కొత్త కొత్తగా కొత్త సంవత్సరం!

హాయ్‌ నేస్తాలూ...! మీ అందరికీ ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’. మన బుజ్జి స్నేహితుల్లో ఈరోజే జన్మదినం జరుపుకునేవాళ్లుంటే... వాళ్లకు కూడా.. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు’! చూస్తుండగానే 2023 వెళ్లిపోయింది.

Published : 01 Jan 2024 00:25 IST

హాయ్‌ నేస్తాలూ...! మీ అందరికీ ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’. మన బుజ్జి స్నేహితుల్లో ఈరోజే జన్మదినం జరుపుకునేవాళ్లుంటే... వాళ్లకు కూడా.. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు’! చూస్తుండగానే 2023 వెళ్లిపోయింది. 2024 రానే వచ్చింది. రానైతే వచ్చింది సరే.. మరి మనమూ కొత్తగా మారాలి కదా! మారాం చేయడం కాస్తైనా మానాలి కదా! ప్రాణం లేని క్యాలెండరే తనలోని పేజీలను వదిలేసి కొత్త సంవత్సరంలోకి కొత్తగా అడుగుపెడుతుంటే.. జీవమున్న మనమెందుకు అలానే పాతగా ఉండిపోవాలి చెప్పండి. అందుకే మనమూ మారదాం కొత్తగా..! మరి దాని కోసం ఏం చేయాలి. ముందైతే ఈ కథనం చదవండి. మీకే అవగాహన వస్తుంది. ఓ అంచనాకు వస్తారు. మీకంటూ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. దాన్ని అమలు పరిచేయండి.. సరేనా!

మ్మానాన్నలు మనకు రెండు కళ్లలాంటి వారు. మనం కాస్త పెరిగి పెద్దయ్యేంత వరకు ఈ ప్రపంచాన్ని మనం వాళ్ల కళ్లతోనే చూస్తాం. అలాంటి తల్లిదండ్రుల్ని మనం నిత్యం గౌరవించాలి. ఎప్పుడూ నిందించకూడదు. ఎదురు చెప్పకూడదు. వెటకారాలూ, సినిమాల్లోలా అపహాస్యాలూ చేయకూడదు. చిన్నచిన్న పనుల్లో అమ్మానాన్నకు సాయం చేయాలి. అమ్మానాన్న తర్వాత స్థానం.. గురువులదే. ఉపాధ్యాయులతో భయభక్తులతో, వినయంగా ప్రవర్తించాలి. తరగతి గదుల్లో అల్లరి చేయకుండా, వాళ్లు చెప్పే విషయాలు ఏకాగ్రతతో వినాలి. ముందు ఈ రెండింటిని తూ.చా. తప్పకుండా పాటించాలి. అప్పుడే మనం సరైన దారిలో నడుస్తున్నట్లు లెక్క.

బద్ధకం వద్దు నేస్తమా!

మనం సెలయేళ్లలాంటి వాళ్లం. నిత్యం ప్రవహిస్తూనే ఉండాలి. బద్ధకంతో ఓ చోట ఆగిపోకూడదు. హోంవర్క్‌, క్లాస్‌ వర్క్‌ అన్నీ సమయానికి పూర్తి చేసేయాలి. ఏవీ పెండింగ్‌ పెట్టకూడదు. ఏ రోజు పాఠాలు ఆ రోజే చదవాలి. ఏ రోజు పనులు ఆ రోజే చేయాలి. అస్సలు వాయిదా వేయకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేచి స్కూలుకు సిద్ధం కావాలి. తీరుబడిగా మేల్కొని, హడావిడి పడొద్దు. అమ్మానాన్నల్ని కంగారుపెట్టొద్దు. ఇది చేయాలంటే రాత్రి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిద్రపోవాలి.

బై.. బై.. జంక్‌!

పాత సంవత్సరానికి బై.. బై.. చెప్పేసినట్లే... కొత్త ఏడాదిలో జంక్‌ ఫుడ్‌కు వీడ్కోలు పలకాలి. ఒకవేళ.. ఒకేసారి సాధ్యం కాదనుకుంటే కొద్ది కొద్దిగా అయినా మానేయాలి. జంక్‌ ఫుడ్‌ స్థానంలో పండ్లు, ఇతర బలవర్థక ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తినేటప్పుడు చక్కగా నమిలి మింగాలి. ఆహార పదార్థాలను వృథా చేయకూడదు. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలి. ఆహారం తినే ముందు, తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కేవలం కడుక్కుంటేనే సరిపోదు, రుమాలుతో చక్కగా తుడుచుకోవాలి కూడా!

తెర నుంచి తేరుకుందాం!

స్మార్ట్‌ఫోన్లు అనీ, టీవీలని వాటికే గంటలకు గంటలు అతుక్కుపోకూడదు. రోజూ ఇంత సమయం అని పెట్టుకుని కచ్చితంగా అంత వరకు మాత్రమే చూసి, తర్వాత వాటిని పక్కన పెట్టేయాలి. మిగిలిన సమయాన్ని మంచి మంచి పుస్తకాలు చదివేందుకో, డ్రాయింగ్‌కో, కరాటేకో.. ఇలా ఏదైనా ఒక మంచి విషయం కోసం వెచ్చించాలి. ఎంతసేపూ చదువులే కాకుండా.. కాసేపు మైదానానికి వెళ్లి ఆటలూ ఆడాలి. దీని వల్ల మనలో చురుకుదనం వస్తుంది. ఇది మన జ్ఞాపకశక్తినీ మెరుగు పరుస్తుంది.

దోస్త్‌ మేరా దోస్త్‌!

మన అమ్మానాన్నలు, అన్నాచెల్లెళ్ల తర్వాత ఎక్కువ సమయం క్లాస్‌రూంలోని తోటి విద్యార్థులతోనే గడుపుతాం. వాళ్లతో స్నేహంగా మెలగాలి. గొడవలకు దిగకూడదు. ఒకరి మీద మరొకరు చాడీలు చెప్పుకోకూడదు. నిక్‌నేమ్‌లతో ఒకరినొకరు అస్సలు ఆటపట్టించుకోకూడదు. ఆడుతూ పాడుతూ హాయిగా ఉండాలి కానీ.. అనవసరంగా ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు తావివ్వకూడదు.

సేవ తోవలో...

మనం చిన్నప్పటి నుంచే సామాజిక స్పృహను అలవర్చుకోవాలి. పేదవారికి, అనాథలకు మన అమ్మానాన్నల సాయంతో తోచిన సాయం చేయాలి. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకూ మన వంతు కృషి చేయాలి. ఎప్పుడో సంవత్సరానికోసారి వచ్చే పుట్టినరోజు నాడు ఓ మొక్క నాటి చేతులు దులుపుకోకుండా, వీలుంటే ప్రతి నెలా ఒక మొక్క నాటాలి. కేవలం నాటితేనే సరిపోదు. దాన్ని పరిరక్షించాలి. ఇలా సంవత్సరానికి 12 మొక్కల్ని నాటిన వారమవుతాం. చేయాలే కానీ.. ఇంకా మంచి పనులు ఎన్నో ఉంటాయి. మీ ఇంట్లో వాళ్లు, ఉపాధ్యాయులతో చర్చించి వీటితో పాటు మరిన్ని కొత్త నిర్ణయాలు తీసుకోండి. వాటిని అమలుపరచండి. ఈ కొత్త  సంవత్సరం నుంచి మీరు కూడా కొత్త కొత్తగా మారండి. సరేనా ఫ్రెండ్స్‌.. ఆల్‌ ది బెస్ట్‌ మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని