కొడుకే స్నేహితుడైతే!

‘రవీ సంచి తీసుకురా, అలా మార్కెట్‌కు వెళదాం’ అన్న పురుషోత్తం మాటలకు.. ‘అలాగే నాన్నగారూ!’ అంటూ బయలుదేరాడు రవి. ‘ఎందుకండీ వాడిని అలా అన్ని చోట్లకు మీ వెంట తిప్పుకొంటారు’ అంది భారతి. ‘చూడు భారతీ! పిల్లలకు, చదువొక్కటే కాదు, అన్ని విషయాలూ తెలియాలి. ఇలా ఇంట్లో కూర్చుని పాఠాలు బట్టీపట్టడం, సెల్‌తో ఆటలాడడం కొంత వరకే, చాలా విషయాలు బయట తిరిగితేనే తెలిసేది’ అంటూ...

Published : 10 Jan 2023 00:14 IST

‘రవీ సంచి తీసుకురా, అలా మార్కెట్‌కు వెళదాం’ అన్న పురుషోత్తం మాటలకు.. ‘అలాగే నాన్నగారూ!’ అంటూ బయలుదేరాడు రవి. ‘ఎందుకండీ వాడిని అలా అన్ని చోట్లకు మీ వెంట తిప్పుకొంటారు’ అంది భారతి. ‘చూడు భారతీ! పిల్లలకు, చదువొక్కటే కాదు, అన్ని విషయాలూ తెలియాలి. ఇలా ఇంట్లో కూర్చుని పాఠాలు బట్టీపట్టడం, సెల్‌తో ఆటలాడడం కొంత వరకే, చాలా విషయాలు బయట తిరిగితేనే తెలిసేది’ అంటూ కొడుకును స్కూటర్‌ ఎక్కించుకుని బయలుదేరాడు పురుషోత్తం.

‘ఏంటండీ మీ అబ్బాయిని కూడా తీసుకువచ్చారు’ అని పలకరించాడు ఓ దుకాణం యజమాని. ‘వీలున్నంతలో నేను నా కొడుకుతో గడపడానికే చూస్తాను. వాడికీ అదే ఇష్టం’ అన్నాడు పురుషోత్తం. ‘మంచిది.. ఇలా తల్లిదండ్రులు పిల్లలతో గడిపితే ఎంత బాగుంటుందో’ అన్నాడతను. ‘నాన్నగారూ.. రేపు మా స్కూల్‌లో పేరెంట్స్‌ డే. గుర్తుందిగా’ అన్నాడు రవి.

ఆ రోజు భారతి విద్యానికేతన్‌ స్కూల్‌లో పేరెంట్స్‌డే జరుగుతోంది. ప్రముఖ విద్యావేత్త, సైకాలజీ ప్రొఫెసర్‌ విద్యానంద్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. భారతి విద్యానికేతన్‌ స్కూల్‌ అంతా కోలాహలంగా ఉంది. పిల్లల  పక్కనే తల్లిదండ్రులకు సీట్లు కేటాయించారు. ముఖ్య అతిథిని వేదికపైకి తీసుకుని వచ్చారు ప్రధానోపాధ్యాయుడు. ఆహ్వానితుల పరిచయాల తర్వాత.. పాఠశాల స్థాపన, దాని ముఖ్య ఉద్దేశాలు, ఇప్పటి వరకు సాధించిన ప్రగతి గురించి వివరించారు ప్రధానోపాధ్యాయుడు. తరువాత విద్యానంద్‌ ప్రసంగం మొదలైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల బాధ్యతపై ప్రసంగించారాయన.

‘ఇప్పుడు నేనొక ప్రశ్న అడుగుతాను. నేను ఎవరిని అడిగితే వారే సమాధానం చెప్పాలి. జవాబు తెలియక పోయినా ఫరవాలేదు. పిల్లల ఉన్నతికి ఉపాధ్యాయుల పాత్ర ఏంటి? ఈ ప్రశ్నకు నాలుగో వరసలో ఆరో వారు సమాధానం చెప్పాలి’ అన్నారు. అక్కడ రవి స్నేహితుడు శేఖర్‌ తండ్రి ఉన్నారు. మైక్‌ ఆయనకు అందించారు. ఆయన తడబడుతూ... తనకు తోచింది చెప్పారు. ‘బావుంది అంటూ...’ ఆయనకు ఒక చాక్లెట్‌ పంపారు విద్యానంద్‌.

‘నేటి పిల్లలు పెద్దయ్యాక... తల్లిదండ్రులను సరిగ్గా చూడడం లేదన్నదాంట్లో తప్పెవరిదన్న ప్రశ్నకు రెండో వరుసలో అయిదో వ్యక్తి, మీరు సమాధానం చెప్పండి’ అన్నారు విద్యానంద్‌. అక్కడ కూర్చున్నది రవి తండ్రి పురుషోత్తం. ఆయన లేచి మైక్‌ అందుకున్నారు. ‘సార్‌.. ఇద్దరు మంచి స్నేహితులు ఎప్పటికీ విడిపోరు. అవసరానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఎవరున్నా లేకున్నా మంచి స్నేహితుడు ఉండాలి అంటారు. కానీ ఇంట్లో ఉండే కొడుకు, కూతురు అలా ఉండకపోవడానికి కారణం ఆ తల్లిదండ్రుల పెంపక లోపమే అంటాను నేను’ అన్నారు.

‘మరైతే... ఎలా పెంచాలంటారు’ అని అడిగారు విద్యానంద్‌. హాలంతా నిశ్శబ్దంగా మారిపోయింది. పురుషోత్తం ఏం చెబుతారో అని వింటున్నారు. ‘కొడుకును స్నేహితుడిగా ఎందుకు పెంచకూడదు. లోపాలు సున్నితంగా ఎత్తి చూపండి. కొడుకు చేసే మంచి పనులను అభినందించండి. కొడుకుతో, కూతురుతో ఎక్కువ సమయం గడిపేలా చూడండి. కనీసం వాళ్లను పాఠశాలలో ఒకరోజు దింపలేని వారు, వారితో ఒక గంట కూడా గడపలేని వారు, వారితో ఒకపూట భోజనం కలిసి చేయలేని వారు.. పెద్దయ్యాక వాళ్లు మమ్మల్ని చూడలేదు అనడం తప్పు. డబ్బు ఒక్కటే అందిస్తే చాలదు సార్‌. మంచి సంస్కారం కూడా అందించాలి. తల్లిదండ్రులు, పిల్లలతో ప్రేమను పంచుకోవాలి. అప్పుడు వాళ్లు మిమ్మల్ని ఎందుకు వదిలి పోతారు. నా పెద్దకొడుకును అలాగే పెంచాను. ఈ రోజు వాడు మమ్మల్ని చూడనిదే ఒక్కరోజు కూడా ఉండలేడు. అందుకోసం వాడు అమెరికాలో ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. అందుకే కొడుకును స్నేహితుడిగా పెంచండి అంటాను. మంచి స్నేహితుడు ఎప్పటికీ మిమ్మల్ని మరచిపోడు’ అంటూ ముగించాడు పురుషోత్తం. హాలంతా చప్పట్లతో మారుమోగి పోయింది. విద్యానంద్‌ వేదిక దిగి వచ్చి గుప్పెడు చాక్లెట్లను పురుషోత్తం చేతిలో పోశారు. రవి హృదయం పొంగి పోయింది. అందరినోటా ఒకే మాట.. ‘కొడుకే స్నేహితుడైతే!’  

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని