నేను జిరాఫీ పురుగునోచ్‌!

‘అదేంటి... జిరాఫీ జంతువు కదా..! కీటకం ఎలా అయింది?! అయినా నీ మెడ ఏంటి అంత పొడవుంది?’ అని నన్ను చూడగానే మీకు ఈ సందేహాలన్నీ వచ్చాయి కదూ!మీ అనుమానాలన్నీ తీర్చిపోదామనే ఇదిగో ఇలా రెక్కలు కట్టుకు వాలాను.

Published : 04 Feb 2024 00:29 IST

‘అదేంటి... జిరాఫీ జంతువు కదా..! కీటకం ఎలా అయింది?! అయినా నీ మెడ ఏంటి అంత పొడవుంది?’ అని నన్ను చూడగానే మీకు ఈ సందేహాలన్నీ వచ్చాయి కదూ!మీ అనుమానాలన్నీ తీర్చిపోదామనే ఇదిగో ఇలా రెక్కలు కట్టుకు వాలాను. ‘నీకు రెక్కలు లేవు కదా.. ఎలా ఎగిరివచ్చావు? అన్నీ అబద్ధాలే!’ అని మీరు నన్ను కోపగించుకోకండి. ఎందుకంటే.. నిజంగా నేను ఎగిరే వచ్చాను. ఎలా అంటే...ఈ కథనం చదివేయండి. మీకే తెలుస్తుంది సరేనా!

 పొడవైన మెడతో, చూడ్డానికి జిరాఫీలా అనిపిస్తున్న నేను ఓ కీటకాన్ని. నా పేరు జిరాఫీ వీవిల్‌. నాకు తెలిసి నన్ను ఇంతకు ముందెప్పుడూ మీరు చూసి ఉండరు! ఎందుకంటే నేను కేవలం మడగాస్కర్‌లో మాత్రమే జీవిస్తుంటాను. వియత్నాంలో కూడా కాస్త నాలా ఉండే కీటకం ఒకటి ఉందట. కానీ అది వేరు.. నేను వేరు.

‘మెడ’గాస్కర్‌ జీవినైన నేను..

మాలో మగ కీటకాలకు, ఆడవాటికన్నా పొడవుగా మెడలుంటాయి. మా మెడ వాటి కన్నా రెండు నుంచి మూడు రెట్లు పెద్దగా ఉంటుంది. మా శరీరం నల్లగా, వీపు మీద మాత్రం ఎరుపు రంగులో ఉంటుంది. నేను మడగాస్కర్‌లో జీవిస్తాను... నా మెడ పొడవుగా ఉంటుంది కాబట్టి.. నన్ను మీరు ముద్దుగా ‘మెడ’గాస్కర్‌ కీటకం అని కూడా పిలిచేయండి. ఫర్లేదు.. నేనేం అనుకోను!!  

చిరుప్రాణులమే...

మా మెడ పొడవుగా ఉంటుంది కానీ.. మేం చాలా చిరుజీవులం. అంగుళం కంటే కూడా చిన్నగా ఉంటాం. కేవలం 2 సెంటీమీటర్ల వరకు మాత్రమే పెరుగుతాం. మరో విషయం ఏంటంటే శరీర పరిమాణంతో పోల్చుకుంటే.. జిరాఫీల కన్నా మాకే పొడవైన మెడ ఉంటుందట. ఈ విషయం మేం చెప్పడం లేదు.. మీ శాస్త్రవేత్తలే చెబుతున్నారు.

పత్రమే ఛత్రం!

మాలో ఆడవి చెట్టు పత్రాలను గుండ్రంగా మలిచి, వాటి మధ్యలో గుడ్లు పెడతాయి. ఒక్కో ఆడ కీటకం.. ఒక్కసారికి ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. తర్వాత కొంతకాలానికి దీని నుంచి వచ్చే లార్వా.. ఆ పత్రాన్నే ఆహారంగా తీసుకుని పెరిగి పెద్దవుతుంది. అన్నట్లు చెప్పడం మరిచిపోయా... మాకు రెండు పారదర్శకమైన చిన్న రెక్కలూ ఉంటాయి. వీటి సాయంతోనే మేం ఎగురుతాం కూడా. ఎక్కువగా చెట్లమీదే జీవిస్తాం. వాటి పత్రాలే మాకు ఆహారం. మేం చాలా బుద్ధిమంతులం. ఏ ఇతర జీవుల జోలికి కూడా పోం. అన్నీ అనుకూలిస్తే ఒక సంవత్సరకాలం వరకు జీవించగలం. నేస్తాలూ.. మొత్తానికి.. ప్రస్తుతానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి. బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని