అయ్యబాబోయ్‌... జెల్లీఫిష్‌లే జెల్లీఫిష్‌లు!

అనగనగా ఓ సరస్సు. దాని నిండా జెల్లీఫిష్‌లే. దానిలో ఈత కొట్టొచ్చు. కానీ... స్కూబాడైవింగ్‌ చేయడానికి మాత్రం వీలులేదు. ఆ ఈత కూడా ఎలా పడితే అలా కొడతానంటే కుదరదు

Published : 18 Oct 2023 00:17 IST

అనగనగా ఓ సరస్సు. దాని నిండా జెల్లీఫిష్‌లే. దానిలో ఈత కొట్టొచ్చు. కానీ... స్కూబాడైవింగ్‌ చేయడానికి మాత్రం వీలులేదు. ఆ ఈత కూడా ఎలా పడితే అలా కొడతానంటే కుదరదు. జెల్లీఫిష్‌లకు ఇబ్బంది కలగకుండా... నెమ్మదిగా ఈదాలి. ఇంతకీ ఈ సరస్సు ఎక్కడుంది? దానిలోకి ఈ జెల్లీఫిష్‌లు ఎలా వచ్చాయి? అనేగా మీ సందేహం. అయితే ఈ కథనం చదవండి.. మీ అనుమానాలన్నీ చిటికెలో తీరిపోతాయి!

పశ్చిమ పసిఫిక్‌లోని ఓషియానియాలోని మైక్రోనేషియా ఉపప్రాంతంలో పలావు అనే ఓ ద్వీప దేశం ఉంది. దీనికి చెందిన ఈల్‌మాల్క్‌ అనే ద్వీపంలోనే ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి మధ్య ఈ జెల్లీఫిష్‌ సరస్సు ఉంది. ఇందులో కొన్ని లక్షల జెల్లీఫిష్‌లున్నాయి. ఈ నీళ్లు కూడా చాలా వరకు తేటగా ఉంటాయి. దీని వల్ల జెల్లీఫిష్‌లు స్పష్టంగా కనిపిస్తాయి.  

కుడతాయి కానీ...

ఈ సరస్సులో ప్రధానంగా గోల్డెన్‌, స్పాటెడ్‌ గోల్డ్‌ఫిష్‌ అనే రెండు రకాలున్నాయి. నిజానికి ఇవి కుడతాయి. కానీ... అంత ప్రమాదకరం కాదు. మరో విచిత్రమైన విషయం ఏంటంటే... ఇవి కుట్టినట్టు కూడా తెలియదు. అందుకే సందర్శకులు ఏ ఇబ్బందీ లేకుండా... ఈ సరస్సులో ఈత కొడతారు. కానీ ఇక్కడే చిన్న మెలిక ఉంది. ఈత వరకు ఓకే... కానీ.. స్కూబా డైవింగ్‌ చేస్తానంటే మాత్రం అస్సలు అనుమతి లభించదు. మరో విషయం ఏంటంటే... సన్‌ స్క్రీన్‌ లోషన్‌ రాసుకుని ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సరస్సులోకి దిగకూడదు. జెల్లీఫిష్‌ల రక్షణ కోసమే ఈ నియమం పెట్టారట!

రెండు పొరలుగా...

జెల్లీఫిష్‌ల రక్షణ కోసమే స్కూబా డైవింగ్‌పై నిషేధం విధించారు. మరో కారణం ఏంటంటే... ఈ సరస్సు రెండు పొరలుగా ఉంటుంది. పైన నీటిలో ఆక్సిజన్‌ ఉంటుంది. కానీ 15 మీటర్ల దిగువన ఆక్సిజన్‌ శాతం సున్నా. పైగా అక్కడ నీటిలో హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ అనే రసాయనం ఎక్కువగా ఉంటుంది. ఇది మనుషుల ప్రాణాలకే ప్రమాదం. అందుకే అంతలోతు వరకు అసలే అనుమతించరు.

అతి ప్రాచీనం...

ఈ జెల్లీఫిష్‌ సరస్సు దాదాపు 12వేల సంవత్సరాలకు పూర్వమే ఏర్పడిందని శాస్త్రవేత్తల అంచనా. ఈ సరస్సులోకి నీరొచ్చే కాలువలు లేవు. కానీ కింద ఉన్న సున్నపు రాళ్లలోని పగుళ్లు, గుహల గుండా సముద్రం నుంచి నీరు ఈ సరస్సులోకి వస్తుంది. ఈ మార్గం గుండానే జెల్లీఫిష్‌లు ఈ సరస్సులోకి వచ్చి, ఇక్కడ తమ సంతతిని వృద్ధి చేసుకుని ఉంటాయని పరిశోధకుల అంచనా. నేస్తాలూ మొత్తానికి ఇవీ జెల్లీఫిష్‌ సరస్సు విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని