Story: గోవిందయ్య మారిపోయాడు..!

ముక్కామల అని ఒక అందమైన పల్లెటూరు ఉంది. గోదావరి నది ఊరి మధ్య నుంచి ప్రవహిస్తుండటంతో అక్కడి ప్రజలకు నీటికి కొదవలేదు. ఆ గ్రామంలో గోపాలయ్య, గోవిందయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు.

Updated : 25 May 2024 00:32 IST


ముక్కామల అని ఒక అందమైన పల్లెటూరు ఉంది. గోదావరి నది ఊరి మధ్య నుంచి ప్రవహిస్తుండటంతో అక్కడి ప్రజలకు నీటికి కొదవలేదు. ఆ గ్రామంలో గోపాలయ్య, గోవిందయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు. వాళ్లు మంచి మిత్రులు కూడా. గోపాలయ్య ఉదయాన్నే నిద్రలేచి.. రచ్చబండ వద్దకు వెళ్లి కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి గోవిందయ్య కూడా వచ్చాడు. ఇద్దరూ ‘వరి ధాన్యాన్ని ఎలా అమ్మాలి’ అని మాట్లాడుకోసాగారు. ఆ ఊరిలోని రైతులంతా ఎక్కువగా వరి పండించేవారు. ఆ ధాన్యాన్ని అమ్మడానికి ఎడ్ల బండ్ల మీద పట్టణానికి తీసుకెళ్లేవారు. అక్కడికి వెళ్లిన తర్వాత వ్యాపారస్థులు వడ్లు తడిగా ఉన్నాయని, ఇంకా ఏవేవో సాకులు చెప్పి.. వారం గడిచినా ధాన్యాన్ని కొనేవారు కాదు. దాంతో రైతులు అమ్మడానికి అష్టకష్టాలు పడేవారు. 

‘మన ఊరిలోనే కొనుగోలు కేంద్రం ఉంటే ఇక్కడే ధాన్యాన్ని అమ్ముకునే వాళ్లం. ఇన్ని ఇబ్బందులు పడాల్సిన పని ఉండేది కాదు!’ అని అక్కడే ఉన్న కొంత మంది రైతులు మాట్లాడుకుంటుండగా గోపాలయ్య విన్నాడు. ‘ఇదేదో బాగుందే! ఇన్ని సంవత్సరాలు ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు’ అని మనసులోనే అనుకున్నాడు. వెంటనే ఆ విషయాన్ని గోవిందయ్యతో చెప్పాడు. ఇద్దరూ అధికారులను కలిసి.. కొన్ని రోజుల్లోనే గ్రామానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చారు. ఈ విషయం ఊరంతా తెలిసేలా.. చాటింపు వేయించారు. దాంతో రైతులంతా చాలా సంతోషించారు. అప్పటి నుంచి.. ఆ ఊరి రైతులతో పాటు, పక్క గ్రామాల రైతులు కూడా ఇక్కడే ధాన్యాన్ని అమ్మేవారు. ఆ కొనుగోలు కేంద్రాన్ని నడిపే బాధ్యతలు గోపాలయ్య, గోవిందయ్య చూసుకునేవారు. ధాన్యంలో ఎలాంటి తరుగు తీయకుండా రైతులకు మంచి ధర ఇచ్చేవారు. 

ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి.. రాను రాను గోవిందయ్యకు డబ్బు మీద ఆశ పెరిగిపోయింది. గోపాలయ్యకు తెలియకుండా రైతుల వద్ద బస్తాకు కొంత మొత్తం చొప్పున వసూలు చేయసాగాడు. ఒకరోజు రైతులంతా ఓ చెట్టు కింద కూర్చుని గోవిందయ్య చేసే పనుల గురించి మాట్లాడుకుంటుండగా.. అప్పుడే అటువైపుగా వచ్చిన గోపాలయ్య చెవిలో పడ్డాయి. ఆ మాటలు విని చాలా బాధపడ్డాడు. ‘ఇది ఇలాగే కొనసాగితే ఊర్లో చెడ్డ పేరుతో పాటు.. మళ్లీ మునుపటి రోజులే వస్తాయి. అందరూ పట్టణం బాట పట్టాల్సి వస్తుంది’ అని గోపాలయ్య మనసులోనే అనుకున్నాడు. వెంటనే రైతులందరినీ పిలిచి.. ‘మీ మాటలు విన్నాను. గోవిందయ్య తన మిత్రుడి కూతురి పెళ్లి కోసం.. అందరి దగ్గర కొంత డబ్బు సాయం తీసుకొని, తనకు అందజేయాలని నన్ను అడిగాడు. అందరికీ ఈ విషయం నేనే తెలియజేస్తానని చెప్పాను. కానీ చిన్న పని ఉండి.. పక్క గ్రామానికి వెళ్లాను. కానీ మీకు నేను చెప్పి ఉంటానని గోవిందయ్య డబ్బులు అడిగి ఉంటాడు. మరోలా భావించకండి’ అన్నాడు. ‘అలాగా..! గోవిందయ్యను తప్పుగా అర్థం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించండి’ అన్నారు అక్కడున్న వాళ్లంతా. 

మరుసటి రోజు గోవిందయ్య పెళ్లికి వెళ్తున్నానని చెప్పడానికి.. గోపాలయ్య ఇంటికి వచ్చాడు. గోపాలయ్య భార్య రుక్మిణి, తన భర్తతో.. ‘మీరు.. మీ మిత్రుడు గోవిందయ్య ఇద్దరూ కలిసే వ్యాపారం చేస్తున్నారు కదా? అతనికి ఎక్కువ లాభాలు వస్తున్నాయి. మీరేమో అక్కడికి అక్కడే ఖర్చులు సరిపోతున్నాయి అంటున్నారు’ అని అడిగింది. ఆ మాటలకు.. ‘గోవిందయ్య, తన మిత్రుని కూతురు పెళ్లికి డబ్బు సాయం చేస్తున్నాడు. ఖర్చుల కోసం నేనే నా వాటాలో కొంత డబ్బు ఇచ్చాను. తర్వాత మళ్లీ ఇస్తానన్నాడు’ అని బదులిచ్చాడు గోపాలయ్య. గుమ్మం దగ్గరే ఉండి, ఈ మాటలన్నీ విన్న గోవిందయ్య.. మిత్రుడిని క్షమించమని వేడుకున్నాడు. ‘డబ్బు మీద ఆశతో ఇలా చేశాను. నేను తప్పు చేసినా.. నా పరువు పోకుండా కాపాడావు. నిన్న నువ్వు రైతులతో మాట్లాడింది కూడా విన్నాను. ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయను. నేను రైతుల దగ్గర తీసుకున్న డబ్బును నిజంగానే నా చిన్ననాటి మిత్రుని కూతురి పెళ్లి ఖర్చులకు అందజేస్తాను’ అన్నాడు. మిత్రుడిలో వచ్చిన మార్పునకు గోపాలయ్య చాలా సంతోషించారు. అప్పటి నుంచి సంతోషంగా వ్యాపారం సాగింది.

ముక్కామల జానకీరామ్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని