గండు పిల్లిని కాదు గుబురు పిల్లిని!

హాయ్‌ ఫ్రెండ్స్‌! మీ అందరికీ ‘బి లేటేడ్‌ విష్‌ యూ హ్యాపీ న్యూ ఇయర్‌!’ ఏంటి నన్ను చూసి అలా భయపడుతున్నారు. చూడ్డానికి నేను భయంకరంగా కనిపిస్తున్నా...  పిల్లిని మాత్రమే. ఈ ఫొటోల్లో కనిపించేంత, మీరు అనుకునేంత ప్రమాదకారిని మాత్రం కాదు.

Updated : 03 Jan 2024 05:41 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌! మీ అందరికీ ‘బి లేటేడ్‌ విష్‌ యూ హ్యాపీ న్యూ ఇయర్‌!’ ఏంటి నన్ను చూసి అలా భయపడుతున్నారు. చూడ్డానికి నేను భయంకరంగా కనిపిస్తున్నా...  పిల్లిని మాత్రమే. ఈ ఫొటోల్లో కనిపించేంత, మీరు అనుకునేంత ప్రమాదకారిని మాత్రం కాదు. మరి నేను ఎందుకు కాస్త గండు పిల్లిలా ఈ రూపంలో ఉన్నాను. ఇంతకీ నా పేరేంటి? ఎక్కడుంటాను? ఇలాంటి వివరాలన్నీ మీకు తెలియదు కదా! అవన్నీ చెప్పి పోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

నా పేరు మాన్యుల్‌. పల్లాస్‌ పిల్లి అని కూడా పిలుస్తారు. మీకు ఈ రెండింట్లో ఏది నచ్చితే ఆ పేరుతో పిలవండి సరేనా! నేను అడవి పిల్లిని. 46 నుంచి 65 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. నా గుబురు తోకేమో 21 నుంచి 31 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది.
నేను 2.5 నుంచి 4.5 కిలోల వరకు బరువు తూగుతాను. చాలా బలంగా ఉంటాను. కాళ్లు మాత్రం పొట్టిగా ఉంటాయి. నా వెంట్రుకలు ఒత్తుగా, పొడవుగా, గుబురుగా ఉంటాయి. ఇవి లేతపసుపు, ఎరుపు, లేత బూడిద రంగులో ఉంటాయి. విపరీతమైన చలి నుంచి రక్షణ కోసమే నా వెంట్రుకలు ఇలా గుబురుగా పెరుగుతాయి. నా చెవులేమో బూడిద రంగులో ఉంటాయి.  

ఎక్కడుంటానంటే...

నేను మధ్య ఆసియా, మంగోలియా, టిబెట్‌లో జీవిస్తుంటాను.
మీ దగ్గర హిమాలయాల్లోనూ నేను ఉంటాను. 1991లో లద్దాఖ్‌లోని సింధులోయలో మొదటిసారిగా నేను మీకు కనిపించాను.
2013లో గంగోత్రి నేషనల్‌ పార్కులోనూ నన్ను గుర్తించారు. సిక్కిం, నేపాల్‌, భూటాన్‌, చైనాలోనూ నా ఉనికి ఉంది. మొత్తానికి నేను చల్లని ప్రాంతాల్లో మాత్రమే జీవిస్తాను.

ఒంటరి జీవిని నేను...

నేను సాధారణంగా ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాను. చిన్న చిన్న గుహలు, రాతి పగుళ్లు, బొరియల్లో తల దాచుకుంటాను. ఇతర పిల్లుల్లానే నాకు కూడా ఎలుకలంటే భలే ఇష్టం. వాటి మాంసాన్ని లొట్టలేసుకుని మరీ తింటాను. ఇంకా ఉడుతలు, పక్షులు, కుందేళ్లను వేటాడతాను. చిన్న చిన్న కీటకాలనూ ఆహారంగా తీసుకుంటాను.  

కాస్త ఇబ్బందే!

చైనా, మంగోలియా, రష్యాలో ఒకప్పుడు నా వెంట్రుకల కోసం నన్ను విపరీతంగా వేటాడారు. సంవత్సరానికి దాదాపు పదివేల వరకు మమ్మల్ని చంపారు. చట్టపరంగా రక్షణ కల్పించిన తర్వాత 1970ల నుంచి మాకు కాస్త ఉపశమనం దొరికింది. అప్పటి నుంచి మమ్మల్ని వేటాడటం తగ్గింది. కానీ ఇప్పటికీ అనధికారికంగా ఔషధాల తయారీ, చర్మం, వెంట్రుకల కోసం మమ్మల్ని చంపేస్తున్నారు. ఎలుకల సంఖ్య తగ్గిపోవడం వల్ల కూడా ఆహారం దొరక్క మేం చాలా ఇబ్బంది పడుతున్నాం. అడవి కుక్కలు, నక్కలు, గద్దల్లాంటి పక్షుల దాడుల్లోనూ మేం ప్రాణాలు కోల్పోతున్నాం. ప్రస్తుతానికైతే మరీ అంతరించిపోయే స్థితిలో అయితే ఏమీలేం కానీ.. పరిస్థితులు ఇలానే కొనసాగితే మాత్రం మాకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి బై... బై...!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని