చెట్టుగారి గది!

ఖైదీల్ని జైళ్లలో పెడతారని తెలుసు... చెట్లలో పెట్టేవారని తెలుసా...? ఎందుకంటే వాటిలో గదులుంటాయి కాబట్టి! కొన్ని చోట్ల అలాంటి చెట్లున్నాయి... పదండి వాటి విశేషాలేంటో చదివేద్దాం! పెద్ద చెట్టు... దానికి బంతిలాంటి కాండం... దానిలో ఓ గది... దానికి చిన్న ద్వారం... అచ్చంగా ఇంట్లోకి వెళ్లినట్టే ఉంటుంది.

Published : 24 May 2018 01:33 IST

చెట్టుగారి గది!

ఖైదీల్ని జైళ్లలో పెడతారని తెలుసు... చెట్లలో పెట్టేవారని తెలుసా...? ఎందుకంటే వాటిలో గదులుంటాయి కాబట్టి! కొన్ని చోట్ల అలాంటి చెట్లున్నాయి... పదండి వాటి విశేషాలేంటో చదివేద్దాం!
పెద్ద చెట్టు... దానికి బంతిలాంటి కాండం... దానిలో ఓ గది...  దానికి చిన్న ద్వారం... అచ్చంగా ఇంట్లోకి వెళ్లినట్టే ఉంటుంది. ఇలాంటి లక్షణాలతో భూమి మీద నిజంగానే చెట్లున్నాయి.
* ఇంతకీ వీటి పేరు ఏమిటంటే బెయోబాబ్‌ చెట్లు. వీటిల్లో కాండం లావుగా ఉంటుంది. చెట్టు పెద్దదయ్యే కొద్దీ అది ఉబ్బిపోయినట్లు గుండ్రంగా లోపల ఒక గదిలాంటి ఖాళీ ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. కొన్నింటికైతే లోపలికెళ్లేందుకు గుమ్మంలాంటిదీ సహజసిద్ధంగానే ఏర్పడుతుంది. కొన్నింటికైతే మనుషులే వాటిని ఏర్పాటు చేసేస్తుంటారు.
* దాంట్లో అవి బయటి నుంచి పీల్చుకున్న లీటర్ల లీటర్ల నీటిని దాచుకుంటాయి. అందుకనే వీటిని బాటిల్‌ ట్రీస్‌ అనీ పిలిచేస్తుంటారు.
* చెట్లే కాదు. ఏనుగుల్లాంటివీ లోపలికి తొండాన్ని చొప్పించి ఈ నీటిని తాగుతుంటాయిట. ఇంకా చిన్న చిన్న జీవులూ బయట నీరు దొరకనప్పుడు వీటిని ఉపయోగించుకుంటాయి.
* మామూలుగా అయితే ఈ బెయోబాబ్‌ చెట్లలో తొమ్మిది రకాల వరకూ ఉన్నాయి. వాటిలో ఆరు రకాలు మడగాస్కర్‌, రెండు ఆఫ్రికా, ఒకటి ఆస్ట్రేలియాలకు చెందినవి.

* ఆస్ట్రేలియాలో పందొమ్మిదో శతాబ్దంలో ఖైదీల్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి తీసుకెళ్లేప్పుడు రాత్రిళ్లు వీటి దగ్గరే ఆగేవారట. ఖైదీల్ని వీటి గదుల్లో బంధించేవారట. మళ్లీ ఉదయం లేచి వాళ్లను తీసుకుని ప్రయాణాలు కొనసాగించేవారట. అందుకే ఇక్కడ చెట్ల మానులకు గుమ్మాలు ఏర్పడ్డాయని అక్కడ కథలు కథలుగా చెప్పుకొంటుంటారు. వీటిని చూడ్డానికి వచ్చిన పర్యాటకులు ఈ మానులపై తమ పేర్లను చెక్కేస్తున్నారట. అందుకే ఇప్పుడు అక్కడున్న చెట్లకు ఫెన్సింగులు కట్టి వాటిని సంరక్షిస్తున్నారు.
* ఆస్ట్రేలియాతోపాటు, ఆఫ్రికా, మడగాస్కర్‌... లాంటిచోట్ల ఉన్న ఈ చెట్ల గదుల్ని ఇది వరకు జైళ్లు, పోస్టాఫీసులు, వినోదాల కోసం వాడేవారట.
* మనుషులే కాదు. బోలుగా ఉండే వీటి కాండం, కొమ్మలు పక్షులకూ ఆవాసాలు. గుడ్లగూబల్లాంటివి ఇందులో చక్కగా మకాం పెట్టేస్తాయి.
* ఈ పెద్ద చెట్టులో మనం పడుకునేంత ఖాళీ ఉంటుంది. పై భాగం ఎత్తయితే దాదాపు రెండంతస్తులు ఎంత ఎత్తు ఉంటుందో అంత!
* ఈ చెట్టు పండుపైన పొడిలాంటిది ఉంటుంది. దాన్ని కొందరు వంటల్లో వాడతారు. వీటి గింజల పైపొరను మత్తు పానీయాల్లో ఉపయోగిస్తారు.
* ఈ చెట్లు వందలాది ఏళ్లు బతుకుతాయి. వీటిల్లో అతి పెద్ద చెట్టుగా నమీబియాలో ఉన్న ఒక చెట్టును చెబుతారు. అది 12 వందల ఏళ్లకుపైగా బతికింది. మూడేళ్ల క్రితమే చనిపోయింది.
* చివరిగా ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పమంటారా? ఇలాంటి రకం చెట్టే మన హైదరాబాద్‌లోనూ ఒకటుంది. గోల్కొండలో ఉన్న దీన్ని ఇక్కడంతా బ్రహ్మమల్లిక అని పిలుస్తుంటారు. కుతుబ్‌షాహీ వంశస్థులు దీన్ని నాటారని చెబుతారు. కావాలంటే మీరూ వెళ్లి చూసిరండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని