‘జాన్వీ జాన్వీ...’ ఎస్‌ పాపా...!

హాయ్‌ నేస్తాలూ..! ‘జానీ జానీ.. ఎస్‌ పాపా.. ఈటింగ్‌ షుగర్‌.. నో పాపా..’ ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ సంక్రాంతి సెలవుల్లో అన్నీ మర్చిపోయుంటారేమో అని ఈ చిన్ని పద్యాలు మాకు గుర్తు చేస్తున్నారు అనుకుంటున్నారు కదూ!

Updated : 19 Jan 2024 04:24 IST

హాయ్‌ నేస్తాలూ..! ‘జానీ జానీ.. ఎస్‌ పాపా.. ఈటింగ్‌ షుగర్‌.. నో పాపా..’ ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ సంక్రాంతి సెలవుల్లో అన్నీ మర్చిపోయుంటారేమో అని ఈ చిన్ని పద్యాలు మాకు గుర్తు చేస్తున్నారు అనుకుంటున్నారు కదూ! ఇలాంటి రైమ్స్‌ చదవడం మనకు భలేగా నచ్చుతుంది కదా! క్లాస్‌లో అయితే మళ్లీ మళ్లీ చదివేస్తాం. కానీ ఇలాంటివే మనం సొంతంగా రాస్తే ఎలా ఉంటుంది?! అమ్మో.. మన వల్ల అవుతుందా అనిపిస్తుందా? కానీ ఓ చిన్నారి.. చాలా పద్యాలు రాసి అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. మరి తనెవరో? ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన జాన్వీశర్మకు పన్నెండేళ్లు. ప్రస్తుతం తను ఏడో తరగతి చదువుతోంది. ఆ వయసు పిల్లలంటే.. స్కూల్‌ నుంచి వచ్చి బుద్ధిగా హోంవర్క్‌ చేసుకుని, ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటారు. వాళ్లకి రైమ్స్‌ ఏమైనా గుర్తున్నాయా.. అంటే చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న ఒకటో, రెండో గుర్తుండి ఉంటాయి అంతే. అయినా.. స్కూల్లో ఇచ్చిన హోంవర్క్‌ పూర్తి చేయడానికే, సమయం చాలట్లేదంటే.. రైమ్స్‌ పట్టించుకునేదెప్పుడు అని అనుకుంటున్నారు కదూ..! కానీ మన జాన్వి కొత్తకొత్త పద్యాలు రాస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

 ప్రతిభతోనే..

 జాన్వికి చిన్నప్పటి నుంచి పద్యాలన్నా, కథలన్నా చాలా ఇష్టమట. ఎవరు చెప్పినా ఆసక్తిగా వినేదట. తను కూడా వాళ్లలాగా చెప్పడానికి ప్రయత్నించేదట. అలా తనకు సొంతంగా పద్యాలు రాయాలన్న ఆలోచన కలిగిందట. రకరకాల అంశాల మీద ఇప్పటి వరకు 123 పద్యాలు రాసిందామె. తన ప్రతిభతో ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం దక్కించుకుంది. ఇంకో విషయం ఏంటంటే.. జాన్వి ఎక్కువగా ప్రకృతికి సంబంధించిన రైమ్స్‌ రాసిందట. ఇంత చిన్న వయసులోనే అన్ని పద్యాలు రాసిన జాన్వి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని