Story: మూడు ప్రశ్నలు... ఆరు సమాధానాలు!

పార్వతీపురాన్ని పాలించే వీరవర్మ కొడుకు చైతన్యవర్మ విద్యాభ్యాసం ముగించుకొని రాజ్యానికి వచ్చాడు. తన పట్టాభిషేకం కోసం వీరవర్మ ఏర్పాట్లు చేయడంతో, చైతన్యవర్మ తండ్రిని కలిశాడు. ‘ఇంతవరకూ చదువుతో పాటు యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకున్నాను.

Published : 11 Jun 2024 00:33 IST


పార్వతీపురాన్ని పాలించే వీరవర్మ కొడుకు చైతన్యవర్మ విద్యాభ్యాసం ముగించుకొని రాజ్యానికి వచ్చాడు. తన పట్టాభిషేకం కోసం వీరవర్మ ఏర్పాట్లు చేయడంతో, చైతన్యవర్మ తండ్రిని కలిశాడు. ‘ఇంతవరకూ చదువుతో పాటు యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకున్నాను. ఇప్పుడు ప్రపంచాన్ని చదవాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి సాహసయాత్రలు చేయాలన్న కోరిక ఉంది. అదే లోకజ్ఞానానికి తొలిమెట్టు. మీరు అనుమతిస్తే ఆ యాత్రలు ముగించుకొని పరిపాలనా పగ్గాలు చేపడతాను’ అని చెప్పాడు.

ఆలోచనలో పడ్డాడు వీరవర్మ. ‘సాహసయాత్రలతో రాజ్యానికి లాభం చేకూరుతుందంటే సంతోషమే, అయితే నువ్వొక్కడివే వెళ్లేందుకు మాత్రం నేను అంగీకరించను. నీకు తోడుగా మరొకరుండాల్సిందే’ అని మెలిక పెట్టాడు వీరవర్మ. ‘ఇప్పటికిప్పుడు ఎలా?’ అని ఆందోళనతో తండ్రిని అడిగాడు చైతన్య వర్మ. ‘నీ వెంట.. నీ మనసెరిగి మసలుకొనే ఆంతరంగిక సలహాదారుడు ఉంటే బాగుంటుంది. ఆ ఎంపిక కూడా నువ్వే చేసుకో’ అని సూచన చేశాడు వీరవర్మ.

‘మీ ఆలోచన బాగుంది’ అని అంగీకరించాడు చైతన్యవర్మ. అనుకున్నదే తడవు, ఈ విషయం మంత్రికి తెలియజేసి.. దృఢకాయులు, తెలివితేటలు కలిగిన యువకులను ఎంపిక చేసి చైతన్య వర్మ దగ్గరకు పంపమని చెప్పాడు వీరవర్మ. వారం రోజుల పాటు వివిధ పరీక్షలు నిర్వహించి చివరగా ఇద్దరు యువకులను చైతన్య వర్మ దగ్గరకు పంపించాడు మంత్రి. వీరవర్మ కూడా అక్కడే ఉండడంతో మంత్రి ఎంపికను మనసులో మెచ్చుకున్నాడు.

ఇద్దరినీ పరిశీలనగా చూసిన చైతన్యవర్మ... ‘నా కాలుకు ముల్లు గుచ్చుకుంటే ఏం చేస్తారు?’ అని ఇద్దర్నీ ఒకేసారి అడిగాడు. ‘ముల్లును తీస్తాను’ అని సమాధానమిచ్చాడు మొదటివాడు. ఇక రెండోవాడు.. ‘ఆ పరిస్థితి రాకుండా ముందుగానే మీకు పాదరక్షలు ఏర్పాటు చేస్తాను’ అన్నాడు. వీరవర్మ ఆసక్తిగా వినసాగాడు. అప్పుడు చైతన్యవర్మ రెండో ప్రశ్నగా.. ‘మన ప్రయాణ ఖర్చులకు... బంగారం, వెండి, నగదులలో ఏది తీసుకువెళ్తే బాగుంటుంది’ అని అడిగాడు. 

‘వెండికన్నా బంగారం విలువైనది. అది ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. బంగారం తీసుకుపోతే సరిపోతుంది’ అని చెప్పాడు మొదటి వ్యక్తి. ‘వెళ్లేదే సాహసయాత్రలకు... మనకు తోడుగా ఉండాల్సింది ధైర్యసాహసాలు. శ్రమను గౌరవిస్తే చాలు. అదే  మనకు అన్నీ సమకూరుస్తుంది కాబట్టి, పెద్దగా మనం, ఎటువంటి సంపదా తీసుకుపోనవసరం లేదు’ అన్నాడు రెండో వ్యక్తి. వీరవర్మకు రెండోవ్యక్తి సమాధానం సబబుగా అనిపించలేదు. 

‘ఈ సాహస యాత్రలో భాగంగా... మీ ఇద్దరికీ చెరో వెదురు కర్ర ఇస్తే ఏం చేస్తారు?’ అని మూడో ప్రశ్నగా అడిగాడు చైతన్యవర్మ. ‘వెదురు కర్రతో మంచి బుట్టను తయారు చేయిస్తా. మన వెంట తినుబండారాలు తీసుకుపోవడానికి ఉపయోగించవచ్చు’ అని చెప్పాడు మొదటి వ్యక్తి. ‘వెదురు కర్రకు వాతలు పెట్టి.. మీ నోటికి, చేతికి పని కలిపిస్తాను’ అన్నాడు రెండో వ్యక్తి. ‘ఏంటీ.. యువరాజుకే పని చెప్పడమా?’ అంటూ కోపంగా రెండో వాడి వైపు చూశాడు వీరవర్మ. ‘మీ పరీక్షలు పూర్తయ్యాయి. మీకు కేటాయించిన వసతి గృహాల్లో విశ్రాంతి తీసుకోండి’ అంటూ ఇద్దరినీ చైతన్యవర్మ భటులతో పంపించేశాడు. 

‘మొదటి ప్రశ్న.. ప్రయాణంలో పడే ఇబ్బందుల గురించి వేశావు. రెండోది.. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం వేశావు. మూడో ప్రశ్నలో మాత్రం నీ ఆంతర్యం ఏంటో అర్థం కాలేదు’ అన్నాడు వీరవర్మ. ‘అలాగా!’ అంటూ నవ్వేశాడు చైతన్యవర్మ. ‘నీ సాహసయాత్రకు భరోసా దొరికినట్టే, ఇక నా లెక్క ప్రకారం మొదటివాడే నీకు సరిజోడు’ అన్నాడు వీరవర్మ. ‘కాదు, రెండోవాడు నాకు సరితోడు’ అన్నాడు చైతన్యవర్మ. అర్థంగాక... ‘ఎలా..?’ అంటూ నిశ్చేష్టుడయ్యాడు వీరవర్మ. 

‘మొదటి ప్రశ్నలో ప్రయాణ సంసిద్ధత దాగి ఉంది. అందులో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదన్నది నా ఆంతర్యం. రెండో ప్రశ్న ప్రయాణంలో ఆరోగ్యం గురించి. శ్రమ అనేది ఆరోగ్యానికి పెట్టుబడి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది ఆంతర్యం. ఇక మూడో ప్రశ్న.. ప్రయాణంలో అలసట లేకుండా ఉండేందుకు ఉపాయం గురించి. వెదురుకర్రకు వాతలు పెడితే తయారయ్యేది వేణువు. అది ఊదే సాధనం. నేను ఆ విద్యను సాధన చేస్తూ ముందుకు పోతే ఆ ఆనందంలో అలసట ఉండదనేదే అసలు అర్థం’ అని చెప్పాడు చైతన్యవర్మ. 

రెండోవ్యక్తిని ఎంపిక చేశాక.. లోక పర్యటనకు బయలుదేరాడు చైతన్యవర్మ. సంవత్సరం పాటు సాగిన సాహసయాత్రలో ఎంతో లోకజ్ఞానం సంపాదించాడు. తర్వాత తండ్రి కోరిక మేరకు పరిపాలనా పగ్గాలు చేపట్టాడు. సాహసయాత్రలో తోడుగా నిలిచిన ఆంతరంగిక సలహాదారుడికి మంత్రి పదవి ఇచ్చి సముచితంగా గౌరవించాడు. చైతన్యవర్మకు పాలన నల్లేరుపై నడకలా సాగింది.

- బి.వి.పట్నాయక్‌  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని