కోతుల రాజ్యం.. పక్షుల పాఠం!

అది ఒక సువిశాలమైన కోతుల రాజ్యం. ఒకప్పుడు ఆ అడవిలో అనేక రకాల జంతువులు, పక్షులు ఉండేవి. ఒకసారి ‘ధీర’ అనే కోతి రాజు.. మిగతా వానరాలన్నింటితో సమావేశమై, అడవిలోని జంతువులను, పక్షులను తరిమేయాలని నిర్ణయానికొచ్చింది.

Updated : 10 Mar 2023 02:22 IST

అది ఒక సువిశాలమైన కోతుల రాజ్యం. ఒకప్పుడు ఆ అడవిలో అనేక రకాల జంతువులు, పక్షులు ఉండేవి. ఒకసారి ‘ధీర’ అనే కోతి రాజు.. మిగతా వానరాలన్నింటితో సమావేశమై, అడవిలోని జంతువులను, పక్షులను తరిమేయాలని నిర్ణయానికొచ్చింది. అందుకు రకరకాల ప్రణాళికలు రచించింది ధీర. మొత్తానికి కోతున్నింటినీ ఏకం చేసి.. జంతువులను, పక్షులను నానా బాధలకు గురిచేసింది. రకరకాల చేష్టలతో వాటిని ఇబ్బంది పెట్టేది. కోతుల బెడద పడలేక క్రమంగా జంతువులు, పక్షులు ఆ అడవిని వదిలి వెళ్లిపోయాయి. ఇప్పుడక్కడ కోతులు మాత్రమే ఉన్నాయి. ఒకరోజు ఓ చిలుక అక్కడ ఆయాసంతో కోతుల రాజ్యానికి వచ్చింది. అలసటతో ఒక జామచెట్టుపై వాలి.. పండును తినసాగింది. అది చూసి కొన్ని కోతులు అక్కడ గుమికూడాయి. ‘మా అడవిలోకి రావడానికి నీకు ఎంత ధైర్యం.. వెళ్లిపో!’ అని అరిచాయి.

చిలుక వాటితో ‘నాది మీ పొరుగున ఉన్న పక్షుల రాజ్యం. మా పక్షి రాజు నన్ను దూతగా పంపాడు. మా అడవి చిన్నది. మా రాజ్యంలో ఆహార కొరత ఏర్పడి పిల్లలు, పెద్దలు ఆకలితో బాధ పడుతున్నారు. మీ రాజ్యంలో తరగని పండ్లు, దుంపలు ఉన్నాయి. అవి వృథాగా కుళ్లిపోతున్నాయి. వానలు పడి మా కరవు తీరేవరకూ వారానికి ఒకరోజు మేమంతా మీ రాజ్యానికి వచ్చి ఆకలి తీర్చుకుంటాం.. అందుకు మీ రాజు అనుమతి అడగడానికి దూతగా వచ్చాను’ అని చెప్పింది. కోతులన్నీ చిలుక వైపు గుర్రుగా చూశాయి. ఇంతలో ఓ కోతి పరుగున వచ్చి వానరరాజు, మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వెంటనే రావాలని అక్కడున్న కోతులకు సమాచారం అందించి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి అడవిలోని కోతులన్నీ వానరరాజు నివాసం వద్దకు చేరుకున్నాయి. చిలుక కూడా వాటివెంటే ఎగురుతూ వెళ్లింది.
పెద్ద బండరాయిపైన కూర్చుని ఉన్న వానరరాజు, చిలుకను చూసి.. ‘ఎవరు నువ్వు? మా అడవిలోకి ఎందుకు వచ్చావు?’ అని అరిచింది. చిలుక తాను వచ్చిన పని చెప్పింది. ‘మా రాజ్యంలోని ఆహారం మా సొంతం. తింటామో, తినగా మిగిలినవి వృథా చేసుకుంటామో మా ఇష్టం. మీ రాజ్యంలో కరవొచ్చి ఆహార కొరత ఏర్పడితే మాకేంటి.. వెళ్లిపో..’ అని కోప్పడింది వానరరాజు. చిలుక వినయంగా ‘వానరరాజా.. ఆకలిబాధ ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. ఇతరుల ఆకలిని తీర్చడం కంటే మించిన సత్కార్యం ఏముంటుంది?’ అంది. కోతులరాజు కోపంగా ‘మాకు ఎలాంటి పుణ్యాలూ అవసరం లేదు. నీతులు చెప్పకుండా వెళ్లిపో’ అంది. ‘ఈ భూమిని, విత్తనాలను, చెట్లను, నీళ్లను మీరు సృష్టించలేదు. మేమూ సృష్టించలేదు. ప్రకృతి సంపదపై అన్ని జీవులకూ అధికారం ఉంది. కానీ, మీరు ఈ సంపదను ఆక్రమించుకుని అనుభవిస్తున్నారు. మీది కాని ఈ సంపదలో కొంత ఎదుటివారి ఆకలి తీర్చడానికి ఉపయోగించి పుణ్యం కట్టుకోమంటున్నాను. ఈ దూత మాటలు ఆలకించండి.. ఆలోచించండి’ అంటూ విన్నవించింది చిలుక.
‘నీ మాటలు కట్టిపెట్టి, వెంటనే వెళ్లిపో.. లేకుంటే ప్రాణం తీస్తా’ అంటూ వానరరాజు చిలుకను అవమానించి తరిమేసింది. ‘నా బిడ్డ, మంత్రి బిడ్డ చాలాసేపటి నుంచి కనిపించడం లేదు. ఆడుకుంటూ ఎక్కడికెళ్లాయో ఏంటో వెంటనే వెతికి తీసుకురండి. అందుకే ఈ సమావేశం.. ఇక వెళ్లండి’ అని కోతులను ఆదేశించింది రాజు. కోతులన్నీ అడవిలో తలో దిక్కుకు వెళ్లాయి. చీకటి పడేవరకూ అణువణువూ వెతికాయి. అవెక్కడా కనిపించకపోవడంతో వానరరాజుకు, మంత్రికి కంగారు మొదలైంది. ‘అడవి దాటి ఎక్కడికెళ్లి ఉంటారు?’ అంది వానరరాజు. ‘ఎక్కడున్నారో? ఎలా ఉన్నారో? తిన్నారో? లేదో? ఆకలి, దాహంతో ఎంతగా అల్లాడుతున్నారో?’ అంటూ తల్లడిల్లిపోయాయవి. ‘పొరుగునున్న పక్షుల రాజ్యం వైపు వెళ్లాయేమో!’ అంది మంత్రి. ‘పక్షుల రాజ్యానికి వెళ్లి మా బిడ్డలున్నాయేమో ఎవరు చూసి వస్తారు?’ అడిగింది రాజు. ‘ఈ రాత్రివేళ ఎలా వెళ్లగలం? రాయబారిగా వచ్చిన చిలుకను మనం అవమానించి తరిమేశాం కదా.. ఒకరిద్దరం వెళ్తే పక్షులు దాడి చేస్తాయేమో.. మేం వెళ్లలేం’ అన్నాయా కోతులు.
‘మీరు చెప్పింది నిజమే.. ఉదయమే అందరం కలిసి గుంపుగా వెళ్దాం’ అన్నాయి రాజు, మంత్రి. తెల్లవార్లూ వాటికి కంటి మీద కునుకు లేకుండా, తిండి తినకుండా బిడ్డలు ఎలా ఉన్నారోనని దుఃఖిస్తూ గడిపాయవి. ఉదయమే కోతులన్నీ రాజు, మంత్రితో సహా పక్షుల రాజ్యానికి బయలుదేరాయి. కొంతదూరం వెళ్లగానే.. కోతి పిల్లలను వెంట పెట్టుకుని మెల్లిగా ఎగురుతూ వస్తున్న చిలుక వాటికి ఎదురైంది. దగ్గరకు రాగానే వానరరాజు, మంత్రి.. తమ బిడ్డలను హత్తుకున్నాయి. ‘మీ పిల్లలు చీకటి వేళకు మా రాజ్యం చేరుకున్నాయి. రాత్రి కావడంతో.. అప్పుడు తీసుకురాలేక, కడుపు నిండా తినిపించి, మావద్దనే వసతి కల్పించాం. ఉదయమే వాటిని తీసుకుని మీ రాజ్యానికి బయలుదేరాను. ఇంతలో మీరు ఎదురయ్యారు’ అంది చిలుక.
‘ఆకలి బాధతో అల్లాడుతూ, వారంలో ఒకరోజు మీ పక్షుల కోసం ఆహారం అర్థించడానికి వచ్చిన నిన్ను అవమానించి తరిమేశాను. అదేమీ మనసులో పెట్టుకోకుండా మీరు మా బిడ్డల కడుపు నింపి, వాటి ప్రాణాలను కాపాడారు. మీ సహాయ గుణానికి ధన్యవాదాలు. బిడ్డల మీద దిగులుతో నిన్నటి నుంచి ఆహారం ముట్టుకోలేదు. ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలిసింది. క్షమించు.. నువ్వు చెప్పినట్లు ఎదుటి వారికి చేతనైన సాయం చేయడానికి మించిన సార్థకత జీవితానికి ఏముంటుంది? మీరందరూ మా రాజ్యానికి ఎప్పుడైనా రావచ్చు.. మా అతిథులుగా ఎన్ని రోజులైనా ఉండవచ్చు’ అంది వానరరాజు. ‘ధన్యవాదాలు మహారాజా!’ అంది చిలుక. ఈ వార్త చెప్పడానికి చిలుక సంతోషంగా తన రాజ్యంవైపు ఎగిరిపోయింది.
డి.కె.చదువుల బాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని