చక్రాల చిరుత... అద్భుత ఘనత!

హాయ్‌ నేస్తాలూ..! ఈ చిచ్చరపిడుగు స్కేటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. రింక్‌లో అడుగుపెడితే చాలు పతకాలు సొంతం చేసుకుంటున్నాడు. చిరుప్రాయంలోనే దూసుకుపోతున్న ఈ చిరుత గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా!

Updated : 14 Apr 2024 00:48 IST

హాయ్‌ నేస్తాలూ..! ఈ చిచ్చరపిడుగు స్కేటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. రింక్‌లో అడుగుపెడితే చాలు పతకాలు సొంతం చేసుకుంటున్నాడు. చిరుప్రాయంలోనే దూసుకుపోతున్న ఈ చిరుత గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా! అయితే ఇంకెందుకాలస్యం.. ఈ కథనం చదివేయండి.

వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మోక్షజ్ఞకు తొమ్మిది సంవత్సరాలు. ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు. ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అన్నట్లుగా ఈ చిచ్చరపిడుగు చిన్ననాటి నుంచే చదువుతో పాటు స్కేటింగ్‌లో దూసుకుపోతున్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సొంతం చేసుకుంటున్నాడు. తండ్రి లక్ష్మీనారాయణది ప్రైవేటు ఉద్యోగం. తల్లి అనూష గృహిణి.

పట్టువదలక..

చిన్న వయసులోనే మోక్షజ్ఞ వివిధ క్రీడల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించేవాడు. బుడతడి ప్రతిభను గుర్తించిన తండ్రి మరింతగా ప్రోత్సహించాడు. తల్లిదండ్రుల కలను సాకారం చేసేందుకు స్కేటింగ్‌లో ఏకాగ్రతతో పట్టువదలని విక్రమార్కుడిలా సాధన చేస్తున్నాడు. గత ఏడాది మేలో శిక్షణ ప్రారంభించాడు. అలా ఆరంభించిన కొద్ది రోజుల్లోనే జిల్లా స్థాయి పోటీలకు అవకాశం లభించింది. దీంతో గత ఏడాది మేలో జరిగిన అండర్‌-8 జిల్లా స్థాయి స్పీడ్‌ స్కేటింగ్‌ పోటీల్లో ఇన్‌లైన్‌లో మొదటి స్థానంలో మెరిశాడు. జూన్‌లో గుంటూరు, తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి స్పీడ్‌ స్కేటింగ్‌ 150 మీటర్లు, 450 మీటర్లలో రెండు బంగారు, ఒక రజత పతకం సొంతం చేసుకున్నాడు. అలా స్కేటింగ్‌లో రాటుదేలి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది జనవరిలో గోవాలో జరిగిన జాతీయ స్థాయి అండర్‌-10 స్కేటింగ్‌ పోటీల్లో రిలే, ప్రొ ఇన్‌లైన్‌లో రెండు రజత పతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో మోక్షజ్ఞ అంతర్జాతీయ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించాడు.

పడి లేచిన కెరటంలా..  

గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీల్లో మోక్షజ్ఞ స్కేట్‌షూస్‌ జారి కిందపడిపోయాడు. ఆ సమయంలో తోటి స్కేటర్ల సాయం అందకపోయినా.. చింతించలేదు. ఎలాగోలా రేస్‌ పూర్తి చేసి.. చివరికి రజత పతకాన్ని పొందాడు. ‘క్రీడలు దేహదారుఢ్యానికి దోహదపడతాయి. మెదడు చురుగ్గా పనిచేసేలా అవి ప్రేరేపిస్తాయి. అందుకే మా కుమారుణ్ని ప్రోత్సహిస్తున్నాం’ అని మోక్షజ్ఞ నాన్న అంటున్నారు. ఈ బుడతడు రింక్‌ అందుబాటులో లేకపోయినా, స్కేటింగ్‌పైన ఆసక్తితో రోడ్డుపైనే సాధన చేస్తున్నాడు. క్రికెట్‌లోనూ రాణిస్తున్నాడు. గత ఏడాది డిసెంబరులో పాఠశాలలో నిర్వహించిన లాంగ్‌జంప్‌, 30 మీటర్ల రన్నింగ్‌రేస్‌, డాడ్జ్‌ బాల్‌, పిక్‌ బాల్‌, చేతిరాత పోటీల్లో పాల్గొని బహుమతులు సొంతం చేసుకున్నాడు. ఎంతైనా మోక్షజ్ఞ గ్రేట్‌ కదూ! తను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనమూ మనసారా కోరుకుందామా!

వేల్పూరి వీరగంగాధర శర్మ, ఈనాడు డిజిటల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని