ్రీన్‌లాండ్‌, రష్యా.. తదితర దేశాల్లో వీటిని చూడొచ్చు.

* ఇంతకీ ఈ అరోరా ఎందుకు ఏర్పడుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిందే. సూర్యుడి దగ్గర వాతావరణంలో ఛార్జ్‌ అయిన కణాలు భూవాతావరణం వైపు ప్రయాణిస్తాయి. మన ఉత్తర, దక్షిణ ధ్రువాల దగ్గర అయస్కాంత క్షేత్రాలుంటాయని చెప్పుకొన్నాం కదా. అక్కడ వాయు కణాలతో, సూర్యుని వైపు నుంచి వచ్చిన కణాలు ఒకదానికొకటి కలిసి చర్య జరుపుతాయి. దాని వల్లే ఈ రంగుల రింగులు ధ్రువాల దగ్గర చుట్టూ ఏర్పడతాయి.

* ఎక్కువగా సెప్టెంబరు, ఏప్రిల్‌ నెలల్లో ఈ తీరును చూడొచ్చు. అరుదుగా మిగిలిన నెలల్లోనూ కనువిందు చేస్తుంది.
* అంతరిక్షం నుంచి చూసినా భూమిపై ఈ రంగులు స్పష్టంగా కనిపించేస్తాయి.
* భూ వాతావరణంలో ఉన్న ఆక్సిజన్‌, నైట్రోజన్‌, వేరు వేరు వాయు కణాలు చర్యలు జరపడం వల్లే ఆకాశంలో ఇలా వేరువేరు వర్ణాలు ఏర్పడతాయట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని