ఏమో సార్‌.. నాకు కనిపించదు!

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా! నేనో అరుదైన ఎలుకను. ఇతర మూషికాల కన్నా కాస్త వేరు. నాకసలు చూపు ఉండదు. అయినా ఇబ్బంది పడను. ‘అయాం బ్లైండ్‌.. బట్‌ ట్రైన్డ్‌’ అన్నట్లు నా పనులు నేను చక్కగా చేసుకుంటాను

Updated : 14 Mar 2024 06:58 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా! నేనో అరుదైన ఎలుకను. ఇతర మూషికాల కన్నా కాస్త వేరు. నాకసలు చూపు ఉండదు. అయినా ఇబ్బంది పడను. ‘అయాం బ్లైండ్‌.. బట్‌ ట్రైన్డ్‌’ అన్నట్లు నా పనులు నేను చక్కగా చేసుకుంటాను. ఎంచక్కా.. నా బతుకు నేను బతుకుతాను. ఎలాగో.. ఏంటో.. తెలుసుకోవాలని ఉంది కదూ! అందుకే ఆ విశేషాలు మీతో చెప్పిపోదామనే ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చాను.

నా పేరు బ్లైండ్‌ మోల్‌ ర్యాట్‌.  సబ్‌టెర్రేనియన్‌ మోల్‌ ర్యాట్‌ అని కూడా పిలుస్తుంటారు. నేను ఎక్కువగా తూర్పు ఐరోపా, పశ్చిమ, మధ్య ఆసియాల్లో కనిపిస్తుంటాను. మాకసలు ఏమీ కనిపించదు. ఎందుకంటే.. మా కళ్లు చాలా చిన్నగా పూర్తిగా చర్మపు పొరతో ఉంటాయి. మా శరీరం మెత్తగా దాదాపు దూది పింజలా ఉంటుంది.

 కలుగుల్లో బతికేస్తాం..

  ఎక్కువగా కలుగులు, బొరియల్లో బతికేస్తాం. మా కాళ్లు కూడా బలహీనంగా ఉంటాయి. అందుకే వీటితో మేం మట్టిని తవ్వలేం. మా పళ్లు మాత్రం పొడవుగా, బలంగా ఉంటాయి. ఎంచక్కా వీటితోనే మేం నేలను తవ్వుతుంటాం. ఇలా తవ్విన మట్టిని మాత్రం కాళ్లతో వెనక్కు నెడతాం. ఇలానే మేం.. నేలకు 10 నుంచి 25 సెంటీమీటర్ల లోతున సొరంగాలను ఏర్పాటు చేసుకుంటాం.

చెవులు కూడా...

మాకు కళ్లే కాదు.. చెవులు కూడా ఉండవు. మరో విషయం ఏంటంటే నా తోక కూడా చాలా చిన్నగా, ఉండీ లేనట్లుగా ఉంటుంది. మా శరీరమేమో స్థూపాకారంలో ఉండి, మెత్తటి బొచ్చు కలిగి ఉంటుంది. మేం 13 నుంచి 35 సెంటీమీటర్ల వరకు పెరుగుతాం. ఇక బరువేమో 100 నుంచి 570 గ్రాముల వరకు తూగుతాం. మేం ప్రధానంగా దుంపలను ఆహారంగా తీసుకుంటాం. అప్పుడప్పుడు విత్తనాలు, ఆకులు, లేత కొమ్మలు, కాండాలతోనూ మా బుజ్జి బొజ్జ నింపుకుంటాం.

గొప్ప ఇంజినీర్లం..!

మాకు కళ్లు లేకపోయినా.. మేం గొప్ప ఇంజినీర్లం. ఎందుకంటే.. మా కలుగులన్నీ ఒకదానికొకటి చక్కగా అనుసంధానమై ఉంటాయి. మళ్లీ వీటిలో ఆహార నిల్వ, విసర్జన కోసం వేరుగా గదులూ నిర్మించుకుంటాం. అన్నట్లు మాకు ప్రత్యేకంగా పడక గదులూ ఉంటాయి తెలుసా. మరో విషయం ఏంటంటే మేం కొన్ని వందల, వేల సంవత్సరాల పూర్వం నుంచీ ఈ భూమి మీద జీవిస్తున్నాం. ఎందుకంటే అప్పటికాలం నాటి మా శిలాజాలూ మీ శాస్త్రవేత్తలకు దొరికాయి మరి. సరే నేస్తాలూ.. ఇక ఉంటామరి.. బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని