మంచు నక్క.. పెంచుకోవచ్చు ఎంచక్కా..!

హాయ్‌ నేస్తాలూ.. ఎలా ఉన్నారు.. నేను అయితే చాలా బాగున్నా.. ఇంతకీ నేనెవరో మీకు తెలియదు కదూ.. నేను నక్కను.. ‘అడవుల్లో ఉండే నక్క.. అందరికీ తెలిసిన జంతువే కదా?’ అని అనుకోకండి

Updated : 16 Sep 2023 07:04 IST

హాయ్‌ నేస్తాలూ.. ఎలా ఉన్నారు.. నేను అయితే చాలా బాగున్నా.. ఇంతకీ నేనెవరో మీకు తెలియదు కదూ.. నేను నక్కను.. ‘అడవుల్లో ఉండే నక్క.. అందరికీ తెలిసిన జంతువే కదా?’ అని అనుకోకండి.. నేనో ప్రత్యేకమైన జీవిని. అందుకే ఆ విశేషాలు చెప్పి వెళ్దామనే ఈరోజు ఇలా మీ పేజీలోకి వచ్చానన్నమాట. ఇంకెందుకాలస్యం చకచకా నా గురించి తెలుసుకోండి మరి..!

నా పేరు ఆర్కిటిక్‌ నక్క. అతిశీతలమైన ప్రదేశాల్లో ఉండటానికే నేను ఎక్కువగా ఇష్టపడతాను. రష్యా, ఉత్తర అమెరికా, యూరప్‌లాంటి మంచు ప్రాంతాల్లోనే కనిపిస్తుంటాను. సాధారణంగా లేత బూడిద రంగులో ఉంటాను. కానీ, శీతాకాలంలో మాత్రం నా శరీరం తెలుపు రంగులోకి మారిపోతుంది. అంటే.. శరీరం మీద మంచు పడటంతో అలా తెల్లగా కనిపిస్తానంతే.. మంచు దట్టంగా కురిసే సమయాల్లో భూమి లోపల నిర్మించుకున్న నా గుహలోనే ఉండిపోతాను. దాదాపు 10 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలుగుబంట్ల ఉనికిని వాసన ద్వారా కనిపెట్టగలను. వాటితో నాకు పనేంటంటే.. అవి తినగా, మిగిలిన మాంసాన్నే ఆహారంగా తీసుకుంటాను కాబట్టి. కొన్నిసార్లు నేను కూడా చిన్న చిన్న జంతువుల్ని వేటాడతాను. ఎక్కువ ఎత్తుకు వెళ్లి.. అక్కడి నుంచి దూకుతూ, మంచులో దూరుతూ.. ఇలా రకరకాల విన్యాసాలతో ప్రాణుల పనిపడతా.  

కళ్ల రంగు మారుతుంది..

శీతాకాలంలో మంచు ఎక్కువగా కురవడం వల్ల చలి బాగా ఉంటుంది కదా.. అటువంటి పరిస్థితులను తట్టుకునేందుకు ఒక్కోసారి నా తోకనే శరీరానికి చుట్టుకుంటాను. అలాగే చలి నుంచి రక్షణగా నా శరీరంలో ప్రత్యేక వ్యవస్థ కూడా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. వాతావరణాన్ని బట్టి నా కళ్ల రంగు ఒక్కోసారి ఒక్కోలా మారుతుంటుంది. నా కళ్లలో ఉండే ప్రత్యేక నిర్మాణమే అందుకు కారణం. ఆ నిర్మాణమే సూర్యుడి కాంతి నుంచి రక్షణగానూ నిలుస్తుంది. భూమి లోపల దాదాపు 10 నుంచి 12 సెంటీమీటర్ల లోతులో దాక్కున్న జీవులు చేసే శబ్దాలూ నాకు స్పష్టంగా వినిపిస్తాయి.  

రష్యాలో ప్రయోగాలు..  

ఇప్పటి వరకు మా జాతి జీవులన్నీ మనుషులకు దూరంగా ఎక్కడెక్కడో జీవనం సాగించాయి. కానీ, ఈ మధ్య మమ్మల్ని పెంచుకోవడానికి కొందరు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే వివిధ పద్ధతుల ద్వారా మాలో కొన్ని లక్షణాలను మార్చే ప్రయత్నాలు రష్యాలో జరుగుతున్నాయి. నా బరువు 1.4 నుంచి 9.4 కిలోల వరకు ఉంటుంది. ఎత్తేమో 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు పెరుగుతాను. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలను. వాతావరణ మార్పులను తట్టుకోలేక మాలో కొన్ని మూడేళ్లకే చనిపోతున్నాయి. అన్నీ అనుకూలిస్తే, దాదాపు 14 ఏళ్ల వరకు బతుకుతాం.. నేస్తాలూ.. నా విశేషాలివీ.. ఆసక్తిగా ఉన్నాయి కదూ.. ఇక ఉంటా మరి.. బై.. బై!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని