మేం ఎగిరే డ్రాగన్లం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు. చూస్తే తొండలా ఉంది. కానీ ఎగురుతోంది ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదూ! నేను నిజానికి బల్లిజాతికి చెందిన జీవిని.

Updated : 10 Dec 2023 06:59 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు. చూస్తే తొండలా ఉంది. కానీ ఎగురుతోంది ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదూ! నేను నిజానికి బల్లిజాతికి చెందిన జీవిని. మరి నా పేరేంటో..? తీరేంటో..? తెలుసుకోవాలని ఉంది కదా! అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి.

నా పేరు డ్రోకో వోలన్స్‌. పలకడానికి కాస్త ఇబ్బందిగా ఉంది కదూ! ఎంచక్కా నన్ను ఫ్లయింగ్‌ డ్రాగన్‌ అని పిలిచేయండి సరేనా! అలా అని నేను పక్షిలా ఎగురుతాను అని మాత్రం అనుకోకండి. కేవలం గ్లైడ్‌ చేస్తానంతే. నా కడుపు భాగంలో చర్మం చిన్న చిన్న ఎముకల సాయంతో రెక్కల్లా ఉంటుంది. దీన్నే పటాజియా అని పిలుస్తారు. ఇది పక్కటెముకలతో అనుసంధానమై ఉంటుంది. దీని సాయంతోనే నేను గాల్లో గ్లైడ్‌ చేస్తుంటాను.

అప్పుడు మాత్రమే...

 మేం ఎక్కువగా ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల వర్షారణ్యాల్లో జీవిస్తుంటాం. తోకతో సహా దాదాపు 22 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాం. మాలో మగవి, ఆడవి కాస్త భిన్నంగా ఉంటాయి. మేం చెట్ల మీద ఉన్నప్పుడు మామూలు తొండల్లానే ఉంటాం. గ్లైడ్‌ చేయాలనుకున్నప్పుడు మాత్రమే మా పొట్ట భాగం నుంచి చర్మం బయటకు వస్తుంది. దీని సాయంతోనే మేం సునాయాసంగా ఎనిమిది మీటర్ల వరకు గ్లైడ్‌ చేయగలుగుతాం. మరో విషయం ఏంటంటే.. వర్షం పడుతున్నప్పుడు, గాలి వేగంగా వీస్తున్నప్పుడు మాత్రం అస్సలు గ్లైడ్‌ చేయం.

ఏం తింటామంటే..

మేం ఎక్కువగా చీమలు, చెదపురుగులను ఆహారంగా తీసుకుంటాం. వీటినే కాకుండా ఇతర చిన్న చిన్న కీటకాలను కూడా కరకరలాడించేస్తాం. అయినా మాకు చీమలంటేనే చాలా ఇష్టం. చెట్ల మొదళ్లలో వీటికోసం ఎంతో ఓపిగ్గా కాపుకాస్తాం. చీమలు రాగానే మా నాలుకతో పట్టుకుని బొజ్జ నింపుకొంటాం. మాలో ఆడవి నేలను తవ్వి మట్టిలో గుడ్లు పెడతాయి. కొంతకాలం తర్వాత వాటి నుంచి పిల్లలు బయటకు వస్తాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఇక ఉంటా మరి. అసలే నాకు చాలా ఆకలిగా ఉంది. బోలెడు చీమల్ని పట్టుకుని తినాలి.. బై.. బై..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని