ఆర్యన్‌కు లెక్కలు ఓ లెక్కా!

హాయ్‌ నేస్తాలూ..! మనం స్కూల్లో ఇచ్చిన హోంవర్క్‌ అంతా బాగానే చేసినా..గణితం అంటే మాత్రం అమ్మో.. అనేస్తాం. సులభంగా ఉన్నా కూడా కొన్నిసార్లు భారంగా చూస్తాం. అంతే కదా! కానీ మనలాంటి ఓ చిన్నారి అలవోకగా లెక్కలు చేసేస్తూ.. హ్యూమన్‌ కాలిక్యులేటర్‌ అనిపించుకున్నాడు.

Published : 23 Apr 2024 00:34 IST

హాయ్‌ నేస్తాలూ..! మనం స్కూల్లో ఇచ్చిన హోంవర్క్‌ అంతా బాగానే చేసినా..గణితం అంటే మాత్రం అమ్మో.. అనేస్తాం. సులభంగా ఉన్నా కూడా కొన్నిసార్లు భారంగా చూస్తాం. అంతే కదా! కానీ మనలాంటి ఓ చిన్నారి అలవోకగా లెక్కలు చేసేస్తూ.. హ్యూమన్‌ కాలిక్యులేటర్‌ అనిపించుకున్నాడు. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

హారాష్ట్రకు చెందిన ఆర్యన్‌ శుక్లకు పదమూడు సంవత్సరాలు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సాధారణంగా చాలామంది పిల్లలు గణితం అనగానే భయపడిపోతారు. ఆ భయం వల్ల సులభంగా ఉన్నవి కూడా వారికి కష్టంగా కనిపిస్తాయి. ఆర్యన్‌ మాత్రం సాధన చేస్తే.. గణితం చాలా సులభంగా ఉంటుందని చెబుతున్నాడు. 50 అయిదంకెల సంఖ్యలను కేవలం 25.19 సెకన్లలోనే జమచేసి (కూడిక) అందరినీ అబ్బురపరిచాడు. అంటే.. అర సెకనుకు ఒక సంఖ్యను జమ చేశాడన్నమాట. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ! తన ప్రతిభతో ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో కూడా స్థానం సంపాదించాడు.

సాధనతోనే..!

ఆర్యన్‌ ఆరేళ్ల వయసున్నప్పటి నుంచి మెంటల్‌ మ్యాథ్స్‌ నేర్చుకోవడం ప్రారంభించాడట. ఆ తర్వాత మెల్లగా కష్టమైన లెక్కలు ప్రాక్టీస్‌ చేశాడట. తనే సొంతంగా ప్రశ్నలు రాసుకొని.. సమాధానాలు రాసుకునేవాడట. అలా ఎక్కువగా.. సాధన చేయడానికే సమయం కేటాయించేవాడట. 2022లో జర్మనీలో ‘గ్లోబల్‌ మెంటల్‌ కాలిక్యులేటర్స్‌ అసోసియేషన్‌’ వారు నిర్వహించిన పోటీలో పాల్గొని మెంటల్‌ కాలిక్యులేషన్‌లో వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకున్నాడు. అతిచిన్న వయసులోనే వరల్డ్‌ ఛాంపియన్‌గా ఎదిగాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తన సత్తా చాటుకున్నాడు. మరో విషయం ఏంటంటే.. తనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమట. అలాగే క్రికెట్‌, ఫుట్‌బాల్‌ అంటే కూడా ఎక్కువ ఆసక్తి చూపుతాడట. కాస్త ఖాళీ సమయం దొరికితే క్రికెట్‌ ఆడుతుంటాడట. ఎంతైనా ఆర్యన్‌ చాలా గ్రేట్‌ కదూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని