ఈ కేకు బంగారం..!

హాయ్‌ ఫ్రెండ్స్‌..! మనకు కేక్స్‌ భలే నచ్చుతాయి కదా..! అమ్మానాన్న అవి కొనిపెడతామంటే చాలు, అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటాం..

Updated : 09 Dec 2023 05:11 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌..! మనకు కేక్స్‌ భలే నచ్చుతాయి కదా..! అమ్మానాన్న అవి కొనిపెడతామంటే చాలు, అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటాం.. ఇప్పటికే మనం చాలా రకాల కేక్స్‌ తినేసి ఉంటాం.. అందులో మీకు ఏ ఫ్లేవర్‌ ఇష్టమంటే.. ఒకరు బటర్‌స్కాచ్‌, మరొకరు ఐస్‌క్రీం, ఇంకొంత మంది రెడ్‌ వెల్‌వేట్‌ అని ఇలా రకరకాలుగా చెబుతారు అంతే కదా..! అయినా ఇప్పుడు ఈ కేక్‌ గోలేంటి అనుకుంటున్నారా?ఎందుకంటే మనం ఓ ప్రత్యేకమైన కేక్‌ గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి.. మరి ఇంకెందుకాలస్యం వెంటనే ఈ కథనం చదివేయండి..!

 మీరు ఎప్పుడైనా బంగారంతో తయారుచేసిన కేక్‌ తిన్నారా..? ఆశ్చర్యంగా ఉంది కదూ బంగారంతో కేక్‌ ఏంటి అనుకుంటున్నారా..? కానీ నిజమే నేస్తాలూ.. ఫ్రాన్స్‌లోని లావ్రే మ్యూజియంలో ఓ వ్యక్తి బంగారంతో కేక్‌లను తయారుచేశాడు. బంగారాన్ని కరిగించి కొన్ని పద్ధతుల ద్వారా దాన్ని తినడానికి వీలుగా మార్చి అప్పుడు కేక్స్‌ని చేశాడట. వాటికి ‘వైల్డ్‌ బెర్రీ క్రిస్టల్‌ మాకరాన్‌ చీజ్‌ కేక్‌’, ‘పాంపాన్‌ వెనిలా కారమెల్‌ గ్రేడ్‌ ఎ కేక్‌’ అని పేర్లు కూడా పెట్టాడు.  

ఒక కారు విలువ..!

బంగారంతో చేశారు కాబట్టి వాటి ధర కచ్చితంగా వేలల్లోనే ఉంటుందనుకుంటే మనం పొరపడినట్లే. ఎందుకంటే.. ఆ కేక్స్‌ కొనే డబ్బులతో ఏకంగా ఒక కారే కొనేయొచ్చట తెలుసా.. ఇందులో వైల్డ్‌ బెర్రీ క్రిస్టల్‌ మాకరాన్‌ చీజ్‌ కేక్‌ ధర అక్షరాల రూ.8.88 లక్షలు. పాంపాన్‌ వెనిలా కారమెల్‌ గ్రేడ్‌ ఎ కేక్‌ వెల రూ.1.25లక్షలు. ఏంటీ ఆశ్చర్యంగా చూస్తున్నారు..? ఇది నిజమే పిల్లలూ.. ధరకు తగ్గట్టుగానే చూడటానికి కూడా చాలా అందంగా ఉండేలా వాటిని తయారుచేశారు. మీకు ఇంకో విషయం తెలుసా ఈ కేక్స్‌ తినడానికి వాటితో పాటుగా స్వచ్ఛమైన బంగారంతో తయారుచేసిన ఫోర్క్‌ స్పూన్‌ కూడా ఇస్తారట.  మరో విషయం ఏంటంటే.. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇవే అత్యంత ఖరీదైన కేక్స్‌ అట. వీటిని ఓ వ్యక్తి కొనుగోలు చేసి, అతను తింటున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. కొన్ని గంటల్లోనే దానికి లక్షల వ్యూస్‌ వచ్చాయట. ఇది చూసిన నెటిజన్లు.. ‘నిజంగా ఇందంతా నిజమేనా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎంతైనా.. ఈ కేక్‌ విశేషాలు భలే ఆశ్చర్యంగా ఉన్నాయి కదా నేస్తాలూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని