నేనొక్కదాన్నే తెలుసా..!

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు.. నేనైతే చాలా బాగున్నా.. ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు..? ఈ పక్షికి ఎవరో ఒళ్లంతా భలే రంగు వేశారని అనుకుంటున్నారా?  

Updated : 25 Nov 2023 05:31 IST

హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు.. నేనైతే చాలా బాగున్నా.. ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు..? ఈ పక్షికి ఎవరో ఒళ్లంతా భలే రంగు వేశారని అనుకుంటున్నారా? అలా అయితే మీరు పొరపడినట్లే.. ఎందుకంటే ఇది నాకు సహజంగా వచ్చిన రంగే. నన్ను మీరెప్పుడూ చూడలేదు కాబట్టి అలా అనిపించి ఉంటుంది. అందుకే ఒకసారి మీకు నా గురించి చెప్పి వెళ్దామని ఇలా వచ్చాను..!

మీరు ఇప్పటి వరకు చూసిన పక్షులకు కాస్త భిన్నంగా నారింజ, ఎరుపు రంగులో కనిపిస్తున్న నా పేరు ‘స్కార్లెట్‌ ఐబిస్‌’. నేను బ్రెజిల్‌, కొలంబియా, క్యూబా దేశాల్లో ఉంటాను. ఎక్కువగా గుంపులో ఉండటానికే ఇష్టపడతాను. మేము ఆహారం కోసం వెళ్లినప్పుడు కూడా గుంపుగానే వెళతాం. ఒక్కో గుంపుకి దాదాపు 30 నుంచి 50 పక్షులు ఉంటాయి. మా గుంపుని ‘స్టాండ్‌’ అని పిలుస్తారు తెలుసా..! శరీరమంతా ఒకే రంగులో ఉంటుంది. కానీ, మా రెక్కల చివరి భాగం మాత్రం నలుపురంగులో ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. మాలో కొన్నింటి ముక్కు ఎరుపు, మరికొన్నింటి ముక్కు నలుపు రంగులో ఉంటుంది. చిన్న చిన్న శబ్దాలు చేస్తూ మాలో మేము మాట్లాడుకుంటాం కూడా.. కానీ మా మాటలు మీకు అర్థం కావు.

నేనొక్కదాన్నే..!

నేను ఎక్కువగా సముద్రతీరంలో ఉండటానికి ఇష్టపడతాను. కీటకాలు, చిన్నచిన్న చేపలను ఆహారంగా తీసుకుంటాను. పగలే నాకు కావాల్సిన ఆహారాన్ని వెతుక్కుంటాను. రాత్రి సమయాల్లో ఎంచక్కా నిద్రపోతాను. నేను పుట్టినప్పుడు ముదురు బూడిద రంగులో ఉంటాను. రోజులు గడుస్తున్న కొద్దీ ఇలా ఎరుపు రంగులోకి మారతాను. మీకో విషయం తెలుసా.. ప్రపంచంలో ఎరుపు రంగులో ఉండే ఏకైక తీరపక్షిని నేనొక్కదాన్నే..

ఈతంటే ఇష్టం..!

నాకు చాలా చిన్నప్పటి నుంచే ఎగరడం వచ్చు. ఇంకా ఈత కొట్టడం అంటే కూడా చాలా ఇష్టం. నా బరువు ఒక కిలో వరకు ఉంటుంది. ఎత్తు 55 నుంచి 63 సెంటీమీటర్ల వరకు పెరుగుతాను. నేను దాదాపు 16 ఏళ్ల వరకు బతుకుతాను. పరిస్థితులు అనుకూలిస్తే.. 20 సంవత్సరాలు కూడా జీవిస్తాను. నేస్తాలూ.. ఇవీ నా విశేషాలు.. మీకు నచ్చే ఉంటాయి కదూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని