పండు.. పండు.. ముళ్ల పండు!

నేస్తాలూ.. బాగున్నారా! ఈ పండును చూస్తే మీకు కరోనా వైరస్‌ గుర్తుకు వస్తోంది కదూ! కానీ దీనికీ ఆ వైరస్‌కు అసలు సంబంధం లేదు. చుట్టూ ముళ్లతో ఉమ్మెత్తకాయలా ఉన్న ఈ పండు గురించి మీకు తెలుసా? తెలియకుంటే ఇప్పుడు తెలుసుకోండి ఫ్రెండ్స్‌.. సరేనా!

Published : 11 Dec 2023 00:19 IST

నేస్తాలూ.. బాగున్నారా! ఈ పండును చూస్తే మీకు కరోనా వైరస్‌ గుర్తుకు వస్తోంది కదూ! కానీ దీనికీ ఆ వైరస్‌కు అసలు సంబంధం లేదు. చుట్టూ ముళ్లతో ఉమ్మెత్తకాయలా ఉన్న ఈ పండు గురించి మీకు తెలుసా? తెలియకుంటే ఇప్పుడు తెలుసుకోండి ఫ్రెండ్స్‌.. సరేనా!

పండుపేరు రాంబుటాన్‌. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌ ఈ పండ్ల చెట్లకు పుట్టినిల్లు. ఇటీవల కాలంలో వీటిని మనదేశంలోనూ కేరళ, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కర్ణాటకలో సాగు చేస్తున్నారు. ఈ చెట్లు గాల్లో తేమశాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ పండ్ల తొక్క ఎరుపు రంగులో ఉంటుంది. ఈ పండ్ల చుట్టూ మెత్తటి ముళ్లుంటాయి. పండు లోపల బాదం పప్పు ఆకారంలో ఉండే తెల్ల గింజ ఉంటుంది. దాని చుట్టూ తెల్లటి, రుచికరమైన గుజ్జు ఉంటుంది.

రుచిలో లిచీ!

ఈ పండు, రుచిలో కాస్త లిచీని పోలి ఉంటుంది. అందుకే రాంబుటాన్‌ పండును ‘హెయిరీ లిచీ’ అని కూడా పిలుస్తారు. ఈ చెట్లు సుమారు 12 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటి విత్తనాలు నాటిన 15 రోజుల్లోనే మొలకెత్తుతాయి. ఈ చెట్లు 6 నుంచి 7 సంవత్సరాల తర్వాత కాపుకొస్తాయి. వీటికి కనీసం 200 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం అవుతుంది.

సముద్రమట్టానికి 10

నుంచి 200 మీటర్ల ఎత్తులో ఇవి చక్కగా పెరుగుతాయి. వీటికి నీళ్లు పుష్కలంగా ఉండాలి. అదే సమయంలో నేల మీద నీరు నిల్వ ఉండకూడదు. కాయలు పక్వానికి రావడానికి 4 నుంచి 5 నెలలు పడుతుంది.

ధర ఎక్కువే!

ఈ పండ్లు సామాన్యులకు మాత్రం అందుబాటులో ఉండవు. ఎందుకంటే వీటి ధర అధికం. మన దేశంలో వీటి ధర కిలో 600 నుంచి 400 రూపాయలు పలుకుతాయి. వీటి రుచి తీపి, పులుపు మిళితమై ఉంటుంది. ఈ పండులోని గుజ్జు తినడం వల్ల పుష్కలంగా విటమిన్‌- సి లభిస్తుంది. ఈ పండ్లు కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి.

అయిదు లేదా ఆరు!

రాంబుటాన్‌ ఫలాల్లో ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి దొరికినప్పుడు వీటిని రోజూ మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటిలో సహజ చక్కెరలూ సమృద్ధిగా ఉంటాయి. అదేపనిగా వీటిని తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. అందుకే రోజుకు కేవలం 5 లేదా 6 మాత్రమే తింటే ఆరోగ్యానికి మంచిది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ ముళ్ల పండు విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని